భారతదేశమ్మీదకు ‘జిహాద్’ పేరుతో దండెత్తడం.. అమాయకుల్ని పొట్టన పెట్టుకోవడం.. ఇదీ తీవ్రవాదులు చేస్తోన్న గొప్ప పని. ఇంత ఘనకార్యం చేసినోళ్ళకి కొత్తల్లుడిలా మేపడం అనేది అలవాటు చేసినట్టున్నాం.. అందుకే, ‘నన్ను జైల్లో జంతువులా చూస్తున్నారు.. సరిగ్గా పట్టించుకోవడంలేదు..’ అంటూ ఓ నరరూప రాక్షసుడు న్యాయమూర్తి ముందు ఆవేదన (?!) వెల్లగక్కుకున్నాడు.
ఆ నర రూప రాక్షసుడెవరో కాదు, ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్. హైద్రాబాద్ సహా దేశంలోని పలు చోట్ల బాంబులు పేల్చిన ఘనుడీయన. ఈయనగారికి కొత్తల్లుడిలా జైల్లో మర్యాదలు చేయాలట. చేయకనేం.. మొన్నామధ్యన కసబ్‌ని ఇలాగే చూసుకున్నాం కదా.. వాడ్ని చూసి వీడు కూడా అలాంటి సౌకర్యాలు కోరుతున్నాడేమో అన్పిస్తోంది.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది అయిన కసబ్‌ని ‘మేపడం’ వెనుక పెద్ద కథే వుంది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్‌ని దోషిగా చూపాలంటే దానికో సాక్ష్యం కావాలి.. అది కసబ్ రూపంలో భారత్‌కి దొరికింది. ముంబైలో టెర్రర్ సృష్టించిన పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల వ్యవహారం ప్రపంచమంతా చూసింది. అందరికీ విషయం అర్థమయ్యాక భారత చట్టాల ప్రకారం కసబ్‌ని ఉరి తీయడం జరిగింది. అంతా పద్ధతి ప్రకారమే చేశారు కసబ్ ఉరి విషయంలో.
సాటి మనిషిని బాంబులతో ఛిత్రం చేయడం తప్పు కాదుగానీ, చేసిన తప్పుకి జైల్లో పెడితే.. అయ్యగార్ని జంతువులా హీనంగా చూసినట్లని యాసిన్ భత్కల్ వాపోతున్నాడు. కసాయిని కూడా చట్టాల ప్రకారమే శిక్షించే దేశం మనది. దాన్ని లోకువ కట్టేసి, ఇదిగో.. ఇలాంటోళ్ళు ఎన్ని తైతక్కలైనా ఆడతారు మరి.!