తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది అవుతోంది. ఉద్యమసమయంలో లేవనెత్తిన అనేక అంశాల్లో సాంస్కృతిక పరమైన అణచివేత ఒకటి. ఆంధ్ర పాలకులు తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని ఎద్దేవా చేశారని, సినిమా నుంచి సాహిత్యరంగాల దాకా అన్ని కళారూపాల్లో తెలంగాణ కళాకారులను అణచివేశారని విపరీతమైన ప్రచారం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక యివన్నీ చక్కదిద్దుతామని అన్నారు. ఆ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి?
తెలుగుతల్లికి భిన్నంగా కెసియార్ తెలంగాణ తల్లిని తీసుకుని వచ్చారు. తెలుగుతల్లిని దయ్యమో ఏదో అన్నారు (ఆయన తిట్టిన తిట్లల్లో అన్నీ గుర్తు పెట్టుకోవడం కష్టం) ఆంధ్రులు రాక్షససంతతి అన్నపుడు, తెలుగు తల్లి రాక్షసమాత, లేక రాక్షసి అయివుండాలి. కానీ ఆయన అలా అనలేదు. తెలంగాణ తల్లి చల్లని తల్లి అన్నారు. ఊరూరా ఆవిడ విగ్రహాలు నెలకొల్పుతామన్నారు. ఉద్యమసమయంలో తీరిక చిక్కకో నిధులు చాలకో ఆ పని చేయలేదు. ఇప్పుడైనా ఆ పని చేస్తున్నట్లు వార్తల్లో రావటం లేదు. విగ్రహాల కాంట్రాక్టు అంటే కాంట్రాక్టర్లు ఉత్సాహం వుండదన్న శంకో ఏమో, ఏకంగా అన్ని కళలకూ కలిపి ఒక్కటే పెద్ద కళాభవనం కట్టేస్తానంటున్నారు. తెలంగాణ కళల గురించి అవగాహన పెరగవలసినది పట్టణాల్లో, గ్రామాల్లో. కానీ యీయన దాన్ని తెలంగాణేతరులు పెద్ద సంఖ్యలో వున్న హైదరాబాదులో కడతానంటున్నారు. కెసియార్ కంటికి, చంద్రబాబు కంటికి పెద్దపెద్ద భవనాలు, బహుళ అంతస్తుల ఆకాశహర్మ్యాలు తప్ప వేరే ఏవీ ఆనటం లేదు. భూకంప ప్రమాదం వుండే జోన్లో వున్నామని తెలిసి కూడా మల్టీస్టోరీడ్ బిల్డింగులు కడతామంటున్నారు. భవనం కడితే కాంట్రాక్టర్లు సంతోషిస్తారు బాగానే వుంది. మరి ప్రదర్శన జరిగితే ఆడియన్సు రావాలి కదా! వస్తారా? హాళ్లు నిండుతాయా? ఇప్పటికే రవీంద్ర భారతి, త్యాగరాయ గానసభ కళ తప్పాయి. టిక్కెట్లతో ఆడిటోరియం తనను తాను పోషించుకుంటుందా? లేక నిధులివ్వలేక ప్రభుత్వం దానిలో మల్టీప్లెక్సులు, కమ్మర్షియల్ కాంప్లెక్సులు అనుమతించి ఆదాయం గడిస్తుందా? అలా అయితే వాణిసేవ కంటె ఎక్కువగా వాణిజ్యసేవలకే యిది ప్లాను చేస్తున్నారని అనుకోవాలి.
కళాకారులకు తెలంగాణ పెద్దపీట వేస్తుంది అన్నారు. ఉద్యమంలో గజ్జె కట్టి ఆడినవారికి, పాడిన వారికి టిక్కెట్లు యిచ్చారు. కళాకారులను గుర్తించి సాంస్కృతిక సారథులుగా ఉద్యోగాలు యిచ్చేమన్నారు. అది ఎంత వివాదాస్పదమైందో ఆంధ్రజ్యోతి కథనాలు వివరిస్తున్నాయి. కళతో సంబంధం లేనివారికి కూడా పదవులు, ఉద్యోగాలు దక్కాయని కొందరి ఆరోపణ. ఉద్యమంలో పాలు పంచుకోనివారికి కూడా ఉద్యోగాలు యివ్వడమేమిటని విమర్శ. తెరాస కార్యకర్తలనే కళాకారులుగా బనాయిస్తున్నారని మరో ఆరోపణ. నిజానికి ఉద్యమంలో పని చేయకపోయినంత మాత్రాన వాళ్లు కళాకారులు కాకుండా పోరు. తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రజలకు చాటి చెప్పి వారిలో ఆత్మగౌరవం పెంపొందించడమే సారథుల కర్తవ్యమైతే దాన్ని ఎవరు ఎంత బాగా చేయగలరు అనేదే పరిగణించాలి తప్ప తక్కినవి పట్టించుకోకూడదు. ఏదైతేనేం, కడుపు మండిన కళాకారులు యిప్పుడు కెసియార్నే తమ ధూంధాంలకు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉద్యోగాలు దక్కించుకున్న సారథులు తెలంగాణ గురించి కీర్తిస్తారా లేక తెరాస గురించి కీర్తిస్తారా అన్నది వేచి చూడాలి. మిషన్ కాకతీయ, స్వచ్ఛ హైదరాబాదు వంటి ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కోసం వీరిని వుపయోగించుకుంటే మంచిదే. కానీ కెసియార్ కుటుంబసభ్యుల కీర్తనలు చేస్తే మాత్రం ప్రభుత్వధనం వృథా అయినట్లే.
తెలంగాణ వాళ్లమన్న కారణంగా సినిమా రంగంలో పైకి రాకుండా తొక్కేశారు అని విజయశాంతి వంటి వారు అప్పుడు గగ్గోలు పెట్టేశారు. టీవీల్లో కూడా తొక్కేస్తున్నారంటూ రాణీ రుద్రమ అనే టీవీ యాంకర్ వరంగల్ నందీ ఆవార్డుల సభలో వివాదం లేపారు. తెలంగాణ భాషను, యాసను ఎద్దేవా చేశారని ఎంతమంది అన్నారో లెక్కే లేదు. ఈ ఏడాదిలో ఆ దిశగా దిద్దుబాటు చర్యలు ఏమైనా చేపట్టారా? తెలంగాణలో పుట్టిన హీరో, హీరోయిన్లతో సినిమా తీస్తే యింత సబ్సిడీ అన్నారా? ప్రభుత్వం పూనుకుని ప్రతీ సినిమాలో 20% మంది తెర ముందు, 30% మంది తెర వెనుక తెలంగాణ వాళ్లను పెట్టుకోవాలి అని నిర్మాతలకు కౌన్సిలింగు చేపట్టిందా? తెలంగాణ యాస కమెడియన్లకు వాడితే జరిమానా, హీరోలకు వాడితే వినోదపు పన్ను రద్దు, విలన్లకు వాడితే సినిమాయే రద్దు అన్నారా? ఫిల్మ్ సిటీ రెండు వేల ఎకరాల్లో కడతామన్నారు. దానిలో తెలంగాణ నిర్మాతలకైతే రిజిస్ట్రేషన్, స్టాంపు చార్జిలు వుండవు అని ప్రకటించి తెలంగాణ వారిని సినీ రంగంలో పెట్టుబడుల కోసం ప్రోత్సహించారా? జై బోలో తెలంగాణ వంటి సినిమాలు తీసినవారిని పిలిచి గతంలో ఫిల్మ్స్ డివిజన్ వాళ్ల చేత తీయించినట్లు ప్రభుత్వధనంతో తెలంగాణ చరిత్రపై డాక్యుమెంటరీలు, ఫీచరు ఫిల్ములు తీయిస్తున్నారా? కాకతీయ వైభవానికి అద్దం పట్టిన ''రుద్రమదేవి'' సినిమాకు వినోదపు పన్ను మినహాయిస్తామన్న ప్రకటన ఏదైనా చేశారా? ఉద్యమకాలంలో పాల్కురికి సోమనాథుడు, గుణాఢ్యుడు గురించి అన్ని కబుర్లు చెప్పారే, వారి పేర ఉత్సవాలు, సప్తాహాలు, సెమినార్లు నిర్వహించారా? వాళ్ల రచనలను తక్కువ ధరలో ముద్రించి అందుబాటులోకి తెచ్చారా? అంతెందుకు ఉగాది పురస్కారాలంటూ తెలంగాణ ప్రభుత్వం అవార్డుల యిచ్చిన వారిలో చాలామంది గురించి నా బోటివాళ్లకు తెలియదు. 'సమైక్యపాలనలో యీ ప్రతిభావంతులను తొక్కేయడం వలన వారి గురించి ప్రచారం లేకపోయింది' అనుకుంటే మరి వారి కృషి ఏమిటో ప్రజలకు తెలియచెప్పడానికైనా వారి పుస్తకాలు, వారి గురించి పుస్తకాలు అవీ ప్రభుత్వ సంస్థల ద్వారా వేయాలి కదా.
కూచిపూడి నాట్యకళాకారులైన రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు తమకు రవీంద్రభారతి యివ్వలేదని బహిరంగంగా చెప్పేశారు. వారు తెలంగాణలో పుట్టినా ఆంధ్రుల నాట్యరూపమైన కూచిపూడిలో పేరు తెచ్చుకున్నందుకు వారికీ శిక్ష. ''కూచిపూడి ఆంధ్రకు చెందినది కదా, దానితో మనకు పనేమిటి?'' అని సంచాలకుల సందేహమట. మరి తంజావూరులో పుట్టిన భరతనాట్యం మాటేమిటి? ఒడిస్సాలో పుట్టిన గీతగోవిందం మాటేమిటి? అసలా ఆడిటోరియంకు బెంగాల్లో పుట్టిన రవీంద్రుడి పేరు పెట్టుకోవడమేమిటి? ఖవ్వాలీ, తిల్లానా, గజల్ ఎక్కడ పుట్టిందో తెలుసుకుని వెళ్లి ఆ యా రాష్ట్రాల్లో ప్రదర్శించుకోండి, యిక్కడ పేరిణి శివతాండవం (దానికున్న మరో పేరు – ఆంధ్ర నాట్యం వాడకుండా వుంటేనే!) తప్ప మరేమీ ఒప్పుకోం అంటారేమో! ఇలా చీల్చుకుంటూ, అవతల పారేస్తూ పోతే ఏం మిగులుతుందో కొత్త పాలకులకే తెలియాలి. ఇక్కడ పుట్టినా ఆంధ్ర మూలాలు వున్నాయన్న కారణంగా జనాభాను విడదీసి చూస్తున్నారు. వారిలో ప్రతిభ వున్నా అవార్డు యివ్వడానికి వెనకాడుతున్నారు. పోనుపోను యిది ఎక్కడకు దారి తీస్తుందో తెలియదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2015)