వ్యూహ‌క‌ర్త వెన‌క‌డుగు!

యూట‌ర్న్‌లో మ‌న చంద్ర‌బాబునాయుడిని ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ గుర్తు చేస్తున్నారు. అచ్చం ఆయ‌నలా వెంట‌నే మార్చ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు పీకే ట్వీట్ చేశారు. అది…

యూట‌ర్న్‌లో మ‌న చంద్ర‌బాబునాయుడిని ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ గుర్తు చేస్తున్నారు. అచ్చం ఆయ‌నలా వెంట‌నే మార్చ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు పీకే ట్వీట్ చేశారు. అది కూడా త‌న సొంత రాష్ట్ర‌మైన బిహార్ నుంచి ప్ర‌స్థానం మొద‌లు పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ ట్వీట్ చేసి క‌నీసం రెండుమూడు రోజులు కూడా గ‌డ‌వ‌క‌నే పీకే తూచ్‌తూచ్ అనడం గమ‌నార్హం.

ప్ర‌స్తుతానికి రాజ‌కీయ పార్టీ ఏదీ పెట్ట‌లేద‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారాయ‌న‌. మ‌రి ట్వీట్ సంగ‌తేంట‌య్యా అని ప్ర‌శ్నించేవాళ్లకు ఆయ‌న స‌మాధానం… బిహార్ అభివృద్ధి కోసం 3 వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేస్తార‌ట‌. పాద‌యాత్ర విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఆయ‌న వైఎస్ జ‌గ‌న్‌ను ఆద‌ర్శంగా తీసుకోవ‌డం విశేషం. జ‌న‌సురాజ్ పేరుతో కొత్త ప్ర‌యాణం మొద‌లు పెడ‌తాన‌ని ఇటీవ‌ల చేసిన ట్వీట్‌పై పీకే ఇవాళ మీడియా స‌మావేశంలో స్ప‌ష్ట‌త ఇచ్చారు.

బిహార్‌లో వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను సుమారు 17 వేల నుంచి 18 వేల మందిని క‌ల‌వ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రాజ‌కీయ వేదిక కావాల‌ని కోరితే మాత్రం అప్పుడు తాను ఆలోచిస్తాన‌ని పీకే వెల్ల‌డించ‌డం విశేషం. బిహార్‌లో ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేక‌పోవ‌డంతో కొత్త పార్టీ పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని పీకే తేల్చి చెప్పారు. 

అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని చంపార‌న్‌లోని గాంధీ ఆశ్ర‌మం నుంచి పాద‌యాత్ర మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు పీకే వెల్ల‌డించారు. ఒక మాట అన‌డం, దానిపై యూట‌ర్న్ తీసుకోవ‌డంలో చంద్ర‌బాబు పేటెంట్ తీసుకున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. అందుకే ఎవ‌రైనా మాట‌పై నిల‌బ‌డ‌క‌పోతే బాబును గుర్తు చేసుకుంటారు. రాజ‌కీయ పార్టీపై పీకే వెన‌క‌డుగు చూస్తుంటే ఆయ‌న‌లో భ‌య‌మేదో క‌నిపిస్తోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.