సొంత స్టయిల్‌ కోసం తిప్పలు పడుతున్నాడు

తండ్రి పోలికలు కొడుకులకొస్తాయి. అలాగే అన్నదమ్ములిద్దరికీ పోలికలు వుంటాయి. ఆలోచన, నడవడిక, మాటతీరు.. ఇవన్నీ అన్నదమ్ముల్లో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇప్పుడు అదే సమస్యతో అల్లు శిరీష్‌ ఇబ్బంది పడుతున్నాడట. ‘గౌరవం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

తండ్రి పోలికలు కొడుకులకొస్తాయి. అలాగే అన్నదమ్ములిద్దరికీ పోలికలు వుంటాయి. ఆలోచన, నడవడిక, మాటతీరు.. ఇవన్నీ అన్నదమ్ముల్లో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇప్పుడు అదే సమస్యతో అల్లు శిరీష్‌ ఇబ్బంది పడుతున్నాడట. ‘గౌరవం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘కొత్త జంట’తో ఫర్వాలేదనిపించుకున్న హీరో అల్లు శిరీష్‌ మీద ఆయన అన్నగారైన అల్లు అర్జున్‌ ప్రభావం ఎంతో వుందంటున్నారు. డైలాగ్‌ చెప్పడంలో, స్టయిల్స్‌తో, డాన్సుల్లో ఇలా అన్నీ అల్లు అర్జున్‌ పోలికలతో వుంటే ఆయన డూపు అంటారు తప్ప సొంత స్టయిల్‌ వున్న హీరో అనరు. 

అందుకే ఇప్పుడు తన స్టయిల్‌ మార్చుకోవడానికి చాలా కసరత్తులు చేస్తున్నాడట. కొంతమంది ఇంగ్లీష్‌, హిందీ హీరోల బాడీ లాంగ్వేజ్‌ని ఫాలో అయితే కొన్నాళ్ళకు ఆటోమేటిగ్గా సొంత స్టయిల్‌ వచ్చేస్తుందనేది ఒక ఆలోచనట. ఇక రెండోది.. తన మావయ్య చిరంజీవిగారి స్టయిల్‌ని కొంత మార్చి నటిస్తే ఎలా వుంటుందనే విషయాన్ని పరిశీలిస్తున్నాడట. రూపురేఖలయితే మేకప్‌తో సరిచేసుకోవచ్చు. నటన విషయంలో సొంత స్టయిల్‌ కావాలంటే ఎంతో శ్రమించాలి. అలాంటి కఠోర శ్రమ చేస్తున్న అల్లు శిరీష్‌ సొంత ముద్రతో హిట్‌ ఇవ్వాలని కోరుకుందాం.