ఈ వరల్డ్ కప్ లో వీళ్లూ హాట్ టాపిక్ అయ్యారు!

ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్ జరిగినప్పుడు అనేక అంశాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. వివిధ జట్ల బలాబలాలూ.. ప్రత్యేకంగా పరిగణింపదగ్గ బ్యాట్స్ మన్లు, బౌలర్ల గురించి.. వాతావరణ పరిస్థితుల గురించి… సంచలనాలను సాధించిన…

ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్ జరిగినప్పుడు అనేక అంశాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. వివిధ జట్ల బలాబలాలూ.. ప్రత్యేకంగా పరిగణింపదగ్గ బ్యాట్స్ మన్లు, బౌలర్ల గురించి.. వాతావరణ పరిస్థితుల గురించి… సంచలనాలను సాధించిన క్రికెటర్ల గురించి ఇంకా రకరకాల అంశాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. 

వీటన్నింటితో పాటు ఆతిథ్యం ఇచ్చే దేశం గురించి మరింత చర్చ జరుగుతుంది. ఆతిధ్యం ఇస్తున్న దేశం ప్రదర్శనతో పాటు.. ఆ దేశ ప్రేక్షకుల గురించి కూడా వార్తలు, విశ్లేషణలూ వస్తూ ఉంటాయి. ఈ లెక్క ప్రకారం చూసుకొంటే ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రేక్షకుల గురించి చర్చ జరగాలి. ఈ ఉభయదేశాలూ కలిసి ప్రస్తుత ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి కాబట్టి వారి గురించి ప్రపంచమంతా మాట్లాడుకోవాలి.

మరి వారి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారో లేదో కానీ.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు క్రికెట్ పై ఆసక్తి ఉన్న దేశాలన్నింటిలోనూ చర్చజరుగుతోంది. ఇండియాలో ఉన్న ఇండియన్ ఫ్యాన్స్ గురించి కాదు.. ఆసీస్ లో ఉన్న ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ గురించినే ఈ చర్చ అంతా!

మిడతలదండులా ఆసీస్ చేరుకొన్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. భారీ జన సామర్థ్యం ఉన్న ఆసీస్ స్టేడియంలలో ఇండియా మ్యాచ్ ఆడుతోందంటే స్టేడియమంతా నీలి రంగులోకి మారుతోంది! మెన్ ఇన్ బ్లూ ధరించే జెర్సీలు వేసుకొన్న వారే కనిపిస్తున్నారు. ఇండియా, దక్షిణా ఫ్రికా మ్యాచ్ జరిగిన ఎమ్ సీజీ అయితే పూర్తిగా నీలిమయం అయ్యింది. హాజరైన ప్రేక్షకుల్లో 80 నుంచి 85 శాతం మంది ఇండియన్ ఫ్యాన్స్ లాగానే కనిపించారు.

పాత ప్రపంచకప్ మ్యాచ్ లను పరిశీలిస్తే.. సాధారణంగా ఆతిథ్య జట్టు ఆడే మ్యాచ్ లకు మాత్రమే స్టేడియం సీట్లన్నీ నిండుతాయి. రెండు విదేశీ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ల పట్ల స్థానికులు ఎవ్వరూ ఆసక్తి చూపించరు. ఆయా దేశాల ఫ్యాన్స్ ఎవరైనా వస్తే వారు మాత్రమే స్టాండ్స్ లో అక్కడక్కడ కనిపిస్తారు. ప్రస్తుత ప్రపంచకప్ లో అతిథులుగా వెళ్లిన జట్లు ఆడే మ్యాచ్ లను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. 

అయితే ఇండియా ఆడే మ్యాచ్ లను చూస్తే మాత్రం పరిస్థితి భిన్నంగా.. బీభత్సంగా ఉంటోంది. ఆసీస్ లో సెటిలైన ఇండియన్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉండటం.. మ్యాచ్ లను చూసే ఆసక్తితో అక్కడి వెళ్లిన వారి సంఖ్యకూడా భారీగా ఉండటంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఆసీస్ లో కనిపిస్తున్న భారత దండు కూడా ఈ ప్రపంచకప్ విషయంలో చర్చనీయాంశంగా మారింది.