సల్మాన్ ఖాన్, రజనీకాంత్, కమల్ హాసన్.. ఇలా స్టార్ హీరోల పేర్లు వరుసగా తెరపైకొస్తున్నాయి. వీళ్ల పేర్లు వాడుకొని మోసాలకు తెరదీస్తున్నారు కేటుగాళ్లు. అందినకాడికి దోచుకుంటున్నారు.
మొన్నటికిమొన్న సల్మాన్ ఖాన్ పేరిట కొంతమందికి ఈమెయిల్స్ వెళ్లాయి. ఆ తర్వాత కమల్ హాసన్ పేరు వాడేశారు. ఇప్పుడు రజనీకాంత్ పేరును కూడా తమ మోసాల కోసం వాడేస్తున్నారు కేటుగాళ్లు.
రజనీకాంత్ ఫౌండేషన్ పేరిట సూపర్ స్టార్, తన ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫౌండేషన్ పేరును కొందరు వాడేస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ మేరకు ట్రస్టీ శివరామకృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజనీ ఫౌండేషన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో, 2వేల మంది రిజిస్టర్ చేసుకుంటే, లక్కీ డిప్ ద్వారా 200 మందికి ఖరీదైన బహుమతులు అందిస్తామంటూ కొందరు మోసానికి తెరదీశారు.
తాజాగా కమల్ హాసన్ కూడా ఇలాంటి మోసాలకు బాధితుడిగా మారారు. ఈయన సొంత సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ లోగోపై కొందరు కాస్టింగ్ కాల్ ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటుడిగా, నిర్మాతగా 4-5 సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో.. దీన్ని చాలామంది నమ్మారు. విషయం తెలిసిన నిర్మాణ సంస్థ వెంటనే స్పందించింది. తాము ఎలాంటి కాస్టింగ్ కాల్ చేపట్టడం లేదని, సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై త్వరలోనే లీగల్ గా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ బాధితుల జాబితాలో ఉన్నాడు. సల్మాన్ నిర్మించబోయే సినిమాల్లో నటీనటుల సెలక్షన్స్ ఉన్నాయని, ఫొటోలు, కొంత మొత్తం పంపించాలంటూ మెయిల్స్ అందుకున్నారు కొంతమంది. దీనిపై సల్మాన్ మేనేజర్ వెంటనే స్పందించారు. అలాంటి ఈమెయిల్స్ కు స్పందిచ్చొద్దని, వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు
సల్మాన్, రజనీకాంత్, కమల్ హాసన్.. ఇలా ముగ్గురూ రోజుల వ్యవధిలో బాధితులుగా మారారు. చూస్తుంటే, ఏదో పెద్ద ముఠానే రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది.