పవన్ కల్యాణ్ సినిమా అంటే అందులో పొలిటికల్ సెటైర్లు కామన్. రీఎంట్రీ తర్వాత పవన్ చేసిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాల్లో ఈ తరహా డైలాగ్స్, పవన్ ఎలివేషన్లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు పవన్ నుంచి బ్రో అనే సినిమా వస్తోంది. పైగా ఎన్నికల ఫీవర్ ఊపందుకున్న టైమ్ లో వస్తోంది.
కాబట్టి ఈ సినిమాలో కచ్చితంగా పవన్ నుంచి కొన్ని పొలిటికల్ పంచ్ లు ఉంటాయని అనుకుంటున్నారు చాలామంది. అయితే మరో హీరో సాయిధరమ్ తేజ్ మాత్రం వీటిని ఖండిస్తున్నాడు. తనకు తెలిసి బ్రో చిత్రంలో అలాంటి డైలాగ్స్ లేవంటున్నాడు.
“పవన్ కు పొలిటికల్ డైలాగ్స్ పెట్టే స్కోప్ బ్రో సినిమాలో లేదు. ఈ క్షణం బతకడం అనే కాన్సెప్ట్ ను సినిమాలో డిస్కస్ చేశాం. సినిమా మొత్తం దానిపైనే ఉంటుంది. కాబట్టి డైలాగ్స్ మొత్తం ఈ కాన్సెప్ట్ చుట్టూనే ఉంటాయి. నాకు తెలిసి సినిమాలో పొలిటికల్ సెటైరిక్ డైలాగ్స్ లేవు. నేనింకా కంప్లీట్ సినిమా చూడలేదు.”
మరోవైపు పవన్ రాజకీయ ప్రస్థానం, తన రాజకీయ ప్రచారంపై కూడా స్పందించాడు సాయితేజ్. పవన్ కు తన ప్రచారం అక్కర్లేదన్న సాయితేజ్.. అవగాహన లేకుండా రాజకీయాల్లోకి రావొద్దని పవన్ చెప్పిన మాటను గుర్తుచేశాడు.
“రాబోయే ఎన్నికల్లో నేను క్షేత్రస్థాయిలోకి వచ్చి పవన్ కోసం ప్రచారం చేయాల్సినంత అవసరం లేదు. ప్రజలు ఆయన్ను ప్రేమిస్తున్నారు. కల్యాణ్ కోసం నేను వచ్చి క్యాంపెయిన్ చేయాల్సిన పని లేదు. అయినా కల్యాణ్ ఒకటే మాట చెప్పారు. రాజకీయంగా అవగాహన ఉంటేనే రమ్మన్నారు, పొలిటకల్ నాలెడ్జ్ లేకపోతే దూరంగా ఉండమన్నారు. ఈ మాట నాకే కాదు, ఫ్యామిలీలో అందరికీ చెప్పారు. రాజకీయంగా హెల్ప్ చేయాలనుకుంటే, పూర్తి నాలెడ్జ్ తో ప్రజల్లోకి రమ్మన్నారు. నేను రాజకీయాల్లోకి వెళ్లను, పవన్ అడిగితే ఆయన కోసం ఏదైనా చేస్తా.”
తనకు రాజకీయాలపై అవగాహన లేదన్నాడు సాయితేజ్. తనకు మాత్రమే కాదని, రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కు కూడా పాలిటిక్స్ పై నాలెడ్జ్ లేదని తేల్చేశాడు. అయితే తమకు రాజకీయాలు తెలియకపోయినా.. కల్యాణ్ కోరితే ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధమని ప్రకటించాడు.