నాగభూషణం లాంటి విలన్లతో సమస్య ఏమంటే విలన్ అని గుర్తు పట్టడమే కొంచెం కష్టం. సినిమాల్లో ok కానీ, నిజ జీవితంలో మరీ కష్టం. చాలా సార్లు గుర్తు పట్టలేం కూడా. మనింట్లో, ఇంటి పక్కన కూడా నాగభూషణాలు ఉంటారు. వాళ్లని మనం చిత్తూరు నాగయ్య అనుకుంటూ వుంటాం.
విలన్ అంటే క్రూరంగా కనిపిస్తూ , “హహ్హహ్హ” అని నవ్వుతూ పెద్దగా అరుస్తూ వుండాలి. తెలుగు సినిమాల్లో చాలా మంది ఇలా అరుపులగాళ్లే అయితే సాఫ్ట్ విలన్‌గా నాగభూషణానికి ముందు సీఎస్ఆర్ చేశారు. ఆయన తర్వాత నాగభూషణం. ఆయన్ని రావుగోపాలరావు, నూతన ప్రసాద్ అందుకున్నారు. ఇప్పుడు రావు రమేశ్.
నాగభూషణం ప్రత్యేకత ఏమంటే తెల్లటి బట్టలు, నాణ్యమైన చిరునవ్వు, చెవిలో పువ్వు, ఒకటే వినయం. పూలదండతో గొంతు కోయగలరు. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా వీళ్లదే మెజార్టీ.
1922లో పుట్టారు. ఈ ఏడాది శతజయంతి. అయితే ఆయన కొడుకు పెద్ద నిర్మాతగా, మనుమడు సూపర్ హీరోగా వుంటే ఈ ఉత్సవాన్ని ఇండస్ట్రీ ఘనంగా నిర్వహించేది. వారసులు లేని నటుల్ని ఎవరూ గుర్తు పెట్టుకోరు. ఇందిరాగాంధీ లేకపోతే నెహ్రూని కూడా మరిచిపోయేవాళ్లు.
నెల్లూరులో చదువుకుని, రైల్వేలో పని చేసి సినిమా పిచ్చితో మద్రాస్ చేరుకున్నారు. నటుడిగా ప్రయత్నిస్తూ నాటకాల మీద దృష్టి సారించారు. నటి రాధికా తండ్రి ఎంఆర్.రాధా (1967లో MGRపై కాల్పులు జరిపి జైలుకెళ్లాడు) తమిళంలో రక్తకన్నీరు నాటకం వేసేవాడు. అది చాలా ఫేమస్. దీని ప్రత్యేకత ఏమంటే ప్రతిరోజూ డైలాగ్‌లు మారేవి. నాటకం ఆడే ఊరు ఆధారంగా మెరుగులు దిద్దేవారు. ఆ నాటకాన్ని పాలగుమ్మి పద్మరాజుతో తిరగరాయించి నాగభూషణం వేల ప్రదర్శనలు ఇచ్చాడు. సూపర్‌హిట్. వాణిశ్రీ, శారద కూడా ఒకప్పుడు నాగభూషణం ట్రూప్‌లో పనిచేసిన వాళ్లే.
నాగభూషణం కూడా ఎంఆర్ రాధాలా అప్పటికప్పుడు సెటైర్లు వేసేవాడు. ఒకసారి నీలం సంజీవరెడ్డి నాటకం చూడడానికి వస్తే “నీలం సంజీవరెడ్డి కులం అడిగేంత అమాయకున్నా నేను” అని డైలాగ్ వేశాడు.
అనంతపురంలో ప్రదర్శించినప్పుడు “ఊళ్లోని రోడ్లు, గోతులు చూస్తే తెలియదా అనంతపురంలోని అభివృద్ధి” అన్నాడు. నాటకాన్ని ఉచితంగా కాకుండా టికెట్ పెట్టి చూడాలని ఆయన కోరిక. ఒకసారి “నేనేమైనా ఫ్రీ పాస్ తీసుకుని ముందు వరుసలో కూచునే టైపు అనుకున్నావా” అని సెటైర్ వేస్తే ఫ్రీ పాస్‌ల వాళ్లు ఏడ్వలేక నవ్వారు.
సినిమాల్లో డైలాగ్‌లు పలికే పద్ధతి, పదాలు విరిచే విధానంలో నాగభూషణంది ప్రత్యేక స్టైల్. “ఇప్పటి నటులకి తెలుగే సరిగా రాదు, ఇక మాడ్యులేషన్ ఎలా నేర్పుతాం?” అని ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి ఆయన వాపోయాడు.
నాగభూషణం వున్నాడంటే రచయితలు కూడా ప్రత్యేకంగా రాసేవాళ్లు.
“పెళ్లాం లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా భరించొచ్చు, పదవి లేకపోతే భరించడం కష్టం” (ప్రజానాయకుడు)
“మమ్మల్ని మేము మోసం చేసుకుంటాం కానీ, విదేశీయుల్ని ఎన్నటికీ మోసం చేయం” (దేశోద్ధారకులు)
“చరిత్ర అడక్కు, చెప్పింది విను” (అడవిరాముడు)
నటించిన ప్రతి సినిమాలోనూ ప్రత్యేకత చూపేవాడు. కథ నచ్చకపోతే నటించేవాడు కాదు. ఆ గ్యాప్‌లో “రక్తకన్నీరు” ఆడేవాడు. ఆయన , అల్లు రామలింగయ్య కలిస్తే కామెడీకి కామెడీ, విలనీకి విలనీ.
ఇంత తెలివైన నాగభూషణం కూడా ఎన్టీఆర్ గళ్లా లుంగీ కట్టుకుని మారువేషం వేస్తే ఎందుకు గుర్తు పట్టలేకపోయే వాడో చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు.
ఆయన మీద జనానికి ఎంత అభిమానం అంటే ఒకవేళ మంచి పాత్రలో కనిపించినా సులభంగా నమ్మేవాళ్లు కాదు. నాగభూషణం ఏదో ఫిటింగ్ పెడతాడని ఎదురు చూసేవాళ్లు.
ప్రముఖ కెమెరామన్ మీర్ ఆయన అల్లుడు. మనుమడు కూడా నటిస్తున్నాడు. నాగభూషణం ఎప్పటికీ ఎందుకు గుర్తుంటాడంటే మనం రోజు పేపర్లు, టీవీలు, యూట్యూబ్‌ల్లో చూసేవాళ్లలో ఎక్కువ మంది ఆయన ప్రతిరూపాలే కాబట్టి. (మే 5 నాగభూషణం వర్ధంతి)
జీఆర్ మహర్షి