‘భయో’ డేటా : అమిత్‌ ‘జోడి’

పేరు            : అమిత్‌ భాయ్‌ అనిల్‌ చంద్ర షా ఎలియాస్‌ అమిత్‌ షా Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: నేను ఏ ఉద్యోగానికీ దరఖాస్తు చెయ్యను. నా తరపున మోడీయే చేస్తారు.…

పేరు            : అమిత్‌ భాయ్‌ అనిల్‌ చంద్ర షా ఎలియాస్‌ అమిత్‌ షా

దరఖాస్తు చేయు ఉద్యోగం: నేను ఏ ఉద్యోగానికీ దరఖాస్తు చెయ్యను. నా తరపున మోడీయే చేస్తారు. ఆయన ప్రధాని అయ్యారు కాబట్టి, నన్ను పార్టీ(బీజేపీ) అధ్యక్షునిగా చేస్తారు. ఒక వేళ ఆయన ఎప్పుడయినా రాష్ట్రపతి అవ్వాలనుకున్నారనుకోండి. నా తరపున ప్రధాని అభ్యర్థికి దరఖాస్తు చెయ్యవచ్చు. 

ముద్దు పేర్లు        : అమిత్‌ ‘జోడి’ . అవును ‘మోడి’ నేను కలిస్తే ‘జోడి’. మోడీ వున్న ప్రతీ చోటా నేను వుంటాను. ఆయన కొచ్చిన పొగడ్తల్లోనే కాదు, ఆయన మీద పడ్డ నిందల్లోనూ నాకు వాటా వుంటుంది. అవి ‘అల్లర్లే’ కావచ్చు బూటకపు ‘ఎన్‌కౌంటర్లే’ కావచ్చు.

‘విద్యార్హతలు        : మాస్టర్‌ ఆఫ్‌ ‘చాణక్య’ నీతి. (ఏదో చెప్పాలని చాణక్యుడి పేరు చెబుతున్నాం కానీ, ఆయనకి మైనారిటీస్‌ గురించి తెలుసా? ముజఫర్‌ నగర్‌ గురించి తెలుసా? 

హోదాలు            : మోడీ నీడ.( ఇంతకు మించి పెద్ద హోదా వుంటుందని నేను అనుకోను.) నీడ లేని మోడీని మీరు చూడలేరు.

గుర్తింపు చిహ్నాలు  :ఒకటి: శత్రువుకి శత్రువుని వెంటనే గుర్తించగలను. అదే నా గుర్తింపు.

                           రెండు: కాశీ వెళ్ళి అందరూ ఏదో ఒకటి వదలుకొని వస్తారు. నేను తీసుకుని వస్తాను. మోడీకి గెలుపుని తీసుకు వచ్చాను.
సిధ్ధాంతం            :  పేరుకు ‘జైనిజం’ తీరుకు ‘హిందూత్వ'ం.

వృత్తి                  : పోటీ దారుల్ని పక్కన పెట్టటం. (మోడీదీ నాదీ అదే వృత్తి). కడకు గురువుల్నయినా సరే పోటీలో లేకుండా చూసుకుంటాం. అద్వానీజీ, జస్వంత్‌ సింగ్‌, ఇలా ఎందరో మాకు అడ్డుతొలిగారు.

హాబీలు              :1. మనుషుల్ని దేవుళ్ళను చెయ్యటం. ( నరేంద్రమోడీని ‘నమో’ అని పిలిపించ లేదూ అలాగన్న మాట.
                         2. ఆరోపణల్ని కూడా అందలాలుగా మలచుకోవటం. ( నా మీద కేసులూ, ఆరోపణలూ వున్నాయి. అవే లేకపోతే, రాజకీయాల్లో ఎదిగే వాడినే కాను. కడకు అవన్నీ అబధ్ధాలని నిరూపించగల చతరుత నాకుంది.)

అనుభవం        : మన దేశంలో గ్రామ రాజకీయాలకూ, దేశ రాజకీయాలకూ పెద్ద తేడా లేదు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ ను ఓడిరచటానికి ప్రతీ గ్రామంలోనూ ఓడిన సర్పంచ్‌ను చేరదీసి, గెలిచిన సర్పంచ్‌ మీద ఉసి గొలిపాం. అంతిమంగా జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయి లోనూ బీజేపీని గెలిపించాం. మోడీ,నేనూ ఇదే టెక్నిక్‌ను దేశంలోనూ వాడాను. నేనయితే ఉత్తర ప్రదేశ్‌లో వాడాను. 80 సీట్లకూ 71 సీట్లను బీజేపీకి తెచ్చిపెట్టాను.

మిత్రులు           : మిత్రులు కాదు. మిత్రుడు. ఆయనే నాకు గురువూ, దైవం కూడా.

శత్రువులు         : మోడీకి ఎదురొచ్చిన వాడు ఎవరయినా సరే నాకు శత్రువే.

మిత్రశత్రువులు    : నేను ఉండనివ్వను. 

వేదాంతం           :పుట్టిన మతంలోనే గిట్టాలి. మధ్యలో మతాంతీకరణ అంటే మర్యాద గా వుండదు. అందుకే గుజరాత్‌లో చట్టం చేయించాను. మా మాతృసంస్థ (ఆరెస్సెస్‌) మెచ్చింది కూడా. 

జీవిత ధ్యేయం      : మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా ఒకే సారి 12 శాఖలకు మంత్రిగా వున్నాను. ఇప్పుడు నేను మోడీ ప్రధానిగా వున్న కేంద్ర కేబినెట్‌లోకి వెళ్ళాల్సి వస్తే 24 శాఖలకు మంత్రిని కావాలి. సాధ్యమయ్యేదయితే దానినే జీవిత ధ్యేయంగా పెట్టుకొనే వాడిని.

-సర్‌