గాళ్స్ నైటవుట్స్ ఇండియన్ కల్చర్ కాదు
దుమారం రేపుతున్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు
ఆడవాళ్లపై వివక్షే ఇండియన్ కల్చరా?
ఆగ్రహిస్తున్న మహిళాలోకం
మారుతున్న కాలంలో స్త్రీపాత్ర అనిర్వచనీయం
‘‘గాళ్స్ వాంటింగ్ ఎ నైట్‌అవుట్ మే బీ ఆల్‌రైట్ ఎల్స్‌వేర్, బట్ ఇట్‌ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్’’ కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి మహేశ్‌శర్మ చేసిన ఈ వ్యాఖ్య ప్రస్తుతం దుమారం రేపుతోంది. ‘మహిళల రాత్రిజాగారాలు మరెక్కడైనా సబబు కావచ్చేమోగానీ, భారతీయ సంస్కృతిలో అది భాగం కాదు’ అంటూ ఆయన ఇండియన్ కల్చర్‌ని ఏకవాక్యంలో నిర్వచించారు. ఈ నిర్వచనానికి మద్దతిస్తూనే మరికాస్త పొడిగింపుగా మరో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి‘‘కేవలం మహిళలేక కాదు, మగవాళ్లకి కూడా నైట్‌లైఫ్ సమంజసం కాద’ంటూ సెలవిచ్చారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలు చేసే కీలకభూమికలు నిర్వహించే మన రాజకీయ నాయకులు ఇలా ఇష్టారాజ్యంగా ప్రకటనలు గుప్పించడం ఇవాళే కొత్తకాదు. గతంలో అనేక సందర్భాల్లో స్త్రీపురుష వివక్షను తెరపైకి తెస్తూ చేస్తున్న వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్న ప్రజానీకం తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తుండడం ఈ దేశంలో ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఆడవారి నడక మీద, నడత మీద, నవ్వు మీద, మాట మీద, చివరాఖరికి ఒంటిపై వేసుకునే వస్త్రాలపై కూడా ఆంక్షలు, కుట్రలు, కుతంత్రాలు పేట్రేగిపోతున్నాయనే అభిప్రాయం మహిళాలోకంలో రోజురోజుకు ప్రబలిపోతోంది. దేశజనాభాలో సగభాగమైన స్త్రీలపట్ల ఈ వైఖరి ఏమాత్రం సమంజసం కాదనే సలహాలు వ్యక్తమవుతున్నాయి.
పురుషాధిక్యవ్యవస్థలో స్త్రీ ద్వితీయశ్రేణి పౌరురాలనే విషయాన్ని విపులంగా వివరించేందుకు అనేక దారుల్లో దాడులు సాగుతూనే ఉన్నాయంటున్నారు స్త్రీవాదులు. అందులో భాగంగానే కేంద్రమంత్రి తాజా వ్యాఖ్యని కూడా పరిగణించొచ్చంటున్నారు అభ్యుదయవాదులు. కాలాన్ని కత్తిరించి…ఆడవాళ్లకు రాత్రులు లేవంటూ ప్రకటించడం…ఓపక్క ఆధునికత సంతరించుకుంటూ ప్రపంచం పరుగులు తీస్తున్నా కూపస్థమండూకాల్లా తమ ప్రపంచం ఇరుకేనంటూ నిస్సిగ్గుగా ప్రకటించడం ఏ సంస్కృతికి నిదర్శనమనే ప్రశ్నలు ‘కొడవలి’లా పదునెక్కుతున్నాయి. మారుతున్న కాలాన్ని, సమాజాన్ని అర్ధం చేసుకోకుండా లింగవివక్షకు అద్దంపట్టేలా ప్రముఖులే అసందర్భపు వ్యాఖ్యలు చేయడం అనర్ధాల్నే తీసుకొస్తోందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. ‘ఆకాశంలో సగమ’ంటూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ నాలుగ్గోడల మధ్య నలిగే ‘వంటింటి కుందేల’నే మచ్చను చెరిపేస్తోంది వర్తమానాన్ని అభ్యున్నతపథంలో నడిపించేందుకుగాను తనవంతు పాత్ర ఇతోధికంగా నిర్వర్తిస్తున్న మహిళాలోకం. ఆకాశాల్ని, సముద్రాల్నీ ఈదేస్తూ అనేక సవాళ్ళకు సమాధానం చెప్తూ కొత్త లక్ష్యాల్ని నిర్ధేశించుకుంటూ ముందుకు సాగుతోంది ఆధునిక మహిళ. అలాంటి మహిళ వర్తమాన పరిస్థితుల్లో…మారుతున్న ప్రాధమ్యాలు, అవసరాలకనుగుణంగా అర్ధరాత్రులు సైతం విధినిర్వహణలో భాగంగా సంచరించాల్సి ఉంటుంది. శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న ఈ ప్రపంచంలో ఈ తరహా జీవనశైలి అనివార్యమంటున్నారు. ఆ విషయం అర్ధం చేసుకుని మహిళా ప్రతిభకు మద్దతివ్వాల్సిందిపోయి…సాక్షాత్తూ పాలకపక్షాన ఉన్నవాళ్లే ‘మహిళల నైట్ అవుట్’లకు వ్యతిరేక వ్య్యాలు చేయడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
నేతలు అయోమయంలో ఉన్నారా?
ప్రస్తుత పరిస్థితులపై అవగాహనాలోపంతోపాటు, అయోమయం పాలనాపగ్గాలు చేపట్టిన నేతల్లో ఎక్కువగానే ఉందనే విషయం ఇలాంటి వ్యాఖ్యలవల్ల స్పష్టమవుతోందని యువత నిరసిస్తోంది. ఏకకాలంలో రెండుపడవలపై ప్రయాణం ఎంత ప్రమాదమో…పరస్పర విరుద్ధమైన భావాల్ని నమ్ముకోవడం అంతే ప్రమాదమని చెప్తోంది. ఓవైపు ప్రపంచదేశాలతోపాటు భారతదేశం ఆధునికసాంకేతికతను ఆవాహన చేసుకుంటూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించేందుకు అవిరళ కృషి చేయాలంటూ ఈ నేతలే సమయం చిక్కినప్పుడల్లా ఉపన్యాసాలు దంచేస్తుంటారు. ఆ చెప్పిన మాటలకు విరుద్ధమైన ప్రకటనల్ని కూడా గుప్పిస్తుంటారంటూ యువత తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ప్రపంచదేశాలతో పోటీపడాలంటే…పగలు, రాత్రనే విభజన లేకుండా పనిచేయాల్సిందేనని..ఆ పద్ధతిని ఆహ్వానించాల్సిందేనంటున్నారు. అయితే, ఆ మార్పును జీర్ణించుకోలేని పరిస్థితుల్లో వెనక్కిలాగుతూ ఈ తరహా వ్యాఖ్యలతో తమ వ్యక్తిగత అభిప్రాయాల్ని సమాజంపై రుద్దేందుకు కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారనే విమర్శలూ ఎదురవుతున్నాయి.
నిజమైన స్వాతంత్య్రమంటే…?
అర్ధరాత్రివేళ ఆడది ఏ భయంలేకుండా ఒంటరిగా సంచరించిననాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని జాతిపిత మహాత్మాగాంధీ ఆనాడే అభిప్రాయపడ్డారు. అయితే, భౌగోళిక స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకూ…మహిళలకు రక్షణ కరువైంది. ఇంట్లో, వీధిలో, పనిచేసే చోటులో…ఇలా ఎక్కడపడితే అక్కడ వేధింపులకు గురవుతున్న జాతి స్త్రీ జాతి. ఈ నేపధ్యంలో బాధితుల పక్షాన నిలవాల్సిన కేంద్రపర్యాటక, సాంస్కృతికశాఖామంత్రి మహేశ్ శర్మ వ్యాఖ్యలు జాతిపిత వ్యక్తం చేసిన స్వాతాంత్య్రాభిలాషేక వ్యతిరేకంగా ఉందంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అవసర సమయాల్లో అర్ధరాత్రి మహిళ సంచరించే సురక్షితమైన పరిస్థితుల్ని కల్పించాల్సిందిపోయి…‘ఇండియన్ కల్చర్’కి విరుద్ధమంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కీలకపదవుల్లో ఉన్నవ్యక్తుల బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెడిపోవడానికి లింగవివక్ష ఉంటుందా? అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆడదైనా, మగాడైనా అర్ధరాత్రుల్లో నీతిబాహ్యమైన పనులు చేస్తే ఖండించాల్సిందేనంటూనే…మారుతున్న సమాజంలో మహిళలు అర్ధరాత్రులు సైతం విధులు నిర్వర్తించాల్సిన అనివార్యతను కచ్చితంగా అవగాహన చేసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సంస్కృతి పేరుతో మహిళాలోకాన్ని ఇంకా నాలుగ్గోడలేక పరిమితం చేసే అభిజాత్యపు అహంకారధోరణిని విడనాడి…పట్టణ ప్రాంతాల్లో రాత్రుళ్లు సైతం మహిళలు పనిచేస్తున్న విషయాన్ని గుర్తించాలని నొక్కివక్కాణిస్తున్నారు. ఇది మారుతున్న ప్రపంచపు పరిణామానుక్రమమని చెప్తున్నారు.
మహిళలపై విరుచుకుపడడం నేతలకు అలవాటేనా?
ఇప్పుడే కాదు…మహిళలపై విరుచుకుపడడం ఎప్పట్నుంచో మన నేతలకు అలవాటేనంటూ మండిపడుతోంది యువత. ఆడవాళ్లపై మగమృగాళ్ల వేధింపులు, సాధింపులు, యాసిడ్ దాడులు, అమానవీయ అకృత్యాలు అరికట్టడంలో దారుణంగా విఫలమవుతున్న పాలకులు..తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికిగాను ఇలాంటి అర్ధంపర్ధం లేని వ్యాఖ్యలతో మీడియా ముందుకొస్తుంటారంటోంది. మూడేళ్ల క్రితం దేశరాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన సందర్భంలోనూ, ముంబై శక్తిమిల్స్ ఆవరణలో మహిళాఫొటోగ్రాఫర్‌పైస జరిగిన అత్యాచార ఉదంతంలోనూ, ఆ తర్వాత జరిగిన, జరుగుతున్న అనేకానేక సంఘటనల్లోనూ మన నేతలు ఈ తరహా వ్యాఖ్యల్నే చేసారంటూ యువత నిరసిస్తోంది. అప్పట్లో మహారాష్ర్ట రాష్ర్ట మహిళా కమిషన్ సభ్యురాలు ఒకరు…‘‘అంతరాత్రివేళ పదకొండుగంటలకు తన స్నేహితుడితో నిర్భయ సినిమా చూడాలా? జనసంచారం లేని శక్తిమిల్స్ ప్రాంగణంలోకి మహిళా ఫొటోగ్రాఫర్ వెళ్లి తీరాలా?’’ అంటూ వరుస ప్రశ్నలు సంధించారని గుర్తు చేస్తోంది. అంతేకాదు…మహిళలపై సాగుతున్న వేధింపులు, అత్యాచారాలకు కారణం ఆ మహిళలు ధరిస్తున్న ఆధునిక దుస్తులేనంటూ మరో నేత వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనమై చర్చకు దారితీసింది. ఇప్పుడు తాజాగా కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఆ తరహా వివాదాన్నే తన వ్యాఖ్యలద్వారా లేవదీసారు. నేరాలు, ఘోరాలు అరికట్టలేక డ్రెస్‌ల్ని సాకుగా తీసుకోవడాన్ని కూడా మహిళలు తప్పుపడుతున్నారు. తాము ఏ దుస్తులు వేసుకోవాలో, ఏవి వేసుకోకూడదో నిర్ణయాధికారం వేరొకరిదా? అని ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు.
డాక్టరైన నా కూతురూ రాత్రుళ్లు పనిచేస్తుంది
తన వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని చూసిన తర్వాత కేంద్రమంత్రి మహేశ్ శర్మ…తనకూతురు కూడా డాక్టరేనని, విధుల రీత్యా ఆమె కూడా రాత్రుళ్లు గడుపుతుందని సెలవిచ్చారు. అయితే, ఇండియన్ కల్చర్‌లో మాత్రం రాత్రుళ్లు ఆడవాళ్లు బయటకు రావడం ఆమోదయోగ్యం కాదని చెప్తున్నారు.
తమిళపత్రిక తాజావివాదం
కేంద్రమంత్రి వ్యాఖ్యలకు మహిళాలోకం ఓపక్క మండిపడుతుంటే…అగ్నికి ఆజ్యం పోసినట్లు ‘లెగ్గింగ్స్ ఆర్ వల్గర్ వేర్…’ అంటూ ఓ తమిళపత్రిక ప్రచురించి తాజా సంచిక కవర్‌పేజీ కథనం కూడా వివాదాస్పదమైంది. యువత హద్దులు దాటుతోందంటూ వ్యాఖ్యానిస్తూ లెగ్గింగ్స్‌ను అసభ్య వస్త్రంగా ఆ పత్రిక అభివర్ణించింది. ఈ కథనంపై సోషల్ మీడియాలో మహిళలు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మహిళాలోకాన్ని అవమానించినందుకుగాను పత్రికా యజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతోంది. అంతేకాదు, అమ్మాయిల అనుమతి లేకుండా ఫొటోలు తీసి ముఖచిత్రంగా ప్రచురించడాన్ని కూడా మహిళలు అభ్యంతరం చెప్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఐఎఎస్ అధికారిణి స్మిత సబర్వాల్‌పై అనుచితవ్యాఖ్య, అసభ్యమనిపించే రీతిలో వ్యంగ్యచిత్రాన్ని ప్రచురించిన ఓ ఆంగ్లపత్రిక వివాదం కూడా పాఠకులకు గుర్తుండే ఉంటుంది. పురుషులతో సమానంగా ఇంటాబయటా ప్రతిభావంతంగా పనిచేస్తున్న మహిళల్ని ఏదో రూపంలో కించపరిచేలా ఇలాంటి ప్రయత్నాలు సాగడం అభ్యుదయం కాదనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది.
పి.వి.డి.ఎస్.ప్రకాష్