పవన్‌.. ఇకనైనా స్పందించు

పార్టీ పెట్టామా.? ఇంకో పార్టీకి పబ్లిసిటీ చేశామా? సైలెంటయ్యామా.. అన్నట్టుంది జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి. అసలు ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి.? జనసేన పార్టీ తరఫున మీడియాకి కావాల్సిన సమాచారం…

పార్టీ పెట్టామా.? ఇంకో పార్టీకి పబ్లిసిటీ చేశామా? సైలెంటయ్యామా.. అన్నట్టుంది జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి. అసలు ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి.? జనసేన పార్టీ తరఫున మీడియాకి కావాల్సిన సమాచారం అందించేవారెవరైనా వున్నారా.? జనసేన పార్టీ సిద్ధాంతాలేంటి? ఆ పార్టీ ఏం చేయబోతోంది.? లాంటి విషయాలు ఎవరికీ తెలియదు. కానీ, జనసేన ఓ రాజకీయ పార్టీ. అదే విచిత్రం.

జనసేన పార్టీ వుంది. ఆ పార్టీకి ఓ జెండా వుంది. పార్టీకి అధినేత వున్నారు. అయినా జనంలోకి పార్టీ వెళ్ళడంలేదు. ఇంకో విచిత్రమేంటంటే, జనసేన పార్టీ జెండాలు అడపా దడపా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.. అదీ ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో. ఈ జెండా వెనుక పెద్ద కహానీనే వుంది.

తమ భూముల్ని రాజధాని కోసం ఇవ్వబోమనీ, తమకు అన్యాయం జరుగుతోదనీ ఆరోపిస్తూ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోని కొందరు రైతులు జనసేన పార్టీ జెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘పవన్‌ ఇకనైనా స్పందించు.. మాకు మద్దతుగా నిలబడు..’ అంటూ రైతులు నినదిస్తున్నారు. మొన్నామధ్య ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీపై వుంది.. అంటూ ట్విట్టర్‌ ద్వారా స్పందించిన పవన్‌, ఈ జెండాల ఎపిసోడ్‌పై ట్విట్టర్‌ ద్వారా అయినా స్పందిస్తాడా.? లేదంటే అది తనకు సంబంధం లేని విషయమని ఊరుకుంటాడా.? వేచి చూడాల్సిందే.