గబ్బర్ సింగ్ 2 వదిలేసిన ప్రశ్నలు

గబ్బర్ సింగ్ 2 సినిమా మొత్తానికి మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే కొలిక్కి వచ్చింది. రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ వార్తల్లో నలుగుతున్న సినిమా, గ్యాసిప్ ల పంటకు బోలెడు విత్తనాలు జల్లిన సినిమా…

గబ్బర్ సింగ్ 2 సినిమా మొత్తానికి మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే కొలిక్కి వచ్చింది. రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ వార్తల్లో నలుగుతున్న సినిమా, గ్యాసిప్ ల పంటకు బోలెడు విత్తనాలు జల్లిన సినిమా అదే. ఇప్పుడు తాజాగా పవర్ డైరక్టర్ బాబి దర్శకత్వంలో త్వరలో సెట్ పైకి వెళ్లనున్నట్లు ప్రకటన వెలువడింది. అభిమానులకు ఆనందాన్నిచ్చే వార్తే అది. కానీ ఇంకా అనేకానేక సందేహాలు వుండనే వున్నాయి.

గబ్బర్ సింగ్ 2 కు కథ పవన్ దే. కానీ దానికి ట్రీట్ మెంట్ సంపత్ నంది తయారు చేసారన్నది వాస్తవం. అది పవన్ ఓకె చేసిన తరువాతే కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారన్నది వాస్తవం. అందులో తొలిషాట్ చంబల్ లోయలో ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడు ఆ స్క్రిప్టే వాడుతున్నారా? లేక మళ్లీ మొదటి నుంచీ కొత్తగా రాయడం మొదలెడతారా?

సంపత్ నంది అప్పట్లో చెప్పిన దాని ప్రకారం గబ్బర్ సింగ్ 2 , గబ్బర్ సింగ్ కు ప్రీక్వెల్ అవుతుంది. ఎందుకంటే అలా అయితే తప్ప హీరోయిన్ ను మార్చడానికి వీలు వుండదు. కానీ ఇప్పుడు ప్రెస్ నోట్ లో ప్రీక్వెల్, సీక్వెల్ రెండూ కాదంటున్నారు? అంటే టైటిల్, క్యారెక్టరైజేషన్ మాత్రమే వాడుకుంటున్నారని అనుకోవాలా?

అదే ట్రీట్ మెంట్ వాడితే, దానికి సంపత్ నందికి క్రెడిట్ లైన్ ఇవ్వాలి కదా?     

సరే., ఆ సంగతి పక్కన పెడితే సంపత్ నందిని సినిమా నుంచి తప్పించినందుకు ఆయనకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేసినట్లో? ఎందుకంటే ఇలా అనుకుని అలా తప్పించడం వేరు. రెండేళ్ల పాటు మరే సినిమా లేకుండా కష్టపడడం వేరు.

గబ్బర్ సింగ్ 2 కోసం సంపత్ నందికి కాస్త బాగానే అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అదే అతను పడ్డ కష్టానికి పారితోషికం అనుకోవాలా?

గబ్బర్ సింగ్ సినిమాకు అన్నిఅదనపు హంగులు, క్యారెక్టరైజేషన్ అన్నీ, పవన్ ఆలోచనలే అని ప్రెస్ నోట్ చెబుతోంది..మరి అలాంటపుడు ఆ సినిమాకు హరీష్ శంకర్ చేసింది కేవలం సినిమా డైరక్షన్ మాత్రమేనా?

అంటే పవన్ డైరక్టర్లను ముందు పెట్టి, కథ, క్యారెక్టరైజేషన్, అదనపు హంగులు అన్నీ ఇస్తూ, తాను తెర వెనుక వుండి నడిపిస్తున్నారని అనుకోవాలా?

గబ్బర్ సింగ్ 2 కన్నా ముందు, గోపాల గోపాలకు తరువాత పవన్ వేరే సినిమా చేస్తారని, పివిపి కి సినిమా బాకీ వున్నారని వార్తలు వినవచ్చాయి. అంటే ఇప్పుడు అవి వెనక్కు వెళ్లినట్లే అనుకోవాలి.

ఏదైమైతేనేం..ఇన్నాళ్లకు ఓ కొత్త దర్ళకుడి రెండో సినిమాగా గబ్బర్ సింగ్ 2 సీక్వెల్ బయటకు వస్తోంది. అది చాలు అభిమానులు ఆనందించడానికి.