భార్యలకు కమల్ ఇచ్చిన హోదా అది..!

ఏదేమైనా కమల్ ఒక ట్రెండ్ సెట్టర్. సినిమాల రూపకర్తగానేకాదు.. సినిమా వాడిగా ఎలా బతకాలన్నే విషయంలో కూడా కమల్ ఒక ట్రెండ్ సెట్టర్. లైఫ్ స్టైల్ విషయంలో కూడా కమల్‌ను అనుసరించే వాళ్లు ఎంతోమంది!…

ఏదేమైనా కమల్ ఒక ట్రెండ్ సెట్టర్. సినిమాల రూపకర్తగానేకాదు.. సినిమా వాడిగా ఎలా బతకాలన్నే విషయంలో కూడా కమల్ ఒక ట్రెండ్ సెట్టర్. లైఫ్ స్టైల్ విషయంలో కూడా కమల్‌ను అనుసరించే వాళ్లు ఎంతోమంది! టాలీవుడ్‌లో కొంత కాలం కిందట ఒక ట్రెండ్ మొదలైంది. పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన హీరోలు.. వారి భార్యలను తమ సినిమాలకు కాస్టూమ్ డిజైనర్లుగా పెట్టుకొన్నారు. పవన్ కల్యాణ్‌కు రేణూదేశాయ్ కాస్టూమ్ డిజైనర్ అయ్యింది. బాలూ వంటి సినిమాల్లో పవన్ డ్రస్సుల్లో రేణూ మార్క్ కనిపిస్తుంది! కేవలం పవన్ – రేణూలు మాత్రమే కాదు.. చాలా మంది హీరోలకు వాళ్ల భార్యలు కాస్టూమ్ డిజైనర్లు. వాస్తవానికి ఇలాంటి ట్రెండ్‌ను మొదలు పెట్టింది కమల్. అది కూడా దశాబ్దాల కిందట! 

వాణీ గణపతి.. కమల్‌హాసన్ మొదటి భార్య. నటుడిగా నిలదొక్కుకొంటున్న దశలోనే వాణిని వివాహంచేసుకొన్నాడు కమల్. భరత నాట్యకారిణి అయిన వాణీని కమల్ సినిమా రంగంలోకి తీసుకొచ్చాడు. అది కాస్టూమ్ డిజైనర్ గా! నటుడిగా స్టార్ స్టేటస్‌ను సంపాదించుకొన్నాకా కమల్.. చెప్పింది నిర్మాతలైనా, దర్శకులైనా వినాల్సిందే కాబట్టి.. వాణికి హీరో కాస్టూమ్ డిజైనర్ హోదాను ఇచ్చారు. 1978 నుంచి 1988 వరకూ ఆమెకు ఆ హోదా ఉండింది. ఆ మధ్యలో వచ్చిన సినిమాల విషయంలో వాణీ కమల్‌కు కాస్టూమ్ డిజైనర్‌గా వ్యవహరించింది. అయితే ఆ హోదా ఆమెకు  కమల్ భార్య హోదా ఉన్నంత వరేక! 1988లో కమల్ విడాకులు తీసుకొన్నాడు. వాణీతో వేరు పడ్డాడు. 

ఆ తర్వాత కమల్ కాస్టూమ్ డిజైనర్ హోదాలోకి వచ్చింది సారిక ఠాకూర్. వాణితో విడాకులకు ముందే ఆమెతో కమల్ డేటింగ్ మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోకుండానే.. పిల్లలు పుట్టారు!  మూడేళ్ల డేటింగ్ తర్వాత వివాహం చేసుకొన్న ఈ జంట 2004 వరకూ ఒకటిగా ఉన్నారు. వీరి దాంపత్యం కొనసాగిన పదిహేను సంవత్సరాల మధ్య వచ్చిన కమల్ సినిమాకు కాస్టూమ్ డిజైనర్‌గా ‘‘సారికా హాసన్’’ పేరు పడుతుంది. అలా రెండో భార్యను కూడా కమల్ కాస్టూమ్ డిజైనర్ హోదాతో గౌరవించాడు. ’’ఇంద్రుడు చంద్రుడు’’ వంటి సినిమాల్లో కమల్ గెటప్పుల్లో సారిక శ్రద్ద చాలానే కనిపిస్తుంది!

ఉత్తమవిలన్ ఆడియో విడుదల వేడుకలో దర్శకుడు రమేశ్ అరవింద్ తన ప్రసంగంలో ఒక విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకొన్నాడు. అదేమిటంటే..‘‘తమిళ హీరో, కన్నడ దర్శకుడు.. తెలుగు కాస్టూమ్ డిజైనర్.. కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది అని కన్నడ స్లాంగ్‌లోని తెలుగులో అతడు వివరించాడు. అంటే తను కన్నడ వాడినని, కమల్ తమిళుడు అని.. చెప్పడంతో పాటు.. ఈ సినిమాకు తెలుగు వాళ్లతో కూడా అనుబంధం ఉంది.. ఈ సినిమా కాస్టూమ్ డిజైనర్ తెలుగు వ్యక్తి అని చెప్పడం రమేశ్ అరవింద్ ఉద్దేశం. ఆ తెలుగు వ్యక్తి ఎవరయ్యా అంటే.. గౌతమి. నిడదవోలు ప్రాంతానికి చెందిన గౌతమి తడిమళ్ల.. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలిగారు, ఆ తర్వాత పెళ్లి చేసుకొని దశాబ్దం పాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. అనంతరం విడాకులు తీసుకొని.. ఇప్పుడు కమల్‌తో సహజీవనం చేస్తున్నారు.

సారికతో విడిపోయిన అనంతరం కమల్ తర్వాతి పార్ట్ నర్ గురించి చాలా రూమర్లే వచ్చాయి. 2004లో సమయంలో కమల్‌తో వరసగా సినిమాల్లో నటించిన సిమ్రాన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడనేది ఆ పుకార్ల సారాంశం. అయితే ఎందుకో అది జరగలేదు. ఆ తర్వాత నాలుగేళ్లకు కమల్, గౌతమిలు లివిన్ రిలేషన్ షిప్ మొదలు పెట్టారు. మేజర్లు అయిన వీరి కూతుర్లు కూడా ఈ బంధానికి విలువనిచ్చారు! కమల్ తన మాజీ భార్యలకు ఇచ్చినటువంటి హోదానే గౌతమికి కూడా ఇచ్చాడు. ‘ఉత్తమవిలన్’ సినిమాలో కమల్ కు గౌతమి కాస్టూమ్ డిజైనర్. 

ఈ విధంగా తన ఆత్మీయ నేస్తాలందరికీ.. కమల్ కాస్టూమ్ డిజైనర్ హోదాలను ఇచ్చాడు. మరి గౌతమికి శాశ్వతంగా ఈ హోదా ఉంటుందో.. లేక భవిష్యత్తులో కమల్ ఇంకా వేరే కాస్టూమ్ డిజైనర్లను నియమించుకొంటాడో వేచి చూడాలి!