పశ్చిమగోదావరి జిల్లాలో మొదలైన సూదిగాడి సంచలనం పక్క రాష్ట్రాలకూ పాకింది. తెలంగాణలోనూ గుచ్చడాలు షురూ అయ్యాయి. నెల రోజుల పైగానే ప్రత్యేక బృందాలతో సహా జల్లెడ పట్టి వెతికినా సదరు సూదిగాడి ఆచూకీని పోలీసులు పట్టలేకపోయారు. దీంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న పోలీసుల పరువు ఆఫ్ట్రాల్ ఒక అనామకుడి చేతిలో మరింతగా దిగజారి పోతూ వచ్చింది. ఏమైందో ఏమో.. ఇటీవల కాస్త సూదిగాడి దాడులు తగ్గుముఖం పట్టాయి.
హమ్మయ్య అనుకుంటూ పోలీసులు జనం ఊపరిపీల్చుకున్నారు. సూదిగాడు విశ్రమించాడులే అని కాస్త స్థిమితపడ్డారు. అయితే బుధవారం అకస్మాత్తుగా మరో రకం దాడులు మొదలయ్యాయి. అయితే ఈ సారి ఈ దాడులకు వేదిక అయింది తూర్పు గోదావరి జిల్లా. ఈ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని వై రాంపురం గ్రామంలో ఒక బాలిక మీద అగంతకుడు దాడి చేశాడు. బ్లేడుతో ఎడా పెడా మోచేతి మీద కోసేసి పరారయ్యాడు.
ఈ దాడిలో స్వల్పంగానే బాలికకు గాయాలైనప్పటికీ పట్టపగలు జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలే సూది భయంతో ఉన్న జనాలకు ఈ బ్లేడు దాడి దడ పుట్టించింది. బాలిక స్థానికంగా ఉన్న స్కూల్లో టెన్త్‌క్లాస్ విద్యార్ది అని తెలిసింది. ఈ బ్లేడు గోల సూదిదాడుల్లా అంటువ్యాధిలా ముదరకుండా పోలీసులు తమ వంతు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం.