ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలున్నాయనేది నిజం. దీన్ని ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. గత నెలాఖరుకు కరెంట్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నాటి విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని, ఉన్నతాధికారులు చెప్పారు. అయితే చెప్పినట్టు జరగలేదు. పట్టణాలు, నగరాలు, పల్లెలు ఇలా కరెంట్ కోతలకు ఏమీ మినహాయింపు లేవు. చివరికి రాష్ట్ర మంత్రులకు కూడా కరెంట్ కోత సెగ తప్పలేదు.
కరెంట్ కోత బాధలు మంత్రులకు కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో సంబంధిత ఉన్నతాధికారులు ఉన్నారనే భావన కలుగుతోంది. ఇవాళ సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ ఎఫ్ఏఓ అవార్డుకి ఆర్‌బీకేలను నామినేట్ చేసిన నేపథ్యంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ ఖ్యాతి గడించాయని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్‌బీకేలను సీఎం జగన్ తెచ్చారన్నారు. రెండేళ్లలోనే మంచి ఫలితాలను తీసుకొచ్చారని కొనియాడారు. 10,700 రైతు భరోసా కేంద్రాలు రైతులకు మేలు చేసేందుకు తెచ్చినట్టు చెప్పారు. ఆర్‌బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదన్నారు.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి చెబుతున్న తరుణంలో కరెంట్ పోవడం గమనార్హం. దీంతో మంత్రి ఒకింత చిన్నబుచ్చుకున్నట్టైంది. ఒకవైపు కరెంట్ కోతలు విధిస్తూ, మరోవైపు చార్జీలను బాదుతున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల విమర్శల్లో పసలేదని అధికార పక్షం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది.
ఈ క్రమంలో మంత్రి నిర్వహిస్తున్న మీడియా సమావేశంలోనే కరెంట్ పోతుంటే …ఇక వాళ్ల దగ్గర సమాధానం ఏముంటుంది? కనీసం సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశాలకైనా కరెంట్ కోత లేకుండా చర్యలు తీసుకోకపోతే విమర్శలు తప్పవు. ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో కరెంట్ కోతలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.