కలలు కనండి. వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ యువతకు సందేశం ఇచ్చిన అబ్ధుల్ కలాం కూడా ఇప్పుడు ఉండి ఉంటే… ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కనే కలలు చూసి కంగారుపడిపోయేవారు. మరీ పగటి కలలు కనకండి అంటూ తన సందేశానికి సవరణ కూడా జత చేసేవారు.
గత కొంతకాలంగా ఎపి ప్రజలకు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్న నారావారు… మరోసారి శుక్రవారం తన వండర్ డ్రీమ్స్‌ను వల్లెవేశారు. ఇందులో ఎప్పటిలాగే తాము కట్టబోయే రాజధాని నగరం ఎంత గొప్పగా ఉండబోతోందో వల్లె వేశారు.
అక్టోబరులో రాజధానికి శంకుస్థాపన జరుపుతున్నామని, రాజధాని నగరం సమీపంలో కడుతున్నట్టు ప్రకటించగానే విజయవాడ చుట్టు పక్కల ట్రాఫిక్ 100శాతం మేర పెరిగిందట. రానున్న రోజుల్లో ఇది 200శాతం పెరిగిపోనుంది కాబట్టి… దానికి మనం అంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. అందుకు తగినట్టుగా పధకాలు రూపొందిస్తున్నామంటూ… మచిలీపట్నం నుంచి విజయవాడ ఎయిర్‌పోర్ట్ కు కనెక్టివిటీ, కృష్ణా నది మీద మరో 3 వంతెనలు, దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్…ఇలాంటివే మరిన్ని చెప్పారు.
రాష్ట్రాన్ని విభజించిన వాళ్లు అసూయ చెందేట్టు రాజధాని నగరం నిర్మించనున్నామంటూ ఆయన ప్రకటించారు. పనిలో పనిగా ఇంత గొప్ప నగరాన్ని నిర్మించే క్రమంలో సింగపూర్ మనకు ఎంతో ఉదారంగా ఉచిత సేవలు అందిస్తోందంటూ కొనియాడేశారు. సింగపూర్‌కు ధీటుగా మన రాజధాని ఉంటుందన్నారు. అమరావతి భవనాలు చైనా టెక్నాలజీతో నిర్మితమవుతున్నాయన్నారు. ఇంత గొప్పగా చేస్తున్నాం కాబట్టి, రాజధాని నగరం కట్టేశాక ప్రపంచం మొత్తం మన దగ్గరకి వచ్చేస్తుందట.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఎంతో భవిష్యత్తు ఉన్న కాలేజీ విద్యార్ధినీ విద్యార్ధులు వరుసపెట్టి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు, రోడ్ల మీద కుక్కలు కూడా పిల్లల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నాయి. సూదులు గుచ్చేవాళ్లు, బ్లేడులతో కోసేవాళ్లు కొత్తగా బయలుదేరారు… పోనీ ఇప్పటి దాకా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసిన పనులేవైనా గొప్పగా ఉన్నాయా అంటే పుష్కరాల నుంచి పట్టి సీమ ప్రాజెక్టు దాకా ఏదీ పూర్తి సవ్యంగా జరిగింది లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని అనే ఏభై ఏళ్లకో వందేళ్లకో గాని సాకారం కాని గొప్ప నగరం గురించి పదేపదే చెప్పిందే చెపుతూ… అద్భుతాలు సృష్టించబోతున్నామంటూ గాల్లో మేడలు కడుతూ… ప్రస్తుత వాస్తవ పరిస్థితుల నుంచి ప్రజలను జోకొడదామని అనుకుంటున్నారో ఏమో గాని… ఇవి ఎక్కువ కాలం ప్రజల్ని మభ్యపెట్టి ఉంచలేవనేది బాబు గ్రహించాలి.