మార్కెట్ ప్రపంచం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందో, వెనుక పుంతలు తొక్కుతూ అనాగరిక పోకడలవైపు నడిపిస్తుందో అర్ధం కావడం లేదు. తమ ఉత్పత్తులు అమ్మడానికి కంపెనీలు చేస్తున్న ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో ఓ ఫోన్ కంపెనీ నిరూపించింది.
స్వీడిష్ టెలికాం కంపెనీ రెబ్టెల్ మన దేశంలో కొత్తగా అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ విషయానికి బహుళ ప్రచారం కల్పించడానికి సదరు కంపెనీ నలుగురు అమ్మాయిలను వినియోగించింది. ఈ నలుగురు అందమైన అమ్మాయిలూ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ దగ్గర రాత్రి సమయంలో సడెన్‌గా డ్యాన్స్ మొదలుపెట్టారు.
చమ్మక చల్లో అనే హిందీ పాటకు వీరు డ్యాన్స్ అదరగొట్టేశారు. కంపెనీ లోగోను ప్రదర్శిస్తూనే… వీరు చేసిన నృత్యం… అక్కడి వారిని ఉర్రూతలూగించింది. అంతగా వీరు కళ్లప్పగించేయడానికి కారణం… సినిమా తారల్లా వీరు వేసిన చిందులు మాత్రమే కాదు వీరు టాప్‌లెస్‌గా వచ్చారు మరి.
కంపెనీ ప్రమోషన్‌కు ఇలా అమ్మాయిల చేత నగ్న నృత్యాలు చేయించడంపై విమర్శలు చెలరేగడంతో రెబ్టెల్ వివరణ ఇచ్చింది. తాము స్త్రీ, పురుషులకు వారి దేహాలపై సమానంగా హక్కులుంటాయని విశ్వసిస్తామంది. మహిళల నగ్నత్వంపై సమాజం చూపుతున్న ద్వంద్వ ప్రమాణాలను విశ్లేషిస్తూ తీసిన ఫ్రీ ద నిపుల్ అనే సినిమా యే తమకు ప్రేరణ అంది.
అంతే కాదు ఈ ప్రదర్శనకూ తమ ఉత్పత్తికి ఉన్న సంబంధాన్ని కూడా వివరించింది. ఒక ఉత్పత్తిని తాము అమ్ముతున్నామన్నంత మాత్రాన తాము ఒక సాంఘికో్ద్యమంలో భాగం కాకూడదనేమీ లేదని స్పష్టం చేసింది. సంప్రదాయాలకు విలువిచ్చే భారతీయ సమాజానికి తాము ఒక ఉద్యమాన్ని పరిచయం చేస్తున్నామంది.
దుస్తులు ధరించకుండా, బికిని తరహాలో బాడీ పెయింటింగ్ మాత్రం చేసుకున్న నలుగురు అమ్మాయిలు చేసిన స్టంట్ డ్యాన్స్ ఇప్పుడు నెట్‌లో సైతం హల్‌చల్ చేస్తోంది. అత్యధిక సంఖ్యలో అమెరికాలో నివసించే భారతీయులు పోగైన రాత్రి 9.45 గంటల సమయంలో ఈ నృత్యహేల నిర్వహించారు. ఈ డ్యాన్స్‌లు చేసినవాళ్లంతా బాలీవుడ్ బృందమే.
దీని కోసం రా వన్ సినిమాలోని పాటకు తగిన స్టెప్పులను కొరియోగ్రాఫర్లు మోనికా దేశాయ్, సంచి లునావత్‌లు సమకూర్చారట. ఏదేమైనా… నృత్యం చివరలో మీరు మరింత మాట్లాడుకోవడానికి రెబ్టెల్ దోహదం చేస్తుంది అని ఈ డ్యాన్సర్లు చెప్పినట్టు… నిజంగానే ఇప్పుడు ఈ నృత్యోదంతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.