ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు – 16

జవాబులు – తర్వాతి జానర్‌ జానపదాల గురించి చెప్పబోయేముందు కొన్ని విమర్శలకు సమాధానం చెప్తాను. నేను యిలాటివి ఎందుకు రాయాలి అని కొందరు పాఠకులు బాధపడుతున్నారు. మరి కొందరు యీసడిస్తున్నారు. ఇదే కాదు, బాహుబలి…

జవాబులు – తర్వాతి జానర్‌ జానపదాల గురించి చెప్పబోయేముందు కొన్ని విమర్శలకు సమాధానం చెప్తాను. నేను యిలాటివి ఎందుకు రాయాలి అని కొందరు పాఠకులు బాధపడుతున్నారు. మరి కొందరు యీసడిస్తున్నారు. ఇదే కాదు, బాహుబలి గురించో, చిరంజీవి గురించో రాసినపుడు 'చక్కగా శ్రీలంక, ఇజ్రాయేల్‌ వంటి ఎకడమిక్‌ సబ్జక్ట్‌లు రాయగలిగిన వాడు వాటిని పక్కన బెట్టి ఆ సమయంలో యివి రాయడమేమిట'ని కామెంట్స్‌ చేస్తారు. నిజానికి యిలాటి ప్రశ్న 1996-97 ప్రాంతాల్లోనే నాకు ఎదురైంది. ఫీచర్లు రాయడం అప్పుడే మొదలుపెట్టాను. 'మీలాటి సృజనాత్మకత వున్నవాళ్లు సొంత కథలు రాయకుండా అక్కణ్నుంచి, యిక్కణ్నుంచి ఏరుకుని వచ్చిన సమాచారంతో వ్యాసాలు, ఫీచర్లు రాయడమేమిటి?' అని వెక్కిరించారు. ఫీచర్లు నచ్చినవాళ్లు 'కథారచయితలు వేలాదిమంది వున్నారు. ఎవరైనా గిలికేయగలరు. మీలా క్లిష్టమైనదాన్ని సరళంగా, మనోరంజకంగా రాసేవాళ్లు తక్కువ. కథలు మానేసి ఫీచర్లే రాయండి' అనసాగారు. ఫీచర్లు రాస్తూంటేనే సృజనాత్మకత నాలుగు కాలాల పాటు నిలుస్తుంది అని తోచి (మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు ఒక మంచి ఉదాహరణ) నేను రెండూ రాస్తూ వస్తున్నాను. కాలమిస్టు అవతారం ఎత్తాక రాద్దామనుకుంటున్న అనేక కథలు రాయటం లేదన్న బాధ కూడా లేకపోలేదు. కానీ ఫీచర్లలో కూడా ఒక రకమైన సృజనాత్మకత వుందనే నా విశ్వాసం. ఎక్కడ ఎత్తుకోవాలి, ఏ వరుసలో సమాచారం అందించాలి, ఎలా చెప్పాలి అనేవి సాధన మీదనే పట్టుబడతాయి. ఇక వాటిల్లో వున్న సబ్జక్ట్‌ గురించి చెప్పాలంటే – నేను ఒక ప్రత్యేకముద్ర కలిగిన రచయితను కానీ ఫీచరిస్టును కానీ కాదు. ఫలానా సబ్జక్ట్‌పై యీయన అథారిటీ అని నాకెవ్వరూ కితాబు యివ్వరు. నాకు అన్నీ యిష్టమే, అందుకే అన్నీ కొద్దికొద్దిగా రుచి చూస్తాను, పాఠకులకు రుచి చూపిస్తాను. కథల్లో కూడా పలురకాల కథలు రాసిన సంగతి గమనించండి. ఇక ఫీచర్లలో కూడా నాకు రాజకీయాలు ఎంత యిష్టమో, సినిమాలు, పాటలు, సాహిత్యమూ, వేదాంతమూ, లైఫ్‌స్టయిల్‌ అంశాలు కూడా అంత యిష్టమే. 

రాజకీయాలు రాసినంత మాత్రాన మేధావిని, సినిమాల గురించి రాసినంత మాత్రాన మరోటీ అయిపోను. పాఠకులు రచయితలకు ముద్ర కొడదామని చూస్తారు కానీ రచయితలకుండే అభిరుచులు వ్యక్తిగతం. భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారికి డిటెక్టివ్‌ నవలలంటే చాలా యిష్టం అని చెప్తే ఆశ్చర్యపడతాం. నేను నా యిష్టాలను దాచుకోవడానికి ప్రయత్నించను. నా కిష్టమైనవాటి గురించి రాస్తూనే వుంటాను. నచ్చినవాళ్లు చదువుతారు, లేనివాళ్లు లేదు. ఎవరు తొందరపెట్టినా నేను చెప్దామనుకున్నది చెప్పక మానను. ఈ సీరీస్‌ నా స్థాయికి తగదని ఎంతమంది ఫీలైనా, నాకు తెలుసు – యిది మంచి సబ్జక్ట్‌ అని. దీన్ని నేను వరల్డ్‌స్పేస్‌ శాటిలైట్‌ రేడియోలో ఆడియోగా చెప్పినప్పుడు అద్భుతస్పందన వచ్చింది. పడక్కుర్చీ కబుర్లు – 11గా వేసినపుడూ వచ్చింది. వెయ్యి కాపీలేస్తే ప్రస్తుతానికి  పదో, పాతికో పుస్తకాలు మిగిలాయి. సినిమాపాటలపై, సినిమా స్క్రీన్‌ప్లేపై, సమాజంపై సినిమాల ప్రభావంపై రిసెర్చి చేసి డాక్టరేట్లు తీసుకుంటున్నారు. జానపదాలపై కూడా రిసెర్చి చేసే రోజు వస్తుంది. వారికి యిది మంచి బేస్‌ మెటీరియల్‌గా ఉపయోగపడుతుంది. పాటల పుస్తకం చదివితే తెలిసిపోయే సినిమా కథను మీరు ప్రత్యేకంగా చెప్పాలా అని కొందరి ప్రశ్న. నేను ఒక జానర్‌లో అనేక సినిమాల గురించి క్లుప్తంగా చెప్పి, ఒకే ఒక్క సినిమా గురించి మాత్రం, అదీ దాని కథాసంవిధానం లో క్లిష్టత గురించి చెపుతున్నాను. కథ ఎలా ముగుస్తుందో ముందే తెలిసిపోయినా ఆకట్టుకునే విధంగా ఎలా కల్పించారో, ఎన్ని మెలికలు వేశారో, హీరోకి ఎన్ని అవరోధాలు కల్పించారో ఎత్తి చూపిస్తున్నాను.

కానీ కొంతమంది పాఠకులకు యిదంతా చికాగ్గా వుంది. టీవీల్లో యివన్నీ తరచుగా వస్తూనే వుంటాయి, కావాలంటే చూడవచ్చు, వీటి గురించి రాయాలా? అని అడుగుతున్నారు. వస్తే మాత్రం చూసేవాళ్లెందరు? బ్లాక్‌ అండ్‌ వైట్‌లో వుందంటే ఎంతటి క్లాసిక్‌ వచ్చినా చూడమని ఒట్టేసుకున్నవాళ్లు చాలామంది నాకు తెలుసు. సినిమా చూసినవాళ్లందరూ నిశితదృష్టితో చూడరు. జానపదాల గురించి చాలామందికి తక్కువ అభిప్రాయం వుంది. ఒకాయన వాటిలో ఓవరాక్షన్‌ వుంటుంది కాబట్టి చూడను అని రాశారు. జానపదాల్లోనే కాదు, సాంఘికాల్లో కూడా వుంటుంది, పాతవాటిల్లోనే కాదు, కొత్తవాటిల్లో కూడా ఓవరాక్షన్‌ కనబడుతుంది. ఆ కారణం వలన ఆ తరహా సినిమాలు చూడడం మానేస్తే వింతగా తోస్తుంది. బాహుబలి, రుద్రమదేవి సినిమాల తర్వాత జానపద సినిమాలు మళ్లీ తీయడం ఆరంభించవచ్చు. చారిత్రాత్మక సినిమాలలో కూడా జానపదమే కనబడుతుంది. ఎందుకంటే చరిత్ర వివరంగా వుండదు. ఫలానా రాజు ఫలానా రాజుపై దాడి చేసి అతని కోటను ధ్వంసం చేసెను అని వుంటుంది. ఆ కోట ఎలా వుంటుంది, దాన్ని పట్టుకోవడానికి చేసిన తొలి ప్రయత్నాలు ఎటువంటివి, తర్వాత కాపలాదారుణ్ని ఎలా వశపరుచుకుని అతనిచేత గుమ్మం ఎలా తీయించారు, ఆ కోటలో ఒక వీరుడు అకస్మాత్‌ దాడిని ఎలా ఎదిరించాడు.. యిలాటివన్నీ వూహించి జానపదకథగా తయారుచేస్తేనే ఆ చరిత్ర ఆసక్తికరంగా మారుతుంది. పౌరాణిక సినిమాలలో కూడా కొంత కల్పన వుంటుంది. ఉదాహరణకి ఏకలవ్యుడి పాత్రో, భక్త కన్నప్ప పాత్రో వుందనుకోండి. పురాణంలో వున్న కథ పరిధి చిన్నది. దాన్ని ఫుల్‌ లెంగ్త్‌ సినిమాగా తీయాలంటే అతనికి ఒక ప్రేయసిని, ప్రత్యర్థిని, వారి మధ్య కలహాలను ఊహించి కల్పించాలి.  హాలీవుడ్‌లో కొన్ని తరహా సినిమాలున్నాయి. యులిసెస్‌ కథను మోడర్నయిజ్‌ చేసిన సినిమా ఓ సారి చూశా. యులిసెస్‌ సముద్రయానం చేసిన దారిలో ఆధునిక యువకులు ప్రయాణం చేస్తూ సాహసాలు చేయడం కథాంశం. మహాభారతంలో అర్జునుడి తీర్థయాత్రల కథను యీనాటి తరానికి ఆపాదించి మన దగ్గరా సినిమా తీయవచ్చు. అప్పుడు మళ్లీ జానపద సరళి అవసరం పడుతుంది. అందువలన జానపదాల గురించి మనం పట్టించుకోనక్కరలేదని అనుకోవద్దు. ఈ సీరీస్‌లో చివరిగా రాస్తున్న రాజకీయ తరహా జానపదాలు అన్నిటికన్న ఉత్తమశ్రేణి జానపదాలు. ఈ నాటి రాజకీయాలను బేస్‌ చేసుకుని ఎప్పుడో రాజుల కాలంలో జరిగినట్లు కల్పిస్తే సెన్సార్‌ గొడవలు రావు. తెలిసినవారికి సమకాలీన రాజకీయాలతో లింకు వుందని బోధపడుతుంది. తక్కినవారు కేవలం కథగా చూస్తారు. నా ఉద్దేశంలో జానపదాలకు కాలం చెల్లలేదు. పాఠకులు కూడా వాటిపై గౌరవభావంతో చదివితే నేను చెప్పిన మాటల్లో సారాంశం గ్రహించగలరు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)

[email protected]

Click Here For Archives