ఒకప్పుడు హైదరాబాద్ లో జబర్దస్తీ గణపతి చందాలు వుండేవి. నీ వాటా ఇంత అని డిసైడ్ చేసేయడమే. ఇప్పుడు మేము సైతం అంటూ సినిమావాళ్ల ఆంధ్ర సిఎమ్ మెహర్బానీ (ఈ మాట టాలీవుడ్ లో వినిపిస్తున్న సణుగుళ్లలోంచి పుట్టింది) కార్యక్రమం కోసం కూడా అదే వ్యవహారం నడించింది. సెలబ్రిటీ డిన్నర్ కార్యక్రమం నిజానికి జనాలకు ఉద్దేశించింది.
వాళ్లు లక్ష రూపాయిలు ఖర్చు చేసి వస్తే, సెలబ్రిటీలతో కలిసి డిన్నర్ చేసే అవకాశం లభిస్తుంది. అయితే ఈ టికెట్ లను కూడా సినిమా జనాలకే అంటగట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంత మంది దర్శకులు కూడా లక్షరూపాయిలు ముట్ట చెప్పి టికెట్ లు తీసుకుని తమవారికి ఎవరికైనా ఇచ్చుకున్నారు. తెలంగాణ కు చెందిన ఓ పంపిణీదారుడు, థియేటర్ల లీజు దారుడికి ఏకంగా ముఫై టికెట్ లు అంటగట్టినట్లు తెలిసింది.
అదే విధంగా కబడ్డీ, క్రికెట్ టికెట్ లు యాభై వంతున బంచ్ గా కోటాలు విధించి, అంటగట్టారని కృష్ణనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా పెద్దలు వేసిన ఈ కోటాను, తమ తమ అవసరాల కోసం భరించక తప్పలేదని, అసలే సరైన వ్యాపారాలు లేని సీజన్ లో స్థానిక తన్నులు అదనం అన్నట్లు ఈ ఖర్చు వచ్చి పడిందని కొందరు వ్యాఖ్యనించారు.