మనకు కవిత్రయం రాసిన ఆంధ్ర మహా భారతం తెలుసు. మరి ఈ ‘తెలుగు మహా భారతం’ ఏమిటి? మళ్లీ ఇంకే కవిత్రయమైనా మహాభారతాన్ని కొత్తగా తెలుగులో రాశారా? కవిత్రయ భారతం కౌరవ పాండవులకు సంబంధించిన ఉత్తరాది కథ. తెలుగు మహా భారతం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వారి కథ. దీన్ని ప్రస్తుతం రచిస్తున్నది, భవిష్యత్తులో ఇంకా రచించబోయేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది తెలుగు మహాభారతం అని ఎందుకు అంటున్నామంటే రెండిరటికీ ఒక్క ప్రధానమైన పోలిక ఉంది. అదే దాయాదుల పోరు. అందులో అన్నదమ్ములైన కౌరవ పాండవులు ఘర్షణ పడగా, ఇక్కడా అన్నదమ్ముల వంటి తెలుగు ప్రజలు విడిపోయి ఘర్షణ పడే వాతావరణం ఏర్పడిరది. ఇక్కడ ఘర్షణ పడటమంటే ప్రజలు ప్రత్యక్షంగా కొట్లాడుకోవడం కాదు, రెండు ప్రభుత్వాల మధ్య వివాదాలు, చిచ్చులు చెలరేగడం. ఇది తప్పనిసరిగా ఇరు రాష్ట్రాల్లోని ప్రజలపై ప్రభావం చూపుతుంది. అసలు మహాభారతంలో కౌరవులను చెడ్డవారిగా, పాండవులను ధర్మపరులుగా చిత్రీకరించారు. ఈ తెలుగు మహా భారతంలోమంచి చెడుల ప్రసక్తి లేదు. ఒకరు మంచిగా వ్యవహరిస్తున్నారని, మరొకరు చెడుగా ప్రవర్తిస్తున్నారని చెప్పలేం. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలకు అనుగణంగా వారు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో సంయమనం కోల్పోవడం వల్ల, ఇరు రాష్ట్రాల నాయకుల ప్రకటనల కారణంగా విద్వేషపూరిత వాతావరణం ఏర్పడుతోంది. ఇది పెరిగి పెద్దదైతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
ప్రధానంగా నాలుగు వివాదాలు
ఉమ్మడి రాష్ట్రం విద్వేషాలతోనే విడిపోయింది. తెలంగాణ నిధులను, నీరును, ఉద్యోగాలను ఆంధ్రావారు దోచుకుంటున్నారనే కారణాలతో వేర్పాటువాదానికి బీజాలు పడ్డాయి. ఆ కథేమిటో, ఆ ఉద్యమమేమిటో అందరికీ తెలుసు. కలిసి ఉండి కొట్లాడుకోవడం కంటే విడిపోయి కలిసుందాం అని తెలంగాణ ఉద్యమకారులు అన్నారు. ‘ప్రాంతాలుగా విడిపోదాం…ప్రజలుగా కలిసుందాం’ అనేది వారి నినాదం. అయితే ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసుండలేని పరిస్థితి ఏర్పడిరది. రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు దూరం పెంచుతున్నాయి. ప్రతి ఒక్క అంశం సమస్యగా మారుతోంది. అయితే ప్రధానంగా నాలుగు వివాదాలు చిచ్చు రేపుతున్నాయి. అవి: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్థానికత, నీటి పంపకాలు, విద్యుత్తు. ఈ నాలుగు వివాదాలు ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజానీకం యావత్తు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ విదాదాల్లో ఎవరిది ధర్మం? ఎవరిది అధర్మం అని తేల్చలేం. ఎవరి ప్రయోజనాలను ఎవరు అడ్డుకుంటున్నారంటే కరెక్టుగా చెప్పలేం. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరి ఇల్లు వారు చక్కదిద్దుకునే పనిలో ఈ వివాదాలు రేగుతున్నాయి.
ఇంకా తేలని ఫీజు రీయింబర్స్‌మెంట్ గొడవ
వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడు ఓట్ల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతోంది. వైఎస్‌ఆర్ హయాంలోనే సర్కారుకు గుదిబండగా మారిన ఈ పథకం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషపూరిత వాతావరణం ఏర్పడేలా చేసింది. ‘ఫీజు రీయింబర్స్‌మెంటు ఓ పనికిమాలిన పథకం’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే తెలుస్తోంది ఆయనకు దీనిపట్ల ఎంత వ్యతిరేకత ఉందో. అయితే ఒక్కసారిగా ఈ పథకాన్ని ఎత్తేయడం సాధ్యం కాదు. అలా చేస్తే ప్రజల్లో ప్రధానంగా విద్యార్థుల్లో, యువతలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆంధ్రకు చెందిన విద్యార్థుల ఫీజులు చెల్లించడం సాధ్యం కాదు. పైగా భారం కూడా. దీంతో ఆంధ్రావారికి ఫీజులు ఇచ్చేది లేదు పొమ్మన్నది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రా విద్యార్థుల్లో అత్యధికమంది తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాద్‌లోని ప్రొఫెషనల్ కళాశాలల్లో చదువుతున్నారు. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులంతా తెలంగాణవారేనని తెలంగాణ ఉద్యమ సమయంలో అన్న కేసీఆర్ విభజన తరువాత అభిప్రాయం మార్చుకున్నారు. సీమాంధ్రులను గుండెల్లో పెట్టి చూసకుంటామన్న వ్యక్తి ఇది మీ గూడు కాదని అంటున్నారు. ముందు అన్న మాటకే కట్టుబడితే వేలాదిమంది సీమాంధ్ర విద్యార్థుల ఫీజులు భరించాల్సి ఉంటుంది. అందుకే వ్యూహం మార్చారు. ‘స్థానికత’ అంశాన్ని తెర మీదకు తెచ్చారు.
ఎవరు తెలంగాణ? ఎవరు ఆంధ్ర?
1956 నుంచి పాలు నీళ్లలా కలిసిపోయిన తెలంగాణ, సీమాంధ్ర ప్రజలను విడదీసే పని మొదలైంది. ఎవరు పాలు (తెలంగాణ), ఎవరు నీళ్లు (సీమాంధ్ర) తేల్చే ప్రక్రియ మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇది నేరుగా ప్రజలపై ప్రభావం చూపించే అంశం. వారి మధ్య అంతరాలను మరింత పెంచే వివాదం. తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాద్‌లో సీమాంధ్రులను రెండో శ్రేణి పౌరులుగా మార్చే వివాదం. ఈ ‘స్థానికత’ అంశం అనేక నాటకీయ మలుపులు తిరుగుతతోంది. తెలంగాణ ప్రభుత్వం స్థానికతపై రోజుకో ప్రకటన చేసి విద్యార్థులను, తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేసింది. మొదట్లో తండ్రి స్థానికతను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం చివరకు 1956వ సంవత్సరాన్ని కటాఫ్‌గా అంటే స్థానికతను నిర్థారించే సంవత్సరంగా ఖాయం చేసింది. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడినవారే స్థానికులన్న మాట. ఇది హేతుబద్ధం కాదనేది ఆంధ్ర సర్కారు వాదన. దీనిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పింది. వాస్తవానికి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో పదేళ్ల పాటు ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది.
స్థానికతపై ఇంకా వీడని వివాదం
స్థానికతపై వివాదం కారణంగా ఎంసెట్ కౌన్సెలింగ్ గందరగోళంలో పడిరది. చివరకు రెండు ప్రభుత్వాలూ సుప్రీం కోర్టు గడప తొక్కాయి. జూన్‌లో జరగాల్సిన కౌన్సెలింగ్‌ను జూలైలో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. స్థానికత అంశం తేలకపోవడంతో అక్టోబరు వరకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇక తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షలాది మంది సీమాంధ్రులకు స్థానికత గొడ్డలిపెట్టులా మారింది. తాము తెలంగాణేతరులం కావచ్చుగాని తమ పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగి ఎల్‌కేజీ నుంచి ఉన్నత విద్యల వరకు ఇక్కడే చదువుకున్నారని, వారిని స్థానికేతరులని ఎలా అంటారని సీమాంధ్ర తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 1956 స్థానికతను కచ్చితంగా అమలు చేస్తే లక్షలాది సీమాంధ్రులు స్థానికేతరులు అవుతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని తగ్గించుకోవడానికి కొత్తగా ‘ఫాస్ట్’ అనే పథకాన్ని కేసీఆర్ సర్కారు తయారుచేసింది.
నీటి పంపకాల వివాదం
ఏ రాష్ట్రమైనా విడిపోయినప్పుడు నదీ జలాల విషయంలో పేచీలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్యనా అదే జరుగుతోంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాలు పంతాలకు పట్టుదలకు పోతున్నాయి. కృష్ణా డెల్టాకు తాగునీటి కోసం పది టీఎంసీల నీరు విడుదల చేయాలన్న ఆంధ్ర సర్కారు ప్రతిపాదనలకు తెలంగాణ సర్కారు మొదట్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు టీఎంసీల నీరు చాలని వాదించింది. తాగునీరు పేరుతో సాగునీటిగా వాడుకోవడానికి చూస్తోందని ఆరోపించింది. మొత్తం మీద ఈ నీరు విడుదలైంది. జల వివాదాలకు ఇది నాంది మాత్రమే. అసలు కథ ముందుంది.
కరెంటు షాక్
విద్యుత్తు ఒప్పందాల రద్దు రెండు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదమే రేపింది. ఈ వివాదం రేగుతుందని విభజనకు ముందు ఊహించిందే. విద్యుత్తు ఒప్పందాల (పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్`పీపీఎ) ను రద్దుకు ఆంధ్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో వివాదం మొదలైంది. ఇలా రద్దు చేయడం అక్రమమని తెలంగాణ వాదిస్తే, సక్రమమేనని ఆంధ్ర వాదించింది. ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు ఆ రాష్ట్రానికే దక్కాలన్న ఆంధ్ర సర్కారు పీపీఎలను ఉపసంహరించుకునే ప్రయత్నం చేసింది. అసలే విద్యుత్తు లోటుగా ఉన్న తెలంగాణకు ఈ చర్య శరాఘాతం వంటిది. పీపీఎలు రద్దు చేసుకుంటే తెలంగాణ 615 మెగావాట్ల విద్యుత్తు కోల్పోతుంది. అందుకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనేందుకు, సింగరేణిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చెప్పుకోవాలంటే ఇంకా చాలా వివాదాలున్నాయి.
చంద్రబాబు ఉన్నచోట కేసీఆర్ ఉండరా?
రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఎంతగా ముదిరాయంటే ముఖ్యమంత్రులు ఒకరికొకరు ఎదురుపడనంతగా. రంజాన్ సందర్భంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరైనా కేసీఆర్ రాలేదు. సమీక్షలతో బిజీగా ఉన్నాడని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పినా వాస్తవం అది కాదు. ఉద్దేశపూర్వకంగానే హాజరుకాలేదని తెలిసింది. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు ఉన్నచోట ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నారా అనే అనుమానం కలుగుతోంది. కవిత్రయం భారతానికి ముగింపు ఉంది గాని ఈ తెలుగు భారతానికి ఉందా?
-ఎం.నాగేందర్