ఎమ్బీయస్‌ : జానపద చిత్రాలు- 13

సువర్ణసుందరి కథను సదాశివబ్రహ్మంగారు, ఆదిత్యన్‌ పేరుతో నిర్మాత, సంగీతదర్శకుడు ఆదినారాయణరావు కలిసి రాశారు. మాటలు మల్లాది రామకృష్ణశాస్త్రి, పాటలు సముద్రాల సీనియర్‌. పాటల్లో కూడా మల్లాది హస్తం వుందని అంటారు. సినిమా స్క్రీన్‌ప్లే, డైరక్షన్‌…

సువర్ణసుందరి కథను సదాశివబ్రహ్మంగారు, ఆదిత్యన్‌ పేరుతో నిర్మాత, సంగీతదర్శకుడు ఆదినారాయణరావు కలిసి రాశారు. మాటలు మల్లాది రామకృష్ణశాస్త్రి, పాటలు సముద్రాల సీనియర్‌. పాటల్లో కూడా మల్లాది హస్తం వుందని అంటారు. సినిమా స్క్రీన్‌ప్లే, డైరక్షన్‌ వేదాంతం రాఘవయ్యగారిది. కథానాయిక, సహనిర్మాత అంజలీదేవి. హీరో నాగేశ్వరరావు మాళవ రాజకుమారుడు. మంత్రి కుమారుడు పేకేటితో కలిసి గురువుగారి వద్ద ఓ సామాన్యుడిలా చదువు అభ్యసించడానికి వచ్చాడు. చదువు అయిపోయి రాజ్యానికి వెళ్లి పట్టాభిషేకం చేసుకోవలసిన సమయంలో గురుపుత్రి అతన్ని ఏకాంతంగా దొరకబుచ్చుకుని అతనిపై మనసు పడ్డానని చెప్పింది. కానీ హీరో ఆమెను  చెల్లెల్లా భావించానన్నాడు. మీద పడబోతూవుంటే తోసేశాడు. దాంతో ఆమె దెబ్బతిన్న తాచయి అత్యాచారం చేశాడని అల్లరి చేసి తండ్రికి చెప్పింది. జయంతుడు తన వాదన చెప్పబోతే గురువు వినిపించుకోలేదు. మహారాజు వద్దకు తీసుకుపోతానన్నాడు. బంధించి తీసుకుపోతూంటే చెలికాడు పేకేటి జయంతుణ్ని విడిపించాడు. రాజువద్దకు వెళ్లి జరిగినది చెపుదాం అని పేకేటి అంటే జయంతుడు 'గురువుగారికి చెడ్డపేరు వస్తుంది' అని మొహమాట పడ్డాడు. గురువు ఊరుకోలేదు. రాజుగారి వద్దకు వెళ్లి తన కూతురు మానభంగానికి గురయిందని చెప్పాడు. చేసినది ఎవరని అడగడానికి ముందే రాజు అయితే అతనికి శిరచ్ఛేదం అన్నాడు. అతనెవరో కాదు, నీ కుమారుడే! అన్నాడు గురువు. తప్పు చేయకపోతే యిక్కడకు రాకుండా పారిపోవడమేం? అని గురుపుత్రి లాజిక్‌ లాగింది. మహారాజు కాస్సేపు బాధపడి, రాజభటుల్ని పంపించాడు – తీసుకువస్తే తల తెగేద్దామని. ఇవతల హీరో దానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ మంత్రికుమారుడే చివాట్లు వేశాడు. నీలాటి కొడుకుని పోగొట్టుకుని మీ నాన్న బతకగలడా? ఉట్టిపుణ్యానికి మీ యిద్దరూ చావడం దేనికి? నిజం నిలకడమీద బయటపడుతుంది. అప్పటిదాకా ఎక్కడైనా దాక్కో అని చెప్పి పంపించేశాడు. 

ఇక హీరో దేశాల మీద పడ్డాడు. ఓ చోట ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు. రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ.  ముగ్గురూ ఓ దారికి అడ్డుగా నిలబడి ప్రయాణీకుల చేత సుంకాలు కట్టించుకుంటూ వుంటే హీరో ముగ్గుర్నీ తుక్కుకింద కొట్టేశాడు. మేం చెప్పినపని చేస్తే మీకు బానిసలవుతాం అన్నారు వాళ్లు. పనేమిటంటే ఊరి చివర కొండగుహలోకి వెళ్లిన మనుష్యులెవరూ తిరిగి రావటం లేదుట. వెళ్లి అదేమిటో తెలుసుకుని రావాలిట. హీరో అక్కడికి వెళితే అక్కడ ఓ ఋషి కనబడ్డాడు. అతని దేహం కొండచిలువలా వుంది. పక్కన ఓ అగ్నిగుండం మండుతోంది. ఏమిటిది? అంటే 'నేను శాపగ్రస్తుణ్ని. ఎవరైనా రాకుమారుడు, ధర్మం తప్పనివాడు, బ్రహ్మచారి నా గురించి ఈ అగ్నిగుండంలో ఉరికితే అతని దేహం, నా శాపం దగ్ధమవుతాయి' అన్నాడు. హీరో క్షణం కూడా ఆలోచించకుండా టప్పున అగ్నిలోకి ఉరికేశాడు. వెంటనే ఆ ఋషి ఓ యక్షుడయిపోయాడు. హీరో అగ్నిలోంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ యక్షుడు యితని త్యాగశీలతకు మెచ్చి మూడు దివ్యవస్తువులు బహుమతిగా యిచ్చాడు. వాటిని శాండిల్య మహర్షినుండి తస్కరించి ఈ యక్షుడు శాపగ్రస్తుడయ్యాడు. ఆ వస్తువులేమిటంటే ఓ చాప – మాజిక్‌ కార్పెట్‌ అన్నమాట – ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోతుంది. రెండోది ఓ కమండలం – అక్షయపాత్ర అన్నమాట. మూడోది మంత్రదండం – ఎవర్నైనా దండించాలంటే దాన్ని ఆజ్ఞాపిస్తే చాలు. ఇవి యిచ్చి యక్షుడు మాయమయిపోయాడు. 

రేలంగి బృందం హీరో వెనక్కాలే గుహలోకి వచ్చి యిదంతా కన్నారు, విన్నారు. అతను బయటకు వస్తూంటే చూసి బండరాయి పెట్టి అతని తల బద్దలు కొట్టి అవి ఎత్తుకుపోయారు. అతను ఓ కొలను వద్ద స్పృహతప్పి పడివున్నాడు. అవేళ కార్తీక పౌర్ణమి. చంద్రోదయం కాగానే గుహలోనే వున్న శివపార్వతుల విగ్రహాలను అభిషేకించడానికి సురగంగ ఆ కొలనులోకి ఉబికి వస్తుంది. ఆ గంగ తగిలి జయంతుడి దెబ్బ మటుమాయమైంది. అతను కళ్లు తెరిచి చూడబోతూండగానే ఇంద్రుడి సభలో నాట్యకత్తెలు ఆ గుహలోకి దిగి వస్తున్నారు. ఏడాదికి ఓ సారి కార్తీక పౌర్ణమినాడు శివుణ్ని అభిషేకించడానికి, పాటతో, నృత్యంతో ఆరాధించడానికి ఆకాశంనిండి దిగి వస్తారు. వీళ్లను చూస్తూనే హీరో  స్తంభం చాటున దాగుని అందరిలో ప్రముఖంగా వున్న సువర్ణసుందరి – అంజలి వేశారా పాత్ర – చూస్తూనే మతి పోగొట్టుకున్నాడు. కొంటెగా మూర్ఛ నటించి ఆమె దృష్టిని ఆట్టుకున్నాడు. ఆమె కూడా యితన్ని చూస్తూనే మోహించింది. చెలికత్తెలు కాస్సేపు ఆటపట్టించారు కానీ సహకరించారు. 

హీరో, హీరోయిన్లు ఆదిదేవుల ఎదుట గాంధర్వవిధిని వివాహం చేసుకున్నాడు. ఆమె అతనికి ఓ ఫ్లూట్‌ యిచ్చింది. ఎప్పుడైనా నేను రావాలనిపిస్తే ఊదు, వచ్చేస్తా అని చెప్పింది. ఇక కోతికి కొబ్బరికాయ దొరికినట్టు యితను ఒకటే వాయించడం. అవతల ఆమె ఇంద్రుని కొలువులో డాన్సు చేయాలి కదా, ఆ స్పృహే లేదితనికి. ఓ రోజు యితనితో సరాగాలు ఆడుతూ కూచుంది. అవతల యింద్రుడి సభలో డాన్సు చేయవలసిన తరుణం వచ్చి పడింది. ఈమె లేకుండా డాన్సు జరగదు. చెలికత్తెలు కంగారు పడుతూంటే అప్పుడు పాట పాడుతూ వస్తుంది. 'పిలువకురా, అలుగకురా' అని. అది జయంతుణ్ని వుద్దేశించి పాడిందేనని మనకు తెలుసు. కానీ ఇంద్రుడు అది తనగురించే పాడిందనుకుని ఆనందించేస్తాడు. 'సువర్ణసుందరి' అనగానే ముందు ఈ పాటే గుర్తొచ్చేటంత యిదిగా పాప్యులరయింది ఆ పాట. మధ్యలో ఫ్లూట్‌ బిట్స్‌ ఎంత ఉత్సాహభరితంగా వుంటాయో చూడండి. 

వీళ్ల సరసం యిలా నడుస్తూండగానే ఇతని దివ్యవస్తువులు ఎత్తుకుపోయినవారి గతి ఏమయిందో చూద్దాం. ముగ్గురికీ కావలసినది కమండలమే! మంత్రదండం కూడా కమండలానికి లోబడి వుంటుంది. కమండలం నాశనమైతే దండం దండగైపోతుంది. పని చేయదు. అందువల్ల కమండలం నాకంటే నాకని కొట్టుకుంటారు. ఓ రోజు రాత్రి రేలంగి, రమణారెడ్డి నీరసించి నిద్రపోతూండగా బాలకృష్ణ కట్లు విప్పేసుకుని కమండలం తీసుకుని పారిపోయాడు. కాస్సేపటికి వీళ్లకు మెలకువ వచ్చి చూసి జరిగిన మోసాన్ని గమనించారు. ఏం చేస్తారు? ఉన్నవాటిల్లో చాపను రేలంగి, దండాన్ని రమణారెడ్డి తీసుకుని చెరోపక్కకూ బయలుదేరారు. 

హీరో హీరోయిన్ల్ల శృంగారానికి ఫలితంగా హీరోయిన్‌ గర్భవతి అయ్యింది. ఓ రోజు యింద్రసభలో డాన్సు చేస్తోంది. ఈలోగానే జయంతుడు ఊహూ ఫ్లూటు వాయించేస్తున్నాడు. ఆమె ఎక్కడున్నా ఈ వేణునాదం వినబడుతుంది.  మంత్రించినట్టు భూమికి లాగుతుంది. ఓ పక్క యింద్రుడు, మరోపక్క వేణునాదం. ఈ టెన్షన్‌లో ఆమె కళ్లు తిరిగి పడింది. అశ్వినీదేవతల్ని పిలిపించి ఏమయిందాని చూడమంటే గర్భవతి అని తేల్చారు వాళ్లు. ఆమె యిక అమృతపానానికి అర్హురాలు కాదన్నారు. నరుడితో కూడి గర్భం ధరించిందన్నారు. చెప్పానుగా యింద్రసభలో ఆస్థాన విలన్‌ ఇంద్రుడేనని. వీళ్ల ప్రేమ సంగతి విని మండిపడ్డాడు. 'ఇక నీకు భూలోకవాసమే' అన్నాడు. 'ఫైన్‌. ప్రేమించేందుకు అనువైనది నరలోకమే. ఇక్కడేముంది?' అందీమె తొణక్కుండా. ఇంద్రుడికి తిక్కరేగింది. 'నీ ప్రియుడు నిన్ను మర్చిపోతాడు' అన్నాడు. అతనలా అనగానే యిక్కడ హీరో ఫ్లూట్‌ విసిరేసినట్టు చూపించారు. 'అలా అయినా ఫర్వాలేదు, నేను ఆదరం చూపి అతనిలో మళ్లీ ప్రేమ చిగురించేట్లు చేస్తాను' అంది పట్టుదల కలిగిన మన ప్రేమికురాలు. 'ఓహో, అలా వచ్చావా? అయితే తీసుకో యింకో శాపం. నీ చేతి స్పర్శ తగిలితే అతను రాయి అయిపోతాడు' అన్నాడు యింద్రుడు. ఇలా కథను కాంప్లికేట్‌ చేసి పారేశాడు. దానితో బాటు తక్షణం ఆమెను భూమిమీదకు తోసేశాడు.(సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)

[email protected]

Click Here For Archives