మేము సైతం….సురేష్ కోసం?

దగ్గుబాటి సురేష్…మూవీ మొఘల్ రామానాయుడి కుమారుడు. ఇప్పుడు టాలీవుడ్ హుద్ హుద్ కోసం చేస్తున్న కార్యక్రమం మొత్తం తన భుజాలపై వేసుకున్న వ్యక్తి. అయితే మేము సైతం కార్యక్రమం ఏర్పాట్లు ప్రారంభమైన దగ్గర నుంచి…

దగ్గుబాటి సురేష్…మూవీ మొఘల్ రామానాయుడి కుమారుడు. ఇప్పుడు టాలీవుడ్ హుద్ హుద్ కోసం చేస్తున్న కార్యక్రమం మొత్తం తన భుజాలపై వేసుకున్న వ్యక్తి. అయితే మేము సైతం కార్యక్రమం ఏర్పాట్లు ప్రారంభమైన దగ్గర నుంచి తెరవెనుక సురేష్ బాబుపై గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఆయన ఆంధ్ర సిఎమ్ చంద్రబాబు దగ్గర తన పలుకుబడి పెంచుకునేందుకు ఇదంతా చేస్తున్నారని, అందుకోసం తెలుగు సినిమా జనాలను తన పలుకుబడితో వత్తిడి చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో వున్న కట్టుబాట్ల కారణంగా ఎవ్వరూ పైకి పెదవి విప్పడం లేదు. ఆఫ్ ది రికార్డు గా మాత్రం ఎంతయినా మాట్లాడుతున్నారు.

అసలు జెమిని టీవీకి హక్కులు దఖలు చేయడం వెనుక కూడా మతలబు వుందన్నది గుసగుసల సారాంశం. మా టీవీ ఈ హక్కుల కోసం అయిదు నుంచి ఆరు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిందని, అయితే జెమిని ఇంకా ఎక్కువ ఇస్తోందని చెప్పి నిరాకరించారని అంటున్నారు. 

అయితే జెమిని మాత్రం మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యలో అందించినందని, అది తెలిసి మాటీవీ వర్గాలు నివ్వెర పోయాయని అంటున్నారు. భీమవరం బుల్లోడు, దృశ్యం, గోపాలగోపాల శాటిలైట్ హక్కులకు, ఈ ఉదంతానికి ముడి వుందన్నది గుసగుసల సారాంశం. అయితే నిజం ఎంతవరకు అన్నది తెలియదు. గుసగుసలైతే వినిపిస్తున్నాయి.

ఆంధ్రలో ఎంటర్ టైన్ మెంట్ సిటీ నిర్మించబోతున్నారని, విశాఖలో ఇంకా చాలా వస్తాయని, వీటిల్లో అవకాశాలు అంది పుచ్చుకునేందుకు కొందరు సినిమా పెద్దలు ఈ కార్యక్రమం తలకెత్తుకున్నారని టాలీవుడ్ జనాలు ఆంతరంగికంగా చెప్పకుంటున్నారు. ఆ సిఎమ్ ఇక్కడ?

విశాఖ కోసం చేసే కార్యక్రమం విశాఖలోనో, విజయవాడలోనో చేస్తే బాగుండేదని, అది హైదరాబాద్ లో చేసి, అదీ ఇక్కడి ముఖ్యమంత్రిని పిలవకుండా, అక్కడి ముఖ్యమంత్రిని ఇక్కడకు పిలిచి కార్యక్రమం చేయడం ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ముఖ్యమంత్రిని పిలిచి, ఆయన చేతుల మీదుగా, అక్కడి ముఖ్యమంత్రికి చెక్కు అందిస్తే, టాలీవుడ్ అందరిదీ అన్న భావన నెలకొనేదని, ఇప్పుడు ఆంధ్ర వారిదేనా అన్న విమర్శ వస్తుందని అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

మొన్న ఎన్నికలప్పుడు టాలీవుడ్ ప్రముఖలు చాలా మంది బాహాటంగా చంద్రబాబుకు మద్దతు పలకలేదు. జగన్ గెలుస్తాడన్న అభిప్రాయం, కేసిఆర్ ఇక్కడ వున్నారన్న భావన వీటి వెనుక వున్నాయని, ఇప్పుడు ఆంధ్ర లో పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వంతో అందివచ్చే వ్యవహారాలు చాలా వుండడంతో, చంద్రబాబును మంచి చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం తలకెత్తుకున్నారని, తెలుగుదేశంతో పరిచయం, సంబంధాలు వున్న ఓ టాలీవుడ్ వ్యక్తి విమర్శించారు. 

అయితే సినిమా జనాలు అందరికీ బాబుతో పని వుంది కాబట్టిై, ఎందుకొచ్చిన గొడవ అని సురేష్ కు సహకరించేసి, తెరవెనుక సణుక్కుంటున్నారని టాక్. నిజమెంతో టాలీవుడ్ జనాలకే తెలియాలి.