రాజకీయాల్లో శాశ్వత శతృవులు, మిత్రులు వుండరన్న మాట చెప్పుకోవడానికి బాగానే వుంటుంది. కానీ ఒక్కోసారి మరీ ఇబ్బందిగా వుంటుంది ఆలోచించడానికే చిత్రంగా వుంటుంది. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ వున్నట్లుండి మీడియా టైకూన్ రామోజీరావును కలవడం డిస్కషన్ పాయింట్ అయింది. బోలెడు కథనాలు వెలువడుతున్నాయి. కానీ అసలు కీలకమైన పాయింట్లు ఇక్కడ రెండు, మూడు వున్నాయి.
ఒకటి ఇప్పటికిప్పుడు జగన్ వెళ్లి రామోజీని కలవాల్సిన అవసరం ఏమొచ్చె?
ఇలా కలవడం ద్వారా తన ఫైటర్ ఇమేజ్ ఏ మేరకు డ్యామేజ్ అవుతుందన్నది గమనించాడా?
పోనీ ఇలా కలవడం ద్వారా, తన కల అయినా ముఖ్యమంత్రి పదవి సాధనకు రామోజీ సహకరిస్తారని జగన్ అనుకుంటున్నారా?
సమీప భవిష్యత్ లో ఎన్నికలు లేవు. మరో మూడున్నరేళ్లు కాలం వుంది. అందువల్ల ఇప్పుటికిప్పుడు కలవాల్సినంత అగత్యం లేదు.
ఇలా కలవడం ద్వారా జగన్ ఒకటి కాదు, రెండు కాదు..బోలెడు మెట్లు దిగి వచ్చాడన్నది వాస్తవం. రామోజీతో జగన్ కు లేదా జగన్ తో రామోజీకి వున్నది మామూలు శతృత్వం కాదు. బద్ధ వైరుధ్యం. ఆ శతృత్వమే కదా..జగన్ పై కేసులు బలపడడానికి, జైలుకు వెళ్లడం వెనుక తన వంతు పాత్ర తను పోషించింది. జగన్ ను అధికారానికి దూరంగా వుంచిది కూడా ఈ శతృత్వమే కదా. మరి ఇవన్నీ జగన్ ఒక్కసారిగా మరిచిపోయాడనే అనుకోవాలి. లేదా అలా మరిచిపోకుండా చిరకాలం ఢీ కొడుతూ వుండడం కష్టం అని అయినా అనుకోవాలి.
పోనీ మరిచిపోయి, వెళ్లి రామోజీ ముందు బుద్దిగా వెళ్లి కూర్చున్నందువల్ల తను కలలు కంటున్న సిఎమ్ పోస్టు తనకు దక్కడంలో రామోజీ సహకరిస్తారని జగన్ భావిస్తుంటే, అంతకన్నా అవివేకం మరొకటి వుండకపోవచ్చు.
కానీ జగన్ ను అభిమానించేవారు కావచ్చు, జగన్ పోరాటం చూస్తున్నవారు కావచ్చు, లేదా జగన్ తో వున్న వారు కావచ్చు..ఇలా రాజీపడే మనస్తత్వం వుండి వుంటే, అదేదో అప్పట్లో సోనియా ముందే రాజీపడి వుంటే బాగుండేది కదా? జైలు జీవితం తప్పేది..ఈడీ దాడులు, సీజింగ్ లు తప్పవి..రోశయ్య తరువాత సీఎమ్ చాన్స్ కూడా దక్కి వుండేది. ఈ చేతులు కట్టుకుని కూర్చునేది అప్పట్లో సోనియా ముందు కూర్చుని వుంటే, కనీసం ఆమెను ఒప్పించి, రాష్ట్ర విభజన అన్నా జరగకుండా చూసేవాడేమో?
మొత్తానికి ఇప్పుడు జరిగింది మాత్రం ఒక్కటే..జగన్ వ్రతం చెడింది..ఫలితం మాత్రం దక్కదు. అది గ్యారంటీ అనే అనుకోవాలి. ఈ అనుభవం ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డికి వుంది.