ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు – 15

ఓ రోజు జయంతి (రాజసులోచన) రాకుమారి తోటలోంచి బయటకు వస్తూంటే రేలంగి చూశాడు. ఆమెను మోహించి వెంటపడ్డాడు. అతని చంకలో వున్న చాపను లాక్కోవడానికి జయంతి వేషంలో వున్న జయంతుడు ఓ ఉపాయం పన్నాడు.…

ఓ రోజు జయంతి (రాజసులోచన) రాకుమారి తోటలోంచి బయటకు వస్తూంటే రేలంగి చూశాడు. ఆమెను మోహించి వెంటపడ్డాడు. అతని చంకలో వున్న చాపను లాక్కోవడానికి జయంతి వేషంలో వున్న జయంతుడు ఓ ఉపాయం పన్నాడు. రాత్రి తోటలోని మందిరానికి వస్తే చిక్కుతానన్నాడు. అప్పటికైతే తను మొగవాడు అయిపోతాడు కదా! అందుకని. అయితే ఈ మాటలు గిరిజ వింది. ఈ జయంతి యిలాటిదా? అనుకుని అసహ్యించుకుని రాత్రి మందిరానికి వెళ్లి తనని రెడ్‌ హేండెడ్‌గా పట్టుకోబోయింది. అప్పటికి రాజసులోచన నాగేశ్వరరావు అయిపోయింది కదా. చూసి తెల్లబోయింది గిరిజ. తను జయంతి సోదరుణ్నని, పేరు జయంతుడనీ హీరో చెప్పుకున్నాడు. గిరిజతో కాస్త శృంగారం చేశాడు. భార్యను మర్చిపోయాడు కాబట్టి ఈ శృంగారం ఎబ్బెట్టుగా లేకుండా చూశారు రచయిత. 

ఆమెతో మాట్లాడుతూ రేలంగి వస్తే నాలుగు తంతానని అనడం అప్పుడే తోటలోకి వస్తున్న రేలంగి చెవిన పడింది. అప్పటికప్పుడు అతను ఓ పన్నాగం పన్నాడు. ఓ దేవదూత వేషం వేసుకుని మాజిక్‌ కార్పెట్‌మీద రాజు వద్దకు వెళ్లి నీ కూతురు ఎవడితోనే కులుకుతోంది. వాణ్ని బంధించు. ఆ తర్వాత నా అనుచరుడు ఓ స్వామీజీ ఊరి చివర వున్నాడు. వాణ్ని సలహా అడుగు అని వెళ్లిపోయాడు. 'కథా సరిత్సాగరం'లో నరుడే యిలా ఎగురుతూ వచ్చి విష్ణువునని బుకాయించడం కథ వుంది. అక్కణ్నుంచే వీళ్లీ ఐడియా తీసుకున్నారేమో. రాజు తక్షణం గిరిజతో వున్న నాగేశ్వరరావును ఖైదు చేయించాడు. కానీ మర్నాడు పొద్దున్న చూస్తే అతని స్థానంలో రాజసులోచన కనబడింది. ఇదేమిటి వింత? అని అడిగితే రాజసులోచన తిక్కతిక్కగా సమాధానం చెప్పింది. పిచ్చిది కాబోసు అనుకుని రాజు ఊరిచివర సన్యాసిని సలహా అడగబోయాడు. రేలంగే ఆ సన్యాసి వేషంలో అక్కడుండి కాళికాలయంలో జయంతిని కట్టిపడేయ్‌. నేను వచ్చి బలి యిస్తాను అని చెప్పాడు. అలాగే కాళికాలయంలో కట్టిపడేశారు. 

అంజలి మగవేషం యిప్పేసి మామూలు ఆడదానిలా ఆ గుడిలో ఓ మూల దాక్కుంది. రేలంగి అక్కడికి వచ్చాడు. రాజసులోచన మాయమాటలు చెప్పి అతన్ని కట్లు యిప్పమంది. అతను మోహంలో పడి కట్లు విప్పేశాడు. అప్పుడు 'తనే జయంతి అనీ, తనే జయంతుడు అనీ' అతనికి చెప్పి కట్టిపడేసి చాప, దండం పట్టుకుని రాజసులోచన బయటపడింది. ఇది విన్న అంజలి ఆనందపడింది. రాజసులోచనను అనుసరిస్తూ వెళ్లింది. బాలకృష్ణ కమండలం కొట్టేసి వెళ్లిపోయాడని చెప్పాను కదా, అతను వెళ్లి ఓ రాక్షసుడి దగ్గర పడ్డాడు. రాక్షసుడు అతన్ని ఖైదీగా పెట్టుకుని కమండలంలోనుండి తనకు కావలసినవి తెప్పించుకుంటూ హాయిగా వున్నాడు. బాలకృష్ణ పనే దయనీయంగా ఉంది. ఆ రాక్షసుడి వద్దకు రాజసులోచన చేరింది. ఆమెను చూసి రాక్షసుడు మోజుపడ్డాడు. అతని దగ్గర వున్న కమండలం చూడగానే రాజసులోచనకు ఐడియా వచ్చింది. రాక్షసుణ్ని వలచినట్టు నటించి అమృతజలం కురిపిస్తే తాను అతని వద్దకు వస్తానంది. 'కొమ్మనురా, విరుల రెమ్మనురా' అని పాట పాడుతూండగా రాక్షసుడు కమండలం ద్వారా అమృతజలం కురిపించాడు. దాంతో శాపవిమోచనం అయిపోయింది. రాజసులోచన నాగేశ్వరరావు అయిపోయింది. 

అది చూస్తూనే రాక్షసుడు మండిపడ్డాడు. అతన్ని మింగేయబోయాడు. చేతిలో దండం వుంటే చాలు, అతని పని పట్టవచ్చు. కానీ దండం నాగేశ్వరరావు చేతికి అందడం లేదు. ఆ టైములో అంజలి అక్కడ వుండడం అక్కరకు వచ్చింది. దండాన్ని అతనివైపు విసిరింది. దానితో నాగేశ్వరరావు రాక్షసుణ్ని సంహరించాడు. కానీ ఆ రాక్షసుడు కింద పడుతూ పడుతూ కమండలం మీద పడ్డాడు. అది ముక్కముక్కలైపోయింది. అది నాశనమైపోవడంతో దండం కూడా అదృశ్యమైపోయింది. ఇక మిగిలింది చాప ఒక్కటే. అది చంకన పెట్టుకుని నాగేశ్వరరావు అంజలి వద్దకు వచ్చి 'మీరు నన్ను కాపాడారు. కృతజ్ఞుణ్ని' అంటూ వెంటపడ్డాడు. ఇతను తనను ఎక్కడ ముట్టుకుంటాడో, శాపానికి గురవుతాడోనని ఆమె కంగారు. చివరకి అనుకున్నదంతా అవుతుంది. ఆమె జారిపడితే అతను పట్టుకుని లేవదీయబోయి శాపానికి గురయ్యాడు. అంటే పాషాణంగా మారిపోసాగాడు. సినీ సూత్రాల ననుసరించి ఒక్కసారిగా పాషాణమైపోడు. రమణ గారి మాటల్లో చెప్పాలంటే గ్రీకులోంచి, లాటిన్‌లోకి రెండు భాషలూ రానివాడు అనువదించేటంత స్పీడులో తర్జుమా అవుతూ వుంటాడు. అంటే అతి మెల్లగా అన్నమాట. 

ఇక్కడ కథ పీటముడి పడిపోయింది. ఓ శాపం వదిలిపోయిందనుకుంటే మరోశాపం చుట్టుకుంది. శక్తి చూపిద్దామంటే లాభం లేదు, యుక్తి చూపిద్దామంటే లాభంలేదు. ఇక మిగిలినది భక్తి ఒక్కటే! దేవుడే దిక్కు! ఆయనతోనే వీళ్ల సమస్య పరిష్కారమవ్వాలి. అందుకే దీన్ని భక్తిప్రధానమైన జానపద సినిమాల కోవలో పెట్టినది! ఈ పరిస్థితిలో వాళ్ల పిల్లవాడు కనబడ్డాడు. ఈ యాక్టివిటీ అంతా ఆదిదంపతుల గుహదగ్గరే నడుస్తోందనుకోవాలి మనం. 'అయ్యోపాపం కష్టంలో వున్నారా? మా అమ్మానాన్నా తీరుస్తారు రండి' అంటూ ఆ పిల్లాడు వాళ్లని గుహలోకి లాక్కువచ్చాడు. అది వీళ్ల ఒరిజినల్‌ గుహే కదా! అందరూ కలిసి ప్రార్థించారు. కానీ ఆ సమయంలో శివపార్వతులు నాట్యక్రీడలో వున్నారు. అంబ పలకలేదు. 

ఇక ఆ పిల్లాడు అమ్మా, అమ్మా అంటూ పార్వతి విగ్రహం పాదాల మీద తల బద్దలు కొట్టుకున్నాడు. అసలు పార్వతి పాదాలమీద రక్తం కనబడింది. ఆవిడ మొగుణ్ని వెంటేసుకుని ప్రత్యక్షమైంది. శివుడు వీళ్ల గోడు విన్నాడు. 'ఇంద్రుడి శాపం తొలగాలంటే ఆకాశంగంగలో బంగారు కమలాన్ని పట్టుకొచ్చి యితని నెత్తిమీద పెట్టమ'న్నాడు. ఎలా వెళ్లడం? అప్పుడు మూడో దివ్యవస్తువు చాప అక్కరకు వచ్చింది. పిల్లవాడు బయలుదేరాడు. ఆకాశానికి వెళ్లి కమలం పట్టుకుని వచ్చాడు. వీళ్ల యాక్టివిటీ అంతా ఓ కంట గమనిస్తున్న ఇంద్రుడు ఊరుకోలేదు. వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది పిల్లవాణ్ని వెంటాడింది. గుహలోకి వచ్చేసరికి శివుడి త్రిశూలం ఇంద్రుడి వజ్రాయుధాన్ని నిలవరించింది. ఆఖరి వెంట్రుక శిలారూపం ధరించడానికి ముందు బంగారు కమలం నెత్తిన పెట్టడం, రాతి నాగేశ్వరరావు, మామూలు నాగేశ్వరరావు కావడం జరిగింది. 

ఇంకా ఇంద్రుడు ఏదో గింజుకుంటూ వుంటే శివుడు ప్రత్యక్షమై అతన్ని చివాట్లు పెట్టడం జరిగింది. అందరూ దేవుణ్ని కీర్తించాక చాప ఎక్కి నాగేశ్వరరావు ఒరిజినల్‌ సామ్రాజ్యానికి బయలుదేరారు. ఈలోపుగానే గురుపుత్రి అబద్ధం చెప్పిందని బయటకు రావడం, సిగ్గుతో ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రాజుగారి వద్దకు పొరుగురాజుగారైన సియస్సార్‌ వచ్చి ఓదార్చడం జరుగుతోంది. ఇంతలో భార్యా పిల్లలతో సహా నాగేశ్వరరావు చాప మీదనుంచి దిగాడు.నాగేశ్వరరావును చూస్తూనే గిరిజ మొహం విప్పారింది. అంజలి అతని భార్య అని తెలియగానే ముడుచుకు పోయింది. కానీ అంజలే పెద్దమనసు చేసుకుని వాళ్లిద్దరి చేతులూ కలిపింది. ఫక్తు జానపద హీరో టైపులో నాగేశ్వరరావుకి ఇద్దరు భార్యలూ దక్కారు. ఇదీ భక్తిరస జానపదాలకు మచ్చు అనదగిన సువర్ణసుందరి కథ. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)

[email protected]

Click Here For Archives