అయిదు నిమషాల కాఫీకి వంద, రెండువందలు ఇస్తున్నారు, రెండున్నర గంటల సినిమాకు డెభై రూపాయిలేనా..టికెట్ రేటు పెంచాల్సిందే అంటున్నాడు హీరో నితిన్. ఇప్పుడు నిర్మాతగా మారాడు కదా అందుకే అలాంటి మాటలు వస్తున్నాయి.
కానీ, నితిన్ సమస్య ఏమిటంటే, ఆయనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటున్నాడు. కాఫీ అంటే హైదరాబాద్ లో కాఫీ డే తదితర బాడా కాఫీ షాపుల్లో కాఫీ తాగడమే అనుకుంటున్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాఫీ డే లాంటి దుకాణాలు ఎన్ని, వాటిల్లో కాఫీలు తాగే వారు ఎందరు? అలాంటి వాళ్లంతా ఇప్పటికే మల్టీ ఫ్లెక్స్ ల్లో రెండు యాభై పెట్టి రిక్లయినర్లలో సినిమాలు చూస్తూనే వున్నారు.
కానీ ఇంకా చిన్న, మీడియం, ఇంకా మట్లాడితే కాస్త మంచి హోటళ్లలో కూడా పది నుంచి యాభై మధ్యలోనే కాఫీ తాగుతున్నారు. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుని, వందలకు కాఫీ తాగే నితిన్ కు ఆ సంగతి తెలియకపోవచ్చు.
ఇప్పటికే భారీ సినిమాల కోసం ఇలా టికెట్ లు పెంచడం వాటి వల్ల, జనం చిన్న సినిమాలు మరిచిపోతున్నారు. జన్మకో శివరాత్రి అన్నట్లు ఏడాదికి ఒకటో రెండో చిన్న సినిమాలు మాత్రమే థియేటర్ కు వచ్చి చూస్తున్నారు. మిగిలినవి టీవీల్లో, పైరసీ సీడీల్లో కానిచ్చేస్తున్నారు.
ఇప్పుడు రేట్లు పెంచితే దానికే ఫిక్సయిపోతారు. ఇంక పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు, పెద్ద రేట్లు తప్ప, టాలీవుడ్ లో చిన్న అన్న పదానికి చోటు ఉండకుండా పోతుంది. హీరోలు మాట్లాడే ముందు అందరి బాగోగులు తెలిసి, అందరి సమస్యలు తెలిసి, అన్ని వ్యవహారాలు తెలిసి మాట్లాడాలి. లేదంటే ఇలాగే వుంటుంది.