ఢిల్లీలో రాష్ట్ర రాజకీయం

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర రాజకీయం విచిత్రంగా ఉన్నది. పార్లమెంట్‌లో ఎక్కడ చూసినా తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ ఎంపీలు వినతిపత్రాలతో కనపడుతున్నారు. వారు కలుసుకోని కేంద్ర మంత్రి అంటూ లేరు. ఆ ఎంపీలను కలుసుకునేందుకు చిన్నసైజు…

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర రాజకీయం విచిత్రంగా ఉన్నది. పార్లమెంట్‌లో ఎక్కడ చూసినా తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ ఎంపీలు వినతిపత్రాలతో కనపడుతున్నారు. వారు కలుసుకోని కేంద్ర మంత్రి అంటూ లేరు. ఆ ఎంపీలను కలుసుకునేందుకు చిన్నసైజు కార్యకర్తలు ఢిల్లీలో మకాం వేశారు. ఎపిభవన్‌ వారితో కిటకిటలాడిపోతున్నది. ఇదే సమయంలో బీసీల సంఘం అని, మరో సంఘం అని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాలు సాగుతున్నాయి. వారిని ఎంపీలు చూసుకోక తప్పడంలేదు. కృష్ణయ్య నేతృత్వంలో బీసీల సంఘం నేతలు ఐదురోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. వారితోనే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నిండిపోతున్నది. ఇక పోలవరంకు వ్యతిరేకంగా వచ్చిన గిరిజనులను, ఇతర పార్టీ కార్యకర్తలను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు చూసుకోక తప్పడంలేదు. ఏమైతేనేం పచ్చచొక్కాలు, గులాబీ చొక్కాలు, అక్కడక్కడా కాంగ్రెస్‌ చొక్కాలు ఢిల్లీలో మెరిసిపోతున్నాయి.

కాని ఇంత హడావిడి ఉన్నా వీరిని ఢిల్లీ పెద్దలు ఏమైనా పట్టించుకుంటారా.. అంటే అదీలేదు. వచ్చిన వారికి కేంద్రమంత్రులతో అపాయింట్‌మెంట్లు ఇప్పించడం తెలుగుదేశం నేతలకు కష్టంగా ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకోవడం అసలు సాధ్యపడడం లేదు. ప్రధానమంత్రి పార్లమెంట్‌కు రావడమే దాదాపు మానేశారు. వచ్చినా ఒకటి రెండు గంటలు గడిపి వెళ్లిపోతున్నారు. ఈ తక్కువ సమయంలో కేంద్రమంత్రులకే ఆయన సమయం ఇవ్వడంలేదు. ఇక ఎంపీలకు, ప్రతినిధి వర్గాలకు సమయం ఎలా ఇస్తారు? సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రజాస్వామిక ప్రక్రియ ఢిల్లీలో ఎక్కువగా కనిసిస్తుంది. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాలు సాగుతుంటాయి. రకరకాల ప్రతినిధి వర్గాలు రకరకాల సమస్యలతో ఢిల్లీ వస్తాయి. వారిని ఎంపీలు తీసుకుని ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలుసుకోవడం మామూలే. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌ సమయంలో రోజుకు కనీసం పది ప్రతినిధి వర్గాలను కలుసుకునేవారు. అందులో మన రాష్ట్రానికి చెందిన ఒకటో, రెండో  ప్రతినిధి వర్గాలు తప్పక ఉండేవి. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత ఈ ప్రజాస్వాయ్య ప్రక్రియకు విఘాతం కలిగింది. ఇప్పుడు కేంద్రమంత్రులు కూడా ప్రతినిధి వర్గాలను కలుసుకోవడం తగ్గించారు. దీనితో వచ్చిన ప్రతినిధి వర్గాలు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. దీనివల్ల వారి ఖర్చులను భరించడం ఎంపీలు, పార్టీలకు తలకు మించిన పని అవుతున్నది. 

తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఈ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడే దిక్కయ్యారు. ఆయనను కలుసుకుంటే ప్రధానమంత్రిని కలుసుకున్నట్లే అని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పార్లమెంట్‌కు ప్రధాని రావడం లేదు. పార్లమెంట్‌ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయనపైనే పడింది. ఒక బిల్లు ఆమోదం పొందాలన్నా, లేక శివసేన ఎంపీలు మహారాష్ట్ర సదన్‌లో వీరంగం చేసినా సభ సజావుగా జరిగేలా చూసే బాధ్యత ఆయనదే. కనుక కేంద్రమంత్రులుకూడా తమ వ్యవహారాలు సజావుగా సాగేందుకు వెంకయ్యపై ఆధారపడుతున్నారు. చివరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు కూడా వెంకయ్యే అధ్యక్షత వహిస్తున్నారు. నరేంద్ర మోడీ నుంచి వచ్చిన ఆదేశాలను ఆయనే ఎంపీలకు చదివి వినిపిస్తున్నారు. ఎంపీలు ఎలా ప్రవర్తించాలో, ఏయే అంశాలు లేవనెత్తాలో వెంకయ్యే నిర్దేశిస్తున్నారు. దీనితో పార్లమెంట్‌ వరకు వెంకయ్యే ప్రధానమంత్రి. ఆయన చెబితే ఏ మంత్రైనా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా ఉండే ప్రసక్తే లేదు. అందువల్ల తెలుగుదేశం ఎంపీలు వెంకయ్యను కలుసుకుంటే ఆయన కేంద్రమంత్రులకు ఫోన్లుచేసి అపాయింట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు. ఒకవేళ వెంకయ్య దొరకకపోతే విశాఖపట్టణం బీజేపీ ఎంపీ హరిబాబు వెంకయ్య స్థానాన్ని భర్తీచేస్తున్నారు. ఆయన సీనియర్‌ బీజేపీ సభ్యుడు, వెంకయ్యకు సన్నిహితుడు కావడంవల్ల ఆయన ఫోన్లు చేసినా అపాయింట్‌మెంట్లు ఆలస్యగంగానైనా దొరుకుతున్నాయి. దీన్ని బట్టి పార్లమెంట్‌లో తెలుగుదేశం ఎంపిలకు వెంకయ్యే దిక్కు అని అర్థమవుతోంది. అయితే కేంద్ర బడ్జెట్‌లో తమకు జరిగిన అన్యాయంపై తెలుగుదేశం ఎంపీలకు పైకి మాట్లాడడానికి ఏమీ లేదు. 15వేలకోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ కేంద్రం అది ఎలా పూరిస్తుందో తెలియడం లేదు. పార్లమెంట్‌లో చర్చల సందర్భంగా తెలుగుదేశం ఎంపీలు తమకురావాల్సిన నిధులురాలేదని దీనంగా చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అస్పష్టంగానే హామీలిస్తున్నారు కానీ నిర్దిష్టంగా ఏమీ చెప్పడం లేదు.

తెలుగుదేశం ఎంపీల్లో అత్యధికులు వ్యాపార వేత్తలు కావడంతో వారికి పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడే సత్తా లేకుండా పోయింది. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, గల్లా జయదేవ్‌, కేశినేని నాని మొదలైన వారంతా తమ ప్రయోజనాల కోసం ప్రయత్నించేవారేకాని సమస్యలగురించి మాట్లాడే వారు కాదు. టీడీపీ తెలంగాణ ఎంపీ మల్లారెడ్డి తెలివైన వాడు. ఆయన ఎంపీ కాగానే మెడికల్‌ కాలేజీకి అనుమతి తెచ్చుకున్నారు. కంటోన్మెంట్‌ నుంచి రావల్సిన 350 కోట్ల బకాయీలు తెచ్చుకోగలిగారు. ఇలాంటి వారికి పార్లమెంట్‌లో మాట్లాడాల్సిన పనిలేదు. మాట్లాడినా తమ వ్యాపార ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. భూసేకరణ బిల్లు వ్యాపార వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నదని గల్లా జయదేవ్‌ అనడం ఇందుకు ఉదాహరణ. అయినా పార్లమెంట్‌లో కనీసం గంట సేపు నిలబడి ఆర్థిక విధానాలు, పారిశ్రామికీకరణ, పేదరికం, ప్రజాసమస్యలు, విదేశాంగవిధానం వంటివాటిపై గంటసేపు అనర్గళంగా మాట్లాడగలిగిన తెలుగుదేశం ఎంపీలు లేనేలేరు. ఎంతసేపూ సెంట్రల్‌ హాలులో కూర్చుని తాము గెలిచినా ప్రయోజనం లేదని, తాముఖర్చుపెట్టిన డబ్బు తిరిగిఎలా పొందాలో తెలియడంలేదని మధనపడడం తప్ప పార్లమెంట్‌లో ఏ అంశంపై ఎలా మాట్లాడాలో కసరత్తుచేసిన వారు, గణాంక వివరాలను అధ్యయనం చేసిన వారు తక్కువ. ఒక్క మాజీ మంత్రి కింజారపు  ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన నాయుడే ప్రజాసమస్యల గురించి మాట్లాడగలుగుతున్నారు. ఆయన ఢిల్లీలో చదివినందువల్ల హిందీలో కూడా అనర్గళంగా మాట్లాడి అందరిలో కలిసిపోగలుగుతున్నాడు. అయితే జూనియర్‌ కావడం వల్ల ఆయనకు అవకాశాలు తక్కువ లభిస్తున్నాయి. ఇక గల్లా జయదేవ్‌ మాట్లాడగలిగినప్పటికీ ఆయన ప్రసంగంలో రాజకీయ, సామాజిక సమస్యలు పెద్దగా ఉండవు. కేవలం వ్యాపార అంశాలేఎక్కువ కనపడుతున్నాయి. అది కూడా ఆయన తన ఉపన్యాసాల్ని రాసి తెచ్చుకుని మరీ చదువుతున్నారు.తెలంగాణ ఎంపీల పరిస్థితి చాలా నయం. వారు చాలా మంది క్రింది స్థాయినుంచి వచ్చిన వారు. జితేందర్‌ రెడ్డి కాంట్రాక్టర్‌ అయినా, పార్లమెంటరీ అనుభవం ఉన్నది. 

ప్రజాసమస్యలు లేవనెత్తిగలరు. బీజేపీతో ఉన్న గత సంబంధాల వల్ల ఆయన కేంద్రమంత్రులను సులభంగా కలుసుకోగలుగుతున్నారు. హిందీ మాట్లాడ గలగడం ఆయనకు, తెలంగాణ ఎంపీలకు ఎంతో ఉపయోగపడుతున్నది. ఇక టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె కవిత అటు ఇంగ్లీషులోనూ, ఇటు హిందీలోను చక్కగా మాట్లాడగలరు. ఎవరినైనా పరిచయం చేసుకోగలరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కగల సత్తా కూడా ఉన్నది. ఆమెను చూడగానే జాతీయ మీడియా వెంటపడడం ఇందుకు ఉదాహరణ. ఆమె తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వారు కనుక సమస్యల్ని సులభంగా ప్రస్తావించగలరు. టీఆర్‌ఎస్‌ ఎంపీల్లో వినోద్‌, బూరనర్సయ్యగౌడ్‌ ఎలాంటి కాగితం లేకుండా సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీయగలరు. బూరనర్సయ్య డాక్టర్‌ కావడం వల్ల ఇంగ్లీషులో చక్కగా మాట్లాడుతున్నారు. జేఏసీ నాయకుడు కావడంవల్ల సమస్యల్ని బాగా ప్రస్తావించగలుగుతున్నారు. చేవెళ్ల నుంచి ఎంపికైన డా.విశ్వేశ్వర్‌రెడ్డికి పట్టణ మౌలికసదుపాయాలు, ఐటీ గురించి అద్భుతమైన అవగాహన ఉన్నది. ఆయనది రాజకీయ కుటుంబంకనుక రాజకీయ అంశాలను కూడా చక్కగా హిందీలోనూ, ఇంగ్లీషులోనూ మాట్లాడగలరు. ఇక రాజ్యసభలో కె. కేశవరావు సంగతి చెప్పనక్కర్లేదు. ఆయనకు ఏ అంశంపైనా ఎంతసేపైనా మాట్లాడగలిగిన సత్తా ఉన్నది. ఈ రీత్యా ఢిల్లీలో తెలుగుదేశం ఎంపిలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌ ఎంపిలే రాణించగలుగుతున్నారు. అటు ప్రభుత్వంలో ఉన్నామో, ప్రతిపక్షంలో ఉన్నామో తెలియక తెలుగుదేశం ఎంపీలు మాత్రం ఢిల్లీ వీధుల్లో పరాయివాళ్లమన్న భావనతో కుతకుతలాడుతున్నారు.

– హరీశ్‌