ఎపి నుంచి తెలంగాణ దాకా పాకిన సూదిగాడి గోలని ఇతోధికంగా పెంచడానికి మీడియా చేసిన అతికి తాజా ఉదాహరణ హైదరాబాద్లోని బంజారాహిల్స్లో సూదిగాడి కలకలం. బంజారాహిల్స్లో ఓ యువకుడు ఇంటి ముందు ఆడుకుంటున్న పాపకు సూదిగుచ్చేసాడని నిన్న పొద్దున్నే గుప్పుమంది. అంతే అన్ని చానెళ్లూ యధాశక్తి దాన్ని అంటుకున్నాయి. ఎడా పెడా స్క్రోలింగులు వేసేశాయి.
ఎలాగైతేనేం అ యువకుడిని స్థానికుల సహాయంతో పోలీసులు పట్టుకున్నారని, పోలీసులు అతడని అదుపులోకి తసుకుని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఊరుకోకుండా ఆ యువకుడి గదిలో పోలీసులు సోదాలు నిర్వహించారని, కొన్ని అనుమానాస్పద వస్తువుల, సిరంజిలు వంటివి దొరికాయని కూడా కధనాలు వడ్డించేశాయి.
దీంతో హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే సంఘటన జరిగింది నిత్యం రద్దీగా ఉండే ఇందిరానగర్ ప్రాంతంలో్. నిజంగా సూదిగాడి లాంటివాళ్లు అక్కడ అంత యధేఛ్చంగా సంచరించడం అంటే చాలా పెద్ద విషయంగానే చెప్పుకోవాలి.
సరే…సదరు మీడియా దృష్టిలోని సూదిగాడు పోలీసుల విచారణలో తానసలు సూదిగాడిని కాదన్నాడు. పక్కింటి వాళ్ల పాప సూదితో ఆడుకుంటుంటే గుచ్చుకుంటుందని ఆ సూది లాక్కున్నానే తప్ప తాను గుచ్చాలని ప్రయత్నించలేదని లబోదిబోమన్నాడు. పాపకు చేయించిన వైద్యపరీక్షల్లో కూడా సూదిగాయాలు ఏవీ లేవని తేలింది. అలాగే ఆ యువకుడి గదిలో ఎటువంటి సందేహాస్పదమైన వస్తువులూ లభ్యం కాలేదని స్పష్టమైంది.
ఇప్పటికే అదిగో సూది ఇదిగో సూది అంటూ రకరకాల కధనాలతో జనాల్లో అవగాహనేమో గాని భయం బాగా పెంచేశారు. దాని ఫలితమే వెనుకా ముందు చూసుకోకుండా ఇందిరానగర్లో పట్టుకున్న యువకుడిని సూదిగాడని అనుమానించి జనం చితక్కొట్టడం.
తీరుబాటుగా ఇప్పుడు సదరు యువకుడు అమాయకుడని ఓ చిన్న స్క్రోలింగ్ ఇచ్చి ఊరుకుంటూ సరిపోతుందా? ఒక విషయాన్ని నిర్ధారించుకోకుండానే ఒక అమాయకుడ్ని రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో దోషిగా నిలబెట్టినందుకు మీడియా లెంపలేసుకోవాలి. ఇదొక్కటే కాదు అనేక విషయాల్లో… అదిగో పులి ఇదిగో తోక అన్నట్టు రెచ్చిపోతున్న మీడియా రోగం కుదరాలంటే ఎవరో ఒకరు పూనుకుని సూదిమందైతే వేయాలి.