ఎలుకండీ ఎలక.. ఇది దేవుడి ఎలుక.!

ఆ మధ్య ఓ వరాహం దేవాలయంలో ప్రదక్షిణలు చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) సంచలనం సృష్టించింది. ఆ పందికి ఓ గుడి కూడా కట్టించేశారు అప్పట్లో. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిందీ ఘటన.…

ఆ మధ్య ఓ వరాహం దేవాలయంలో ప్రదక్షిణలు చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) సంచలనం సృష్టించింది. ఆ పందికి ఓ గుడి కూడా కట్టించేశారు అప్పట్లో. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిందీ ఘటన. పక్కనే వున్న గోదావరిలో స్నానం చేయడం, గుడిలోకెళ్ళి దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో ఆ పంది అప్పట్లో హాట్‌ టాపిక్‌. ఇంకేముంది.. ఆ శ్రీమహా విష్ణువే వరాహావతారంలో వచ్చాడంటూ పూజలు చేశారు భక్తజనం.

ఆ తర్వాత అలాంటి ఘటనలు అక్కడక్కడా జరిగాయి.. ఇంకా జరుగుతూనే వున్నాయి. చిలుకలు దేవుడి గుడిలో వుండటం, వానరం ఆంజనేయ స్వామి సేవలో మునిగిపోవడం.. ఒకటేమిటి.? లెక్కలేనని వింతలు చోటుచేసుకున్నాయి ఇటీవలి కాలంలో. దేవాలయంలో పాము సంచరించడం, దేవుడి విగ్రహాలపైనా, శివలింగాలపైనా దర్శనమివ్వడం అనేది సహజాతి సహజం.

తాజాగా ఓ ఎలుక, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన వరాహం తరహాలో ప్రదక్షిణలు చేస్తోంది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో జరిగిందీ వింత. జిల్లాలోని ఎల్లమ్మ దేవాలయంలో ఎలుక ప్రదక్షిణలు చేయడం గ్రామస్తుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకేముంది, పూజలు షురూ అయ్యాయి.

నమ్మినోళ్ళేమో అంతా దేవుని మాయ.. అంటోంటే, నమ్మని వాళ్ళేమో.. నాన్సెన్స్‌.. అని కొట్టి పారేస్తున్నారు. అప్పట్లో దేవుడి గుడిలో ప్రదక్షిణాలు చేసిన వరాహానికి అదేదో జబ్బు అని కొందరు డాక్టర్లు ఆరోపిస్తే, అబ్బే.. అదేం లేదని మరికొందరు వైద్యులు పరీక్ష చేసి మరీ తేల్చారు. ఇంతకీ కరీంనగర్‌ దేవుడి ఎలుక సంగతేంటి.? ముందే చెప్పుకున్నాం కదా.. నమ్మినోళ్ళకి దేవుడి మాయ.. నమ్మనోళ్ళకి జస్ట్‌ వింత.