తెలుగు సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్.. అంటే ఒక్క విజయశాంతి మాత్రమే. ఆమె తర్వాతా, ఆమెకు ముందూ.. ‘లేడీ సూపర్ స్టార్’ అన్పించుకోలేదెవరూ. సినీ పరిశ్రమ తొలి నాళ్ళలో మహిళా కథానాయికలు ఆయా చిత్రాలకు వన్నె తెచ్చినా, విజయశాంతి తరహాలో తెరపై పోరాటాలు చేయడం, తన ఇమేజ్‌తో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం, బాక్సాఫీస్ వద్ద తమ ఓన్ స్టామినాని చూపించడం లాంటి అద్భుతాలు చోటు చేసుకోలేదనడం నిస్సందేహం. ఈ తరం హీరోయిన్లలో అంత సీన్ ఏ హీరోయిన్‌కీ లేదనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. బాలీవుడ్లో కూడా విజయశాంతి తన ఉనికి చాటుకున్నారు.
బాలీవుడ్లో తాజా సూపర్ స్టార్ ఎవరు?
అయితే అతి త్వరలో బాలీవుడ్ తెరపైనా లేడీ సూపర్ స్టార్స్‌ని చూసే అవకాశం లేకపోలేదంటున్నారు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు. దానిక్కారణమూ లేకపోలేదు. ఈ మధ్య తెరపై పోరాటాలు చేసేందుకు పలువురు బాలీవుడ్ అందాల భామలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అంతే కాదు, ఒంటి చేత్తో సినిమా నడిపించే సత్తా తమకుందని కొన్ని సినిమాలతో నిరూపించుకుంటున్నారు కూడా. ఆ కోవలోనే ‘డర్టీపిక్చర్’ సినిమా వచ్చింది. విద్యాబాలన్ ఈ సినిమాతో సూపర్ స్టార్ అయిపోయింది. మొన్నీమధ్యనే ప్రియాంకా చోప్రా ‘మేరీకోమ్’ సినిమాలో నటించింది. లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు ఈ మధ్యకాలంలో ప్రియాంకా చోప్రాకే కట్టబెట్టేశారు. అదే దారిలో దీపికా పడుకొనే, కంగనా రనౌత్ కూడా అడుగులేస్తున్నారు. ‘పికు’ సినిమాలో అమితాబ్ బచ్చన్ వున్నా, సినిమా భారమంతా దీపికా పడుకొనేనే మోసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ సినిమా విషయానికొస్తే, ఇందులో కథ భారమంతా మోసింది కంగనా రనౌత్.
ట్రెండ్ మారుతోంది
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు సెక్సస్ అవుతున్నకొద్దీ ఆ ట్రెండ్‌లో సినిమాలు రావడం సహజాతి సహజం. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటే, అలాంటి సినిమాలే తీయడానికి ఎక్కువమంది దర్శక నిర్మాతలు ఇష్టపడ్తారు. అందరికీ తెల్సిన విషయమే సినిమా అనేది కళాత్మక వ్యాపారం అని. లాభార్జనే ధ్యేయంగా సినిమాల్ని దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు గనుక, రిస్క్ చేయకుండా వర్కవుట్ అవుతున్న సబ్జెక్ట్స్పైనే మొగ్గు చూపుతుంటారు. అలా ఈ మధ్యకాలంలో స్త్రీ పాత్రల చుట్టూనే తిరిగే కథాంశంతో సినిమాలు జోరుగా వస్తున్నాయి. 2012లో శ్రీదేవి హీరోయిన్గా వచ్చిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘కహానీ’ కూడా ఆ కోవలో వచ్చిందే. ఒకానొక టైమ్‌లో విద్యాబాలన్ ఏడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిందంటే, అదంతా ‘సూపర్ స్టార్’గా ఆమెకు దక్కిన విజయాల పుణ్యమే.
అన్ని సినిమాలూ ఒకేలా వుండవు
రాణీ ముఖర్జీ, మాధురీ దీక్షిత్, కరీనాకపూర్.. ఇలా చెపకుంటూ పోతే ఎందరో తారలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేశారుగానీ, బాక్సాపీస్‌ని శాసించే హిట్ కొట్టలేకపోయారు తమ తమ చిత్రాలతో. కథాబలం ఇక్కడ ముఖ్యం. ఆడియన్స్‌కి సినిమా కనెక్ట్ అవడం అంతకన్నా ముఖ్యం. అన్నిటికీ మించి లక్ కూడా కలిసి రావాలి. ఇన్ని అంశాలూ ఓ సినిమాకి కలిసొస్తే అది ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం అవుతుంది. ఆ సినిమా విమెన్ సెంట్రిక్ అయితే అందులో హీరోయిన్గా ఎవరు నటించినా రాత్రికి రాత్రి స్టార్డమ్ సంపాదించుకునే అవకాశముంది. ఈ మధ్యకాలంలో విద్యాబాలన్, కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా, దీపికా పడుకొనే.. థియేటర్లకు ప్రేక్షకుల్ని తమ సినిమాలతో తీసుకురాగలిగే సత్తా వున్న స్టార్లుగా బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు పొందారు.
చిన్న చిన్న కొత్త కొత్త ప్రయోగాలు
అనుష్క శర్మ నటించి, నిర్మించిన ‘ఎన్‌హెచ్10’ సినిమా విడుదలకు ముందే అందర్నీ ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదలయ్యాక ఓపెనింగ్స్ అదరగొట్టేసింది. సినిమా మీద నమ్మకంతోనే తాను నిర్మాతగా రంగ ప్రవేశం చేయాల్సి వచ్చిందని అనుష్క శర్మ చెపకొచ్చింది ఆ సినిమా గురించి మాట్లాడుతూ. ‘సినిమా ఆడియన్స్‌కి నచ్చాలి. అది విమెన్ సెంట్రిక్ లేదా మేల్ సెంట్రిక్ అనేదానిపై ఆధారపడదు. కంటెంట్ బావుంటే ఎలాంటి సినిమా అయినా విజయం సాధిస్తుంది..’ అని చెబుతూనే, హీరోలతో పోల్చితే హీరోయిన్లకు స్టార్డమ్ అంత తేలికగా రాదుగానీ, హీరోలకు తామేం తక్కువ తీసిపోమని అభిప్రాయపడింది. అందులో నిజం లేకపోలేదు కూడా.
రెమ్యునరేషన్ అప్రస్తుతం
ఓ సినిమాతో హిట్ కొడితే రెమ్యునరేషన్ పెంచేయడంలో హీరోయిన్ల పేరు ప్రముఖంగా విన్పిస్తుంటుంది. ‘హీరోలతో పోల్చితే మేం చేసేది తక్కువే..’ అంటూ కాస్తంత ఆగ్రహం ప్రదర్శిస్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే.. రెమ్యునరేషన్లు పెంచేస్తుండడం గురించి ప్రశ్నిస్తే. ‘రామ్‌లీలా’ సినిమా కోసం దీపిక కోట్లు తీసుకుంది. ‘హీరోయిన్’ సినిమా కోసం కరీనాకపూర్ ఏకంగా .5 కోట్లు తీసుకుని బాలీవుడ్లో హయ్యస్ట్ పెయిడ్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం టాప్ 5 హీరోయిన్లు ఈ ఫిగర్స్ చుట్టూనే రెమ్యునరేషన్స్ అందుకుంటున్నాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలంటే హీరోయిన్లు స్పెషల్ రేట్ ఫిక్స్ చేస్తుంటారు. అందుక్కారణమేంటని అడిగితే, సినిమా మొత్తం మేమే కదా కన్పించాలి.. అంటారు ఈ అందాల భామలు.
సౌత్‌లోనూ లేడీ స్టార్స్ వున్నారండోయ్
దక్షిణాదిలోనూ లేడీ స్టార్స్‌కి కొదవేం లేదు. అనుష్క, నయనతార ఈ లిస్ట్‌లో ముందు వరుసలో వుంటారు. ఒకటీ అరా సినిమాలతో ఛార్మి కూడా హల్చల్ చేసింది. ‘అరుంధతి’ సినిమాతో స్టార్ హీరోలకు ధీటుగా ఎదిగింది అనుష్క. ఆమె నుంచి ‘రుద్రమదేవి’ రూపంలో భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. ఇక విజయశాంతిలా పోరాటాల విషయానికొస్తే, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మాలాశ్రీ మాత్రమే అపడపడూ హల్చల్ చేస్తోంది. అయితే ఆమె ఇపడు పూర్తిగా కన్నడ సినిమాలేక పరిమితమైపోయింది.
అంతా బాగానే వుందిగానీ అసలు సంగతేమిటి?
సెక్సస్లు, రెమ్యునరేషన్లు, న్యూ ట్రెండ్.. ఇవన్నీ బాగానే వున్నాయిగానీ బాలీవుడ్లో ‘లేడీ సూపర్ స్టార్’ అనిపించుకునేదెవరు? అన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడంలేదు. కత్రినా, కరీనా, ప్రియాంక, కంగనా రనౌత్.. ఇలా చెపకుంటూ పోతే ఓ డజను మంది హీరోయిన్లు హీరోలతో సమానంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో దుమ్ము రేపేయగలరు. సినిమాల్ని ఒంటిచేత్తో నడిపించే సత్తా ఓ అరడజను మంది హీరోయిన్లకు వుందనడం అతిశయోక్తి కాదేమో. అయినాసరే, ‘లేడీ సూపర్ స్టార్’ అన్పించుకునే స్థాయిలో.. బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ హిట్స్.. బాక్సాఫీస్ దుమ్ము దులిపే హిట్స్ ఇచ్చే సత్తా ఎవరికి వుందన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఒక్కటి మాత్రం నిజం. ట్రెండ్ మారుతోంది.. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ కథా బలం వున్న సినిమాలూ వస్తుండడం అభినందనీయం. ఇక లేడీ సూపర్ స్టార్ అంటారా.? ఏమో మరి.. రానున్న రోజుల్లో చూస్తామేమో.!
వెంకట్ ఆరికట్ల