రవీంద్ర భారతి బచ్‌గయా….!

తెలంగాణలోని కళాకారులకు, కళాప్రియులేక కాదు, యావత్ తెలుగు ప్రజలందరికీ ఓ తీపి కబురు తెలిసింది. ఏమిటది? హైదరాబాద్ నగరం నడిబొడ్డున, అసెంబ్లీకి సమీపంలో ఉన్న కళా కేంద్రం రవీంద్ర భారతిని కూల్చడంలేదు. కొత్త భవనం…

తెలంగాణలోని కళాకారులకు, కళాప్రియులేక కాదు, యావత్ తెలుగు ప్రజలందరికీ ఓ తీపి కబురు తెలిసింది. ఏమిటది? హైదరాబాద్ నగరం నడిబొడ్డున, అసెంబ్లీకి సమీపంలో ఉన్న కళా కేంద్రం రవీంద్ర భారతిని కూల్చడంలేదు. కొత్త భవనం నిర్మించడంలేదు. రూ.74 లక్షలతో మరమ్మతులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు టెండర్లు పిలిచారని సమాచారం. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇది కళాకారుల, కళా ప్రియలు విజయమని చెప్పుకోవచ్చు. రవీంద్ర భారతిని కూలుస్తామని  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పుడు తెలుగు ప్రజలందరికీ విడదీయరాని అనుబంధమున్న ఈ కళా కేంద్రం ఇక ఓ జ్ఞాపకంగా మిగలబోతున్నదని ‘గ్రేట్ ఆంధ్ర’ కథనం ప్రచురించింది.  

తెలంగాణ గబ్బర్ నుంచి తప్పించుకున్న రవీంద్ర భారతి

‘షోలే’ సినిమాలో గబ్బర్ సింగ్ ఓక చోట తన అనుచరులకు పిస్టల్ గురిపెట్టి చంపుతానని బెదిరిస్తుంటే వారు గజ గజ వణికిపోతుంటారు. ఎవరికి వారు తమ ప్రాణాలు పోతాయని అనుకుంటుంటే గబ్బర్ సింగ్  నవ్వుకుంటూ ‘బచ్‌గయా సాలా’ అంటాడు. ఈ చిన్న  డైలాగ్ ఆ రోజుల్లో బాగా పాపులర్ అయింది. అదే మాదిరిగా తెలంగాణ గబ్బర్ సింగ్ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ ఆ భవనం కూల్చేస్తా…ఈ కట్టడం కూల్చేస్తా. అంతస్తుల మీద అంతస్తులు కడతా…అత్యంత ఆధునికంగా నిర్మిస్తా’ అంటుంటే చాలామంది ఆవేదన చెందారు. పురాతన కట్టడాలను కూల్చొద్దని, వాటితో తమ అనుబంధం విడదీయరానిదని, వాటిని నగర ప్రజలు తరతరాలుగా ప్రేమిస్తున్నారని విన్నవించుకున్నారు. ప్రత్యామ్నాయాలు చూడాలని వేడుకున్నారు.  

అయినా కేసీఆర్ మొండిపట్టు పట్టి ఛాతీ ఆస్పత్రిని కూల్చి సచివాలయం కడతానని, ఉస్మానియా ఆస్పత్రిని కూల్చి బ్రహ్మాండమైన భవనాలు కడతానని, ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి కడతానని, ఇందిరా పార్కులో వినాయకసాగర్ తవ్విస్తానని, రవీంద్ర భారతి కూల్చి అత్యంత ఆధునికంగా నిర్మిస్తానని…ఇలా బాంబుల మీద బాంబులు పేల్చారు. ఆయన నిర్ణయాలను ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. రవీంద్ర భారతినే తీసుకుంటే దాన్ని కూల్చకుండానే మరో ఆడిటోరియం నిర్మించవచ్చు. ఇంత పెద్ద నగరానికి మరో ఆడిటోరియం అవసరం కూడా. రవీంద్ర భారతిని కూల్చిన తరువాత ఆ స్థానంలో నిర్మించబోయే ఆడిటోరియం నమూనాను కూడా కేసీఆర్ విడుదల చేశారు. ఆ నమూనాతోనే మరో చోట ఆడిటోరియం నిర్మించి కేసీఆర్ తన కోరిక తీర్చుకోవచ్చు. కాని కూలుస్తామని అనడంతో వ్యతిరేకత వచ్చింది. 

రమణాచారి మాట విన్నారా?

ఒకప్పుడు మంచి అధికారిగా, కళా ప్రియుడిగా, సాంస్కృతిక సంస్థలకు, కళాకారులకు అండగా నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి చొరవ కారణంగానే రవీంద్ర భారతి కూల్చివేత ఆగిందని సమాచారం. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారిగా ఎంతటి కీలక పాత్ర పోషించారో, ఇప్పుడు సలహాదారుగా అంతే కీలకంగా ఉన్నారు. కేసీఆర్‌కు ఆయన మాట మీద గురి ఎక్కువని కొందరు చెబుతున్నారు. ఆయన సలహాలు తీసిపారెయ్యరు. రవీంద్ర భారతిని కూల్చొద్దని ముఖ్యమంత్రికి రమణ సలహా ఇవ్వడమే కాకుండా నచ్చచెప్పారట. రమణాచారికి అధికారిగానే కాకుండా, కళాప్రియుడిగా, కళాకారులకు సన్నిహితుడిగా రవీంద్ర భారతితో ప్రత్యేక అనుబంధం ఉంది. రవీంద్రభారతిలో అనేక కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. చాలావాటిల్లో ఆయన ముఖ్య అతిథిగానో, వక్తగానో పాల్గొన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి రవీంద్ర భారతి కూల్చివేతను రమణాచారి ఆపించారన్న సమాచారం నిజమే కావొచ్చు. ఏది ఏమైనా ఈ విషయంలో ఆయన కృషి ఉందనడంలో సందేహం లేదు. 

ఇదీ హైదరాబాద్‌కు ప్రతీకే…!

సాధారణంగా  చారిత్రక కట్టడమైన చార్మినార్‌ను హైదరాబాద్ ‘ఐకాన్’ గా వ్యవహరిస్తారు. అంటే హైదరాబాద్‌కు అదొక ప్రతీక అన్న మాట.  హైదరాబాదును తలచుకోగానే చార్మినార్ ఎలా కళ్లలో మెదులుతుందో రవీంద్ర భారతి కూడా అలా కళ్ల ముందు మెదులుతుంది. ముఖ్యంగా కళాకారులకు, కళాప్రియులకు రవీంద్ర భారతిని అల్లుకొని ఎన్నెన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయో…! రవీంధ్ర భారతిలో సన్మానం జరిగితే గొప్పగా ఫీలవుతారు. ఇక్కడ అరంగేట్రం చేయడాన్ని యువ నృత్య కళాకారులు గర్వంగా భావిస్తారు. ఇక్కడ సంగీత కచ్చేరీలు చేయాలని సంగీత కళాకారులు కలలు కంటుంటారు. ఇక్కడ నాటకాలు వేయాలని, మ్యూజికల్ నైట్స్ నిర్వహించాలని తాపత్రయపడుతుంటారు. అసలు రవీంద్ర భారతిని చూస్తేనే ఓ చక్కని అనుభూతికి లోనవుతారు ఎవరైనా. హైదరాబాదీల జీవితాలతో అర్ధ శతాబ్దానికి పైగా  ముడివేసుకున్న అనుబంధం ఇది. ఇలాంటి  రవీంద్ర భారతిని కూలగొట్టి దాని స్థానంలో అత్యాధునికంగా ‘ముత్యం’ ఆకారంలో అద్భుత కట్టడం నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఓ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్‌తో  నిర్మాణ నమూనాను తయారు చేయించి మీడియాకు విడుదల చేశారు కూడా. హైదరాబాదు ముత్యాల వ్యాపారానికి ప్రసిద్ధి కాబట్టి ఆ ఆకారంలో ఆడిటోరియం నిర్మిస్తామని చెప్పారు. కేసీఆర్ తలచుకుంటే కొత్త ఆడిటోరియం మరోచోట నిర్మించవచ్చు. కాని తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లనే తత్వంగల గులాబీ దళపతి ఎట్టేకలకు నిర్ణయం మార్చుకోవడం సముచితం. 

విశ్వ కవికి నివాళిగానే ‘రవీంద్ర భారతి’ నిర్మాణం

విశ్వ కవి రవీంద్రుడికి నివాళిగా, ఆయన స్మృతి చిరకాలం ఉండేవిధంగా ఈ కళాప్రాంగణాన్ని నిర్మించారు. రవీంద్రుడు గతించాక ఆయన స్మృతి చిహ్నాలుగా దేశంలోని కొన్ని నగరాల్లో ఆయన పేరుతో ఆడిటోరియాలు నిర్మించాలనే నిర్ణయం జరిగింది. అందులో భాగంగా నగరంలోని ప్రధాన ప్రాంతమైన అసెంబ్లీకి సమీపంలో దీన్ని నిర్మించారు. 1960 మార్చి 23న అప్పటి ఉత్తర ప్రదేశ్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రవీంద్రుడి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న కాలంలో దీని నిర్మాణం సాగింది. 1961 మే 11న అప్పటి రాష్ర్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దీన్ని ప్రారంభించారు. ఇది ఇప్పటికీ  ప్రభుత్వ నిర్వహణలోనే ఉంది. ఆడిటోరియం ప్రారంభమైన 44 ఏళ్ల తరువాత 2005లో ఆధునికీకరించి. అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. సౌండ్ సిస్టమ్ మొదలైనవి మెరుగుపరిచి ఏసీ సౌకర్యం కల్పించారు. 2010 మే 11న ఈ ఆడిటోరియం స్వర్ణోత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ప్రస్తుతం రవీంద్ర భారతి కూల్చివేత జాబితా నుంచి ఎగిరిపోయింది. ప్రస్తుతానికి మరమ్మతులు చేయించి భవిష్యత్తులో కూల్చే ఆలోచన చేస్తారా? అనే అనుమానం కూడా ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు జరిగింది సంతోషకరమే.
 
ఎం.నాగేందర్