అధికారంలోకి వచ్చినవారిపై మీడియా ఓ నెల్లాళ్లపాటు సానుకూలంగా వుండడం రివాజు. దీన్నే హనీమూన్ పీరియడ్ అంటూ వుంటారు. కెసియార్ అధికారంలోకి వచ్చి నెల దాటినా తెలంగాణ మీడియా హనీమూన్‌ను కొనసాగిస్తూనే వున్నట్లుంది. సిఎం అయ్యాక కెసియార్ ప్రెస్ మీట్‌లు ఇవ్వడం మానేసి, చాలా వారాల తర్వాత మొన్ననే సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల పక్షాన ఆయనపై సంధించవలసిన ప్రశ్నలు ఎన్నో వున్నాయి. అయినా ప్రెస్ ఫ్రెండ్లీగానే వుంది. ఉధ్యమ సమయంలో హైదరాబాదు జర్నలిస్టులందరూ తెలంగాణవాదులలాగానే ప్రవర్తించారు. విభజనవాదుల పత్రికా సమావేశాల్లో వాళ్లని ప్రోత్సహిస్తూ, సమైక్యవాదుల సమావేశంలో రగడ చేస్తూ తాము ఎటున్నామో స్పష్టంగా చాటుకున్నారు. అదంతా తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు.. అని చెప్పుకున్నారు కూడా. ఈ రోజు రాష్ట్రం ఏర్పడింది. ప్రజల తరఫున నిలబడవలసిన అవసరం వుంది. అది విస్మరించి ఏం చేసినా ప్రభుత్వానికి అండగా నిలుస్తాం అంటే తమ బాధ్యత విస్మరించినట్లే కదా!
ప్రసారాలు బంద్, మీడియా నోటికి తాళం
రాష్ట్రంలో రెండు టీవీ ఛానెళ్లు బంద్ అయ్యాయి. బంద్ చేయించినది ప్రభుత్వం కాదు, ప్రజలు కాదు, కోర్టు కాదు. కేబుల్ ఆపరేటర్ల సంఘం వారు. కస్టమర్లు ఇచ్చిన డబ్బులతో ప్రసారాలు నిర్వహించవలసిన వారు. కస్టమర్ల ప్రమేయం లేకుండా కొన్ని ఛానెళ్ల ప్రసారాన్ని నిలుపు చేసే అధికారం వారికి ఎవరిచ్చారు? వినియోగదారుల చట్టం దీన్ని ఒప్పుతుందా? ఫలానా ఛానెళ్లను ఆపేస్తున్నాం అని ముందుగా నోటీసులు ఇవ్వవలసిన పని లేదా? రేపు పాలవాళ్లు, నీళ్లవాళ్లు, చెత్త తీసేవాళ్లు ఫలానా ఫలానా కాలనీలకు ఇవాళ్టి నుంచి సేవలు అందించం అని హఠాత్తుగా మానేస్తే…? వారిని అదుపు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ‘ఛానెళ్లు ఆపేయాలనే నిర్ణయం మాది కాదు, ఎమ్మెస్వోలది, మేమేమీ కలగజేసుకోం’ అని కెసియార్ చేతులు దులిపేసుకుంటే మీడియా ఊరుకోవడమేమిటి? రైలు, బస్సు ఢీకొని స్కూలు పిల్లలు చచ్చిపోయారు. బస్సు మాది కాదు, రైలు మాది కాదు, గుద్దుకోమని మేం చెప్పలేదు అని ప్రభుత్వం ఊరుకుంటుందా? పౌరులకు, సకలరకాలైన పౌరహక్కులకు భంగం వాటిల్లినపుడు ప్రభుత్వం జవాబుదారీ కావలసినదే. ప్రసారాలు నిలిపి ఐదువారాలైనా మీడియా తగినంత ఆందోళన చేయకుండా నోటికి తాళం వేసుకోడానికి కారణం ఏమిటి? అవి ఆంధ్ర ఛానెళ్లు అని ముద్ర కొట్టడం చేతనా!? రేపు ఆ ముద్ర తమమీదా కొడితే?
వితండవాదనలు, కుతర్కాలు
ఇలాంటి విభజన అన్నిటా తేవడానికి కెసియార్ ప్రయత్నిస్తున్నారు. ఆ సమావేశంలో ఫీజు రీయంబర్స్‌మెంటు గురించి అడిగితే ‘ఇది త్వరగా తేల్చకపోతే విద్యార్థులు ఇతర రాష్ట్రాల కాలేజీల్లో చేరిపోతారని అంటున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకునే స్తోమత ఉన్నవారికి ఫీజు రీయంబర్స్‌మెంట్ ఎందుకండి?’ అని ఛలోక్తి విసిరి అందర్నీ నవ్వించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతారన్నది ఫీజు విషయంలో కాదు, ‘ఎమ్సెట్ కౌన్సిలింగ్ వివాదాన్ని కొనసాగిస్తూ పోతే ఎకడమిక్ ఇయర్ పోతుందనే భయంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతారు, సీట్లు భర్తీ కాక మన రాష్ట్రంలో కాలేజీలు నష్టపోతాయి. అందువలన అక్టోబరు నెలాఖరు దాకా వాయిదా వేయకుండా ఏదో ఒకటి త్వరగా తేల్చండి’ అని విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే వారందరూ చెప్తున్న హితవు. దాన్ని ఫీజుకి ముడిపెట్టడం కెసియార్‌కే చెల్లింది.
అలాగే ‘రాజధానికి లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టేవాళ్లు, వాళ్ల పిల్లల ఫీజులు వాళ్లు కట్టుకోలేరా?’ అంటూ చతుర్లు వేసి కూడా నవ్వించారు. ఆంధ్రరాష్ట్రం వారు వారి పిల్లల ఫీజులూ, కాలేజీలూ, కాటేజీలూ అన్నీ కట్టుకుంటారు. ఇక్కడ ఇస్యూ అది కాదు – తెలంగాణలో చదువుకుంటున్న విద్యార్థుల సమస్య ఇది. ‘ఈ రాష్ట్రంలో నివసించేవారందరూ నా వారే. వారిని కడుపులో పెట్టుకుంటాను. వారి కాల్లో ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తాను’ వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కెసియార్ ఈరోజు తన ప్రజలనే నిలువుగా చీలుస్తున్నారు. కోర్టుకిచ్చిన అఫిడవిట్‌లో ఇక్కడి విద్యార్థులలో 60% మంది మాత్రమే స్థానికులు అని చెపుతున్నారు. అంటే 40% మంది విద్యార్థులను పరాయివాళ్లను చేస్తున్నది కెసియార్ సర్కారు. 371 డి ప్రకారం వాళ్లు ఆంధ్ర రాష్ట్రానికి కూడా పరాయివాళ్లే. ఫీజు ఎవరికి రీయంబర్స్ చేయాలి అన్నదే రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిన విషయం. వేరే ఎవరూ జోక్యం చేసుకోలేరు. ఎవరికి ఇద్దామనుకుంటే, ఎంత ఇద్దామనుకుంటే అంత ఇవ్వవచ్చు. కానీ తన ప్రజలను ఇలా చీల్చుకోవడం ఏపాటి వివేకం? పోనీ అది వచ్చే ఏడాది తేల్చుకుందాం, విద్యార్థుల కష్టాలు గమనించి ఈ ఏడాదికి ఇలా పోనిద్దాం అని కూడా అనుకోవటం లేదేం? ఈ మాట ఆ రోజు మీడియావారు అడగనే లేదు.
కరెంటు లేక కటకట, కబుర్లు దాటేవి కోటలు
మాట్లాడితే టెక్ తెలంగాణ అంటారు, అది చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం, వాళ్లు వచ్చి ఫలానా పరిశ్రమ పెట్టబోతున్నారు, వీళ్లు వచ్చి మేమే మీకు అంబాసిడర్లం అన్నారు… ఇలా ప్రెస్ రిలీజులు ఇస్తూనే వున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి కబుర్లు వినివిని చెవులు దిబ్బళ్లు పడివున్నాయి. అయినపుడు చూద్దాంలే అనుకుంటున్నారు ప్రజలు. ఏం కావాలన్నా ముందు విద్యుత్ కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. ఏ షాపుకి వెళ్లినా, ఏ ఫ్యాక్టరీకి వెళ్లినా, ఏ సప్లయిర్‌ను అడిగినా ఎవ్వరూ ఒక గడువుకి కమిట్ కావటం లేదు. కరెంటు లేకపోతే మేమేం చేస్తామండి, పనివాళ్లను ఖాళీగా కూర్చోబెడుతున్నాం కూడా అంటున్నారు. గృహనిర్మాణ కార్యక్రమాల్లో ఇది కొట్టవచ్చినట్లు కనబడుతోంది. పనివాళ్లకు పనులు లేకుండా పోతున్నాయి. వాళ్లు పనిచేసేదే పగలు 10 నుంచి సాయంత్రం 5 దాకా. ఆ 7 గంటల్లో సగం సేపు కరెంటు రావటం లేదు. ఇది సిటీలో పరిస్థితి, టౌన్లలో ఎలా వుందో తెలియదు. ఊరొదిలి ఈ బాధలు లేని చోటకి పోదామా అనుకుంటున్నారు చాలామంది. ఇలాంటి పరిస్థితిలో మూడేళ్లలో నందనవనం ఏర్పాటు చేస్తామంటే ఎలా నమ్మగలం? అప్పటిదాకా రోజులు గడవాలి కదా!
ఏమైనా చేయాలంటే మొదట కావాలసినది ఫైళ్లు కదలడం. ఉద్యోగులు తమ సీట్లలో కుదురుకోనే లేదు. కారణం? వాళ్లు ఎక్కడివారో ఇంకా తేలటం లేదు. తేల్చవలసిన కమలనాథన్ కమిటీ గుడ్లు తేలేస్తోంది. ఏం? వాళ్ల మార్గదర్శకాలకు ఆంధ్ర ఉన్నతాధికారులు ఓకే అంటూ సంతకాలు పెట్టారు కానీ తెలంగాణ ఉన్నతాధికారులు పెట్టటం లేదు. అక్కడా స్థానికత వివాదమే. ఇప్పటిదాకా లేని కొత్త రూల్సు ఏవో పెట్టి వాళ్లంతా మా వాళ్లు కారు, మేం వాళ్లను ఇక్కడ వుండనివ్వం అనే పంతం. 60 ఏళ్లకు రిటైర్‌మెంట్ కారణంగా చాలామంది ఆంధ్రకు పోతామంటున్నారు. ఇంకా ఇక్కడే వుందామనుకునే వాళ్లకు వ్యక్తిగత కారణాలుంటాయి. వాళ్లు ఎంతమంది వుంటారు? వాళ్లకోసం పరిపాలనను స్తంభింపచేయడం కరక్టా?
కొంపకు అగ్గిపెడతానంటున్న గృహమంత్రి
బంగరు తెలంగాణ ఏర్పడడం మాట ఎలా వున్నా వున్న ఇత్తడి తెలంగాణ అయినా వుంచుతారా అన్న సందేహం వస్తోంది – ‘గవర్నరు చేతిలో శాంతిభద్రతలు అంటే అగ్గిమంట పెట్టేస్తాం’ అన్న స్టేటుమెంటు వింటే. అన్నది సాక్షాత్తూ హోం మంత్రి నాయిని. విభజన బిల్లులోనే ఈ అంశం స్పష్టంగా వుంది. నీటి జలాల నుండి ప్రతీదీ వివాదం చేస్తూ వుంటే అన్నీ కేంద్రం చేతిలోకి వెళ్లిపోతున్నాయి. నీళ్లు వెళ్లకుండా పైపులు బద్దలు కొడతాం వంటి స్టేటుమెంట్లు ఇవ్వడంతో కేంద్రం ‘మా బలగాలు పంపి ప్రాజెక్టులను రక్షిస్తాం, దానికి ఖర్చు ఏడాదికి 200 కోట్లు. అది మీరే భరించాలి’ అంటోంది. వాచాలతకు మూల్యం 200 కోట్లు అన్నమాట! ఇప్పుడు హోం మంత్రిగారు అగ్గిమంట దేనికి పెడతారు? తన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులేక పెట్టాలి. ఢిల్లీ వెళ్లి పెట్టబోతే అక్కడ అరెస్టు చేస్తారు. కృష్ణా, గోదావరి జలాలపై రాష్ట్రాలకుండే హక్కులు వదులుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు సోదరులైన ఆంధ్రులతో కూర్చుని, నచ్చచెప్పి పంపకాల విషయం మాట్లాడలేదు. ఢిల్లీకి వెళ్లి అక్కడనుండే మంత్రాంగం నడిపారు. పెత్తనం మనమే అప్పగించాక ఇప్పుడు ఢిల్లీ వదులుకుంటుందా? గవర్నరు చేతిలో శాంతిభద్రతలు పెట్టడమే కాదు, అనేక విషయాలలో కేంద్రం అధికారం చలాయిస్తుంది. చూస్తూ వూరుకోవడమే మన పని.
విద్యార్థులు నష్టపోవడం ఖాయం
నాయినివారికి హఠాత్తుగా విద్యార్థుల భవిష్యత్తు గురించి స్పృహ కూడా కలిగింది. ‘ఉద్యోగాలు కావాలంటే చదువుకోవాల, ఉద్యమాలు చేస్తే రావు’ అని సుభాషితాలు చెప్తున్నారు. మొన్నటిదాకా ఉద్యమంలో ప్రధానపాత్ర మీదే అని ఉబ్బేసి, చదువులదేముంది, ఉద్యమం ముఖ్యం అని వాళ్లను ఉసికొల్పినది వీరే! ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించామనడంతో విద్యార్థులకు ఆందోళన ప్రారంభమైంది. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు కులాల వారీ రిజర్వేషన్, స్థానికత ఇత్యాది అంశాలను పరిగణించకుండా అవసరార్థం జరుగుతాయి. వారిని ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తే కొన్నాళ్లు పోయాక ‘ఉద్యోగులలో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం వుండవలసినంత కోటా లేదు, అందువలన కొన్నాళ్లపాటు ఓసిలకు ఉద్యోగాలు ఆపేసి ఆ కోటా నిండేవరకూ ఎస్సీ, ఎస్టీలేక ఉద్యోగాలు ఇవ్వండి’ అంటారు. బ్యాంకు సర్వీసుల్లో, ఎల్‌ఐసిలో ఇతర ప్రభుత్వ సంస్థల్లో అలా జరిగింది. కొన్నేళ్లపాటు ఓసీలకు ఉద్యోగాలు రాలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఆఫర్లమీద ఆఫర్లు. వాళ్లు ఒకదానిలో నుంచి మరో దాంట్లో దూకుతూ పోయారు.
ఇప్పుడు తెలంగాణ విద్యార్థులలో రిజర్వేషన్ సౌకర్యం లేనివాళ్లు భవిష్యత్తులో ప్రభుత్వోద్యాగాలు రాక నష్టపోతారు. వీటికోసం వాళ్లు ఆందోళన చేస్తే నాయిని దీని వెనుక ఆంద్రోళ్ల కుట్ర వుంది అంటున్నారు. తమ చేతకానితనానికి, అవకతవక విధానాలకు ప్రతిదానికీ ఆంధ్రులనే తప్పుపడుతూ పోతే చెల్లుతుందా? పైగా ఇలా ఉద్యమిస్తున్నవాళ్లు ఫీజు దక్కదని ఆందోళన పడుతున్న ఆంధ్ర విద్యార్థులే అని కూడా కనిపెట్టారు. అంటే తమ ప్రజల్లోనే విడగొట్టి చూస్తున్నారు. అడుగడుగునా స్థానికత అంశాని తెచ్చేట్టే కనబడుతున్నారు. తెలంగాణ సిటిజన్ కార్డుల విషయంలో ఏ షరతులు పెడతారో చూడాలి. బోగస్ రేషన్ కార్డులు ఏరేస్తామంటున్నారు. మంచిది. ఓటర్ల లిస్టు దగ్గరపెట్టుకుని కంప్యూటర్లో చూసి డూప్లకట్లు ఏరేస్తే రోజుల్లో అయిపోతుంది. అలా కాదుట, ఇంటింటికీ అధికార్లను పంపిస్తారట, చెక్ చేయిస్తారట, వాళ్లేక ఇస్తారట. ఇదంతా ఆగస్టులో అయిపోయి దసరా-దీపావళి కల్లా కార్డులు జారీ అయిపోతాయట. రాష్ట్రమంతా ఇల్లిల్లూ తిరిగి సమాచారం సేకరించడానికి ఈ సమయం సరిపోతుందా? రాష్ట్ర ఉద్యోగులెవరో ఇంకా తేలని ఈ పరిస్థితుల్లో? ప్రజల్లో ఏ 60% మందికో కార్డులిచ్చి వాళ్లే మా వాళ్లు, తక్కినవాళ్లంతా పరాయివాళ్లే, వాళ్లు రేషన్ ఆంధ్రప్రభుత్వం నుండి తెచ్చుకోమనండి అంటారేమో!
ఇలా తెరాస ప్రభుత్వాన్ని అడగవలసిన ప్రశ్నలెన్నో వున్నాయి. అడిగేస్తా, కడిగేస్తా, ప్రశ్నించడానికే పుట్టా..ను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో తెలియదు. ప్రస్తుతం జనసేనకు కాల్‌షీట్లు ఇచ్చే ఉద్దేశం లేదాయనకు. ఎన్నికల సమయంలో ఏదో కాంట్రాక్టు కుదిరింది. వచ్చారు, చూశారు, చేశారు. మళ్లీ ఎప్పుడు బేరం తగిలితే అప్పుడే సెట్లోకి వస్తారు. ఈ లోపున నిరంతరం ఆ పని మీదే వుండవలసిన మీడియా తన బాధ్యత నెరవేర్చాలి. వారి మౌనం క్షంతవ్యం కాదు.
– ఎమ్బీయస్ ప్రసాద్