ఆ ప్ర‌క‌ట‌న‌తో మూడు రాజ‌ధానుల‌కు మోక్షం క‌ల‌గ‌నుందా?

లోక్‌స‌భ‌లో తాజాగా హైకోర్టు మార్పుపై న్యాయ‌శాఖ మంత్రి స‌మాధానంతో రాజ‌ధాని సుడిగుండం నుంచి జ‌గ‌న్ స‌ర్కార్ బ‌య‌ట‌ప‌డిందా? మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ‌కు మోక్షం క‌ల‌గ‌నుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న…

లోక్‌స‌భ‌లో తాజాగా హైకోర్టు మార్పుపై న్యాయ‌శాఖ మంత్రి స‌మాధానంతో రాజ‌ధాని సుడిగుండం నుంచి జ‌గ‌న్ స‌ర్కార్ బ‌య‌ట‌ప‌డిందా? మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ‌కు మోక్షం క‌ల‌గ‌నుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న మూడు రాజ‌ధానుల (అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌) లోచ‌న‌కు ఏపీ హైకోర్టు బ్రేక్ వేసిన సంగ‌తి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో జ‌గ‌న్ స‌ర్కార్ స‌వాల్ చేసింది. ఎన్నిక‌ల లోపు మూడు రాజ‌ధానుల అంశంపై తీర్పు వెలువ‌డే అవకాశం లేదనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు త‌ర‌లింపుపై లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావ‌న రావ‌డం, దానికి న్యాయ‌శాఖ మంత్రి ఇచ్చిన స‌మాధానం మ‌రోసారి మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌పైకి తెచ్చింది.

సుడిగుండంలో జగన్ సర్కార్

అమరావతి రాజధానికి సంబంధించిన విషయంలో తదుపరి నిర్ణయం తీసుకునే అధికారం ఏపీ అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సుప్రీంలో ఊరట లభిస్తుందన్న ఆశ ఏపీ ప్రభుత్వానిది. కానీ అది ఎన్నికల లోపు వస్తుందా? డిసెంబర్‌కు వాయిదా వేయడం, మార్చిలో ఎన్నికల ఉండటం వల్ల తీర్పు రాకపోతే మూడు రాజధానుల ఆలోచన కార్యరూపం దాల్చ‌దు. దీంతో రాజధానిని మారుస్తారని మధ్య‌కోస్తాలో, రాజధాని ఆశలు పెట్టుకున్న రాయలసీమ, ఉత్తరాంధ్రలో నిరాశ కలిగి రాజకీయంగా నష్టం జరుగుతుందని జ‌గ‌న్ స‌ర్కార్  తీవ్ర వత్తిడికి లోనైంది. అలా రాజధాని సుడిగుండంలో అధికార పార్టీ ఇరుక్కుంది.  

న్యాయ శాఖ మంత్రి సమాధానంతో  చిగురించిన ఆశలు.

పార్లమెంట్ సమావేశాలలో అనంతపురం MP తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇచ్చిన రాతపూర్వక స‌మాధానంతో మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందన్న ఆశ చిగురిస్తోంది. ఇప్పటి వరకు హైకోర్టు మార్పు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని, అనితర సాధ్యమైన పని అన్న భావన ఉంది. 

కేంద్ర మంత్రి ప్రకటనలో హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్పు కోరుతూ ఏపీ ప్రభుత్వం 2020లో లేఖ రాసిందని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రభుత్వం సంప్రదించి చేసే ప్రతిపాదనతో మార్పు జరుగుతుంది – ఈ సందర్భంగా మార్పులకు అవసరం అయ్యే ఖర్చులు ఏపీ ప్రభుత్వం భరించాలని స్పష్టం చేశారు. అంటే హైకోర్టు మార్పు అసాధారణ నిర్ణయం కాదని ప్రధాన న్యాయమూర్తి – ప్రభుత్వం ఒక అవగాహనకు వస్తే సాధారణ పద్ధ‌తిలో హైకోర్టు మార్పు చేసుకోవచ్చు. 

ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం సివిల్ సిటీ కోర్టు భవనం. కేంద్రం విభజన చట్టం ప్రకారం హైకోర్టు నిర్మాణానికి సంబంధించి ఖర్చు ఇవ్వాలి. ఇప్పటి వరకు ఇవ్వలేదు కనుక వారు ఇచ్చే నిధులతో కర్నూలు లోనే హైకోర్టు నిర్మాణం పూర్తి చేయవచ్చు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం కీలకం.

సమస్య రాజధానిపై తదుపరి చట్టం చేసే అధికారం ఏపీ అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును నూతన ప్రధాన న్యాయమూర్తి మార్పులకు అంగీకారాన్ని తెలపడం సాధ్యమా? సాంకేతికంగా పరిశీలిస్తే ఏపీ హైకోర్టు రాజధానిపై తదుపరి చట్టం చేసే అధికారం ఏపి అసెంబ్లీకి లేదని తీర్పు ఇచ్చింది. 

హైకోర్టు రాజధానిలో భాగం కాదు. చాలా రాష్ట్రాల్లో రాజధాని – హైకోర్టు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టు భవనం… హైకోర్టు శాశ్వత భవనం కాదు. కావున ఆర్థిక భారం కాదు. పై అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం నూతన ప్రధాన న్యాయమూర్తి గారితో సంప్రదింపులు జరిపి తాత్కాలిక భవనంలో ఉన్న  హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్పు చేయాలని ప్రతిపాదనలు పంపితే, సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మార్చేందుకు అవకాశం ఉంది. 

హైకోర్టు మార్పుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఇచ్చిన సమాధానంలో ఎక్కడా ఏపీ హైకోర్టు తీర్పు – సుప్రీంకోర్టులో వ్యాజ్యం ఉంద‌ని ప్రస్తావించలేదు. అలా అని ఈ సమాచారం కేంద్రం దగ్గర లేదా అంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో కేంద్రం ఈ కేసులో ప్రాథ‌మిక అఫిడవిట్ దాఖలు చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలి.

మూడు రాజధానులకు బీజం

కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇచ్చిన సమాధానంలో సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసే అవ‌కాశాల‌పై చ‌ర్చ‌కు తెర‌లేచింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని వెంటనే ఎటువంటి ఆటంకం లేకుండా విశాఖలో ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం పేరుతో పాలన వ్యవహారాలు విశాఖ నుంచి చేస్తే మూడు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే రాజధాని కార్యాలయాల ప్రాథ‌మిక‌ ఏర్పాట్లు చేయడం ద్వారా మూడు రాజధానుల ఆలోచనకు బీజం పడుతుంది. 

ఎన్నికల్లో హైకోర్టు తీర్పు వల్ల ఆలస్యం అయినా తమ పరిధిలో ఉన్న అవకాశం మేరకు చేశామ‌ని, మళ్ళీ గెలిస్తే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అధికార పార్టీ ధీమాగా చెప్పవచ్చు. కాకపోతే హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్పు చేసే ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అయినప్పుడు మాత్రమే మూడు రాజధానులకు సానుకూలత ఏర్పడుతుంది. 

హైకోర్టు విషయంలో ముందడుగు వేయకుండా క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటుతో అలాంటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడదు. హైకోర్టు మార్పున‌కు సంబంధించి ముందడుగు పడితే ప్రతిపక్ష పార్టీలు ఆత్మరక్షణలో పడటమే కాకుండా 2024 ఎన్నికల్లో ఎవరు గెలిచి ఎవరు అధికారంలోకి వచ్చినా మూడు ప్రాంతాల్లో రాజధానితో ముడిపడిన కార్యాలయాలను ఏదో ఒక పేరుతో నెల‌కొల్పాల్సిన అనివార్య‌త‌ ఏర్పడుతుంది.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి. సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం