సుడి.. అంటే ధోనీదే.!

మహేంద్రసింగ్‌ ధోనీ.. టీమిండియాకి వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ.. ట్వంటీ ట్వంటీల్లోనూ తిరుగులేని విజయాలు అందిస్తోన్న ‘కెప్టెన్‌’. కానీ ఈ మధ్య ధోనీ ఆటగాడిగా ఫెయిలవుతున్నాడు. వికెట్ల వెనుక ‘కీపింగ్‌’ విషయంలోనూ, బ్యాట్స్‌మెన్‌గా పరుగులు రాబట్టడంలోనూ ధోనీ…

మహేంద్రసింగ్‌ ధోనీ.. టీమిండియాకి వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ.. ట్వంటీ ట్వంటీల్లోనూ తిరుగులేని విజయాలు అందిస్తోన్న ‘కెప్టెన్‌’. కానీ ఈ మధ్య ధోనీ ఆటగాడిగా ఫెయిలవుతున్నాడు. వికెట్ల వెనుక ‘కీపింగ్‌’ విషయంలోనూ, బ్యాట్స్‌మెన్‌గా పరుగులు రాబట్టడంలోనూ ధోనీ విఫలమవుతున్నాడు. ‘ఇక ధోనీ రిటైర్‌ అయిపోవడమే మంచిది..’ అని ఇటీవల చాలా సందర్భాల్లో ధోనీ గురించిన కామెంట్స్‌ విన్పించాయి.

విచిత్రంగా తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ధోనీని ఓ విజయం ఒడ్డున పడేస్తోంది. తాజాగా లార్డ్స్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌పై సాధించిన విజయమూ అలాగే ధోనీని విమర్శల సంద్రం నుంచి ఒడ్డున పడేసింది. బ్యాట్స్‌మెన్‌గా ధోనీ విఫలమవుతున్నాడనే విమర్శలు ఇంగ్లాండ్‌ టూర్‌ ప్రారంభమైనప్పటినుంచీ విన్పిస్తున్నాయి. తొలి టెస్ట్‌ డ్రా అయ్యింది. రెండో టెస్ట్‌లో.. తొలుత పరిస్థితి ఇంగ్లాండ్‌కి అనుకూలంగా మారింది. లక్ష్యం చిన్నదే.. ఒక్క భువనేశ్వర్‌ కుమార్‌ తప్ప, మిగతా బౌలర్లెవరూ ప్రభావం చూపలేకపోతున్నారు.

ఇక, లార్డ్స్‌లో ఓటమి ఖాయమేనని అంతా ఫిక్సయిపోతే, అనూహ్యంగా ‘లంబూ’ మ్యాచ్‌ని తిప్పేశాడు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించేశాడు. ఏడు వికెట్లు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ సొంతం చేసుకోవడంతో ప్రతిష్టాత్మక ‘లార్డ్స్‌’ మైదానంలో భారత్‌ చేతిలో ఆతిథ్యమిచ్చిన జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇషాంత్‌ ఈజ్‌ బ్యాక్‌.. అనడం కాదుగానీ, ధోనీ గట్టెక్కాడని ఇప్పుడంతా అనుకోవాల్సి వస్తోంది. 

ధోనీ వైఫల్యం, ఇషాంత్‌ మెరుపుల విషయం పక్కన పెడితే, లార్డ్స్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్‌కుమార్‌ ప్రతిభ తక్కువేమీ కాదు. ఆరు వికెట్లతో అదరగొట్టాడు భువీ. బ్యాట్‌తో విజయ్‌, రహానే దుమ్ము దులిపారు.

అన్నట్టు, లార్డ్స్‌ మైదానంలో ఆడిన 17 మ్యాచ్‌లలో టీమిండియాకి దక్కిన రెండో విజయమిది. ఎప్పుడో కపిల్‌దేవ్‌ నేతృత్వంలో టీమిండియా లార్డ్స్‌ మైదానంలో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా 80 ఏళ్ళ క్రికెట్‌ చరిత్రలో.. భారత్‌కి లార్డ్స్‌ మైదానంలో నేటి విజయం రెండోది కావడం విశేషం.