ఒక గణపతి ఇద్దరు చందుల్రు

‘‘నీ జతగా నేనుండాలి…’’ సుశ్రావ్యంగా వినిపిస్తోంది సెల్‌ఫోన్ రింగ్ టోన్.  ఏకాంతమందిరంలో శ్రీవారు శివతో తొలినాటి జ్ఞాపకాల్ని పంచుకుంటున్న పార్వతి పక్కనే టీపాయ్ మీదున్న సెల్‌ఫోన్‌ని చేతుల్లోకి తీసుకుని స్క్రీన్‌పై దృష్టిసారించింది. ‘వినాయక్’ అన్న…

‘‘నీ జతగా నేనుండాలి…’’ సుశ్రావ్యంగా వినిపిస్తోంది సెల్‌ఫోన్ రింగ్ టోన్.  ఏకాంతమందిరంలో శ్రీవారు శివతో తొలినాటి జ్ఞాపకాల్ని పంచుకుంటున్న పార్వతి పక్కనే టీపాయ్ మీదున్న సెల్‌ఫోన్‌ని చేతుల్లోకి తీసుకుని స్క్రీన్‌పై దృష్టిసారించింది. ‘వినాయక్’ అన్న నాలుగక్షరాలు డిస్‌ప్లే అయ్యాయి. 

‘‘ఎవరు పార్వతీ!’’ అడిగాడు శివ.

‘‘కుమార రత్నం..గణపతి’’ ఆన్సరిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి‘హలో…!’ అంది.

‘‘మమ్మీ! నేను వినాయక్‌ని’’ అన్నాడట్నుంచి. 

‘‘తెలుసు. చెప్పు’’ అంది పార్వతి. 

‘‘కచ్చితంగా వెళ్లాల్సిందేనా?’’ అడిగాడు. 

‘‘అదేంటీ అలా అంటావ్. ఎవ్విరీ ఇయర్ ఈ సీజన్‌లో నీ టూర్ కన్‌ఫర్మే కదా!’’ అంది. 

‘‘ఎందుకో…వెళ్లేందుకు మనస్కరించడం లేదు’’

‘‘ఏం? ఏమైంది? ఒంట్లో నలతగా ఉందా?’’ అడిగింది ఆత్రుతగా.

‘‘అదేం కాదు..’’ నసిగాడు వినాయక్. 

‘‘పుత్రరత్నం ఏమంటున్నాడు?’’ అడిగాడు శివ. 

‘‘ఉండండి..చెప్తా’నన్నట్లు కళ్లతోనే సైగ చేసి‘‘బాబూ…వినాయక్! నీతో మీ నాన్నగారు ఓసారి మాట్లాడాలంటున్నారు. వీలు చేసుకుని ఇక్కడికి రా!’’ అంది పార్వతి. 

‘‘తండ్రిగారు పిలవాలే కానీ…ఉన్నపాటున వచ్చేయనా? హాఫెనవర్లో అక్కడుంటాను’’ అన్నాడు వినాయక్. 

‘‘నీకోసం ఎదురుచూస్తుంటాం. కుదరితే సిద్ది, బుద్దిని కూడా నీవెంట తీసుకొచ్చేందుకు ట్రయ్ చేయి’’ అంది పార్వతి. 

‘‘అలాగే’’ అన్నాడు వినాయక్. 

పార్వతి దగ్గరికి వచ్చి కూచోగానే ఆమె భుజంపై చేతులు వేసి అడిగాడు‘‘ఏంటీ విశేషం?’’

‘‘భూలోకానికి వెళ్లనంటున్నాడు’’

‘‘అసలే కలికాలం. ఏడాదికోసారైనా ఆధార్‌కార్డ్, పాన్‌కార్డ్‌ల్తో మన ఐడింటిటీని ప్రూవ్ చేసుకోకపోతే ఈ నరమానవులు  అస్సలు మనని పట్టించుకోరు. కైలాసగిరిదాకా ఆధునిక సాంకేతికత విస్తరించిన వర్తమానంలో…ఒక్క మౌస్ క్లిక్‌తోనే ఇంటర్నెట్‌లో ముల్లోకాల సమాచారం ఆవిష్కృతమవుతున్న నేపధ్యంలో ‘దేవుడుమహిమలు’ అంటే నానాటికీ నమ్మకాలు సడలిపోతున్నాయి. అప్పుడెప్పుడో ఆత్రేయనే ఓ సినీ కవి‘దేవుడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం’ అనే పల్లవితో పాట రాసేసి దేవుడి ఉనికినే ప్రశ్నించాడు. మరిప్పుడో…దేవుళ్లనే మరిచిపోతున్నారు జనాలు. ఏదో ఇంకా కల్చరల్ పోగ్రామ్స్‌పట్ల ఇష్టం తగ్గకపోవడంతో సంస్కృతీ సంప్రదాయాల పేరిట కొన్ని పండగల్ని ఆచరిస్తున్నారు. నీకు తెలుసుకదా..పార్వతీ! అవాంతరాలు, అడ్డంకులెన్ని వచ్చినా…శివరాత్రి రోజున భూలోకంలోని శైవక్షేత్రాల్ని సందర్శించకుండా ఉండను. వినాయకుడి పేరుతో జరుగుతున్న ఈ నవరాత్రి ఉత్సవాల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జారవిడుచుకోవద్దని నామాటగా నీ పుత్రరత్నానికి చెప్పు…’’ అన్నాడు శివ.

‘‘వస్తున్నాడుగా..ఆ నాలుగు మాటలు గజాననుడి చెవుల్లో మీరే వేయండి. చేటంత చెవులు కదా! వినకుండా పోతాడా?’’ అంది పార్వతి. 

‘‘సరే! అలాగే!’’ అన్నాడు శివ కుమారుడి రాకకోసం ఎదురుచూస్తూ. 

అరగంట తర్వాత 

కైలాసగిరి ఉద్యానవనంలో ఆ ముగ్గురూ కూచున్నారు. సేవకులు కాఫీ, టీ, హార్లిక్స్, బూస్ట్‌లాంటి పానీయాల్ని సర్వ్ చేస్తుండగా టేస్ట్ చేస్తూ మంతనాల్లో మునిగిపోయారు. 

‘‘అసలు విషయానికి వద్దాం. ఈసారి భూలోకానికి వెళ్లనని మారాం చేస్తున్నావట. పార్వతి చెప్పింది’’ అన్నాడు శివ. 

‘‘ఔను నాన్నగారూ! వెళ్లాలనిపించడం లేదు’’ చెప్పాడు వినాయక్. 

‘‘నీరాకకోసం వీధివీధిన వినాయక విగ్రహాలతో జాతర చేస్తున్నారు. వారిని నిరాశపరచడం భావ్యం కాదు’’ అన్నాడు శివ.

‘‘వెళ్లకపోవడానికి ఏదో బలీయమైన కారణం ఉండాలి కదా!’’ అంది పార్వతి..కొడుక్కి ఇష్టమని ఉండ్రాళ్లు తెమ్మని పరిచారికని ఆదేశిస్తూ. 

‘‘కారణమా? చెప్పాలంటే చాలా ఉన్నాయి’’ అన్నాడు వినాయక్. 

‘‘చెప్పు…ఆ కారణాలు సహేతుకమో కావో మేమిద్దరం ఇక్కడే…ఈ క్షణమే తేల్చేస్తాం’’ అన్నాడు శివ పార్వతివైపు చూస్తూ. 

‘‘రెండు రాష్ట్రాలూ విడిపోయిన తర్వాత రెండోసారి జరుగుతున్న వినాయక ఉత్సవాలు ఇవి’’

‘‘ఔను…అయితే! విభజన సంగతి అటుంచు…మన భజన సజావుగా సాగదనా నీ అనుమానం?’’

‘‘అదేం కాదు. పూనకాలొచ్చినట్లు భక్తిపారవశ్యంలో ప్రజలు తలమునకలువుతుంటారు. కానీ…ఇద్దరు చంద్రువల్లే మనస్తాపానికి గురవుతున్నా. మొదట్నుంచీ మీకు తెలుసుకదా! చంద్రుడికీ నాకు సరిపడదనీ. అదో శాపం. అందుకే, వినాయక చవితిరోజున రాత్రివేళ చంద్రదర్శనం చేయొద్దంటూ భక్తులకు సూచిస్తుంటారు. చంద్రదర్శనం చేస్తే నీలాపనిందలే కదా! అందులో…ఒక్క చంద్ర దర్శనం కాదు..ఇద్దరు చంద్రులు. డబుల్ థమాకా! వారిద్దరి పాలనపై జనాలకు అప్పుడే అసంతృప్తి మొదలైంది. కొత్త రాష్ర్టం తెలంగాణలోనూ, నవ్యాంధ్రలోనూ ప్రజలు ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నారు. ‘బంగారు తెలంగాణ’ నినాదమే తప్ప అన్నదాతల ఆత్మహత్యలతో అతలాకుతలమవుతోంది. బతికేందుకు మరే దారిలేక…రైతన్నలు మృత్యువుకే ఎదురేగివెళ్తుంటే ఆ చావులపై కూడా అన్ని రాజకీయపార్టీలు శవరాజకీయాలు చేసే దైన్యంలోకి కోటిరత్నాలవీణ …తెలంగాణ బలవంతంగా నెట్టబడింది. ఎన్‌కౌంటర్లే లేని రాజ్యాన్ని తెస్తానన్న ఉద్యమనేత మాటలు గాలిలో, ధూళిలో కలిసిపోయాయేమే…తొలి ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ ఉలికిపడుతోంది. అక్కడ రాజధాని లేని నవ్యాంధ్రలో ప్రత్యేక ెదా కూడా హుళక్కి అయింది. అందుకోసం కలిసికట్టుగా పోరాడాల్సిన అన్ని రాజకీయపార్టీలు కలహాలతో కాలక్షేపం చేస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో నేతలంతా పొద్దు గడిపేస్తున్నారు. ఓటేసిన జనాలే ఎటూ పాలుపోక బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటే…‘సింగపూర్’, ‘చైనా’లంటూ ఆకాశవిహారాల్లో మునిగితేలుతున్నారు ఇద్దరు చంద్రులు. ఇద్దరు చంద్రుల ఊకదంపుడు ఉపన్యాసాల్ని వినలేకపోతున్నారు జనాలు. ఇంకా ఎంతకాలం ఈ ‘శుష్కప్రియాలు’?..మరెంతకాలం ఈ ‘శూన్యహస్తాలు’ అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ చవితి ఉత్సవాలకు నేను వెళ్లాలనుకోండి…ఇద్దరు చంద్రుల్నీ చూడాల్సి వస్తుంది. చూస్తే…ఇరు రాష్ట్రాల్లో అమలు నోచుకోని ఎన్నికల వాగ్దానాలకు అసలు కారణం నేనేనంటూ…భక్తి శ్రద్ధలతో ఉత్సవాల్ని ఘనంగా చేసినా తమని వినాయకుడు పట్టించుకోలేదంటూ ప్రజలు నాపైనే నీలాపనిందలు వేయరా? ఆ నిందలు భరించడం నాతరం కాదు డాడీ!’’ అన్నాడు వినాయక్. 

‘‘అది పలాయనవాదం కుమారా! నువ్వే నిందలకు దడిస్తే ఎలా? కార్యశూరులు వెనుకడుగువేయరు. నువ్వు వెళ్లాల్సిందే. నీతోపాటు సిద్ది, బుద్ధిని కూడా తీసుకెళ్లు. అక్కడి ప్రజలు ఆశించినవన్నీ సిద్ధించేలా ఆశీస్సులు అందివ్వు. అలాగే, అధికారపీఠంపై ఉన్న నేతలు ప్రజల సంక్షేమాన్ని చిత్తశుద్ధితో ఆచరించేలా బుద్దిని ప్రసాదించు…’’ అంది పార్వతి. 

‘‘ఔను…పార్వతి చెప్పిందంటే అదే ఫైనల్. ఈ వినాయక చవితికి నువ్వు వెళ్తున్నావు. సరేనా?’’ అన్నాడు వినాయకుడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆత్మీయంగా నొక్కుతూ. 

అంతే! రెండు తెలుగు రాష్ట్రాల్లో అ‘ద్వితీయ’ంగా వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. వాడవాడలా వినాయక వేడుకలే. కడుపు పట్టినన్ని ఉండ్రాళ్లు తిని వినాయకుడు సిద్ది, బుద్ధితో సహా ప్రజలకు ఆశీస్సులు అందజేస్తున్నారు. ఇక్కడి వేడుకల్ని కైలాసగిరినుంచే లాప్‌ట్యాప్‌లో వీక్షిస్తూ తన్మయులవుతున్నారు పార్వతీ పరమేశ్వరులు. 

పి.వి.డి.ఎస్. ప్రకాష్