క్రికెట్‌లో ఇరగదీస్తోన్న మనోళ్ళు…

మొన్న అంబటి రాయుడు.. నేడు రోహిత్‌ శర్మ.. క్రికెట్‌లో ఇద్దరూ ఇరగదీసేస్తున్నారు. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.. తెలుగు గడ్డ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టి, అద్భుతాలు సాధించినవారిలో అజారుద్దీన్‌ నుంచి ప్రజ్ఞాన్‌ ఓఝా దాకా చాలామందే…

మొన్న అంబటి రాయుడు.. నేడు రోహిత్‌ శర్మ.. క్రికెట్‌లో ఇద్దరూ ఇరగదీసేస్తున్నారు. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.. తెలుగు గడ్డ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టి, అద్భుతాలు సాధించినవారిలో అజారుద్దీన్‌ నుంచి ప్రజ్ఞాన్‌ ఓఝా దాకా చాలామందే వున్నా.. అందులో కొందరు మాత్రమే తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అజారుద్దీన్‌ టీమిండియాకి కెప్టెన్‌గానూ, అద్భుతమైన బ్యాట్స్‌మన్‌గానూ రాణిస్తే, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ‘వెరీ వెరీ స్పెషల్‌’ అన్పించుకున్న విషయం విదితమే. వెంకటపతిరాజు సహా పలువురు అంతర్జాతీయ క్రికెట్‌లో ‘తెలుగు’ సత్తా చాటి చెప్పారు.

ఇక, ప్రస్తుతానికి వస్తే అంబటి తిరుపతి రాయుడు ఎన్నాళ్ళగానో జట్టులో స్థానం కోసం వేచి చూస్తూ, రాక రాక వచ్చిన వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సెంచరీతో తన సత్తా ఏంటో చాటిచెప్పిన అంబటి తిరుపతి రాయుడు.. క్రికెట్‌లో ఇన్నాళ్ళూ తనను విమర్శించిన, గేలిచేసినవారి నుంచి ప్రశంసలు పొందాడు.

తాజా హీరో రోహిత్‌ శర్మ విషయానికొస్తే, రోహిత్‌ తల్లి విశాఖపట్నంకు చెందినవారు. చిన్నప్పుడు విశాఖలో గడిపిన రోహిత్‌ శర్మకి, విశాఖ అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకేనేమో.. విశాఖ మైదానంలో మ్యాచ్‌ అంటే రోహిత్‌ చెలరేగిపోతాడు. వన్డే కెరీర్‌లో రెండు డబుల్‌ సెంచరీలు, అందులో ఒకటి అత్యధిక స్కోర్‌తో ‘రోహిత్‌ మనోడు..’ అని తెలుగు జాతి ఉప్పొంగిపోయేలా చేయగలిగాడు.

త్వరలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ సిరీస్‌కి తెలుగు గడ్డ మీదనుంచి ఇద్దరు.. వీలైతే ఓఝా (ఒరిస్సాలో పుట్టినా, క్రికెటర్‌గా పాఠాలు నేర్చుకుని, క్రికెట్‌లో రాణించింది తెలుగు గడ్డ మీదనే) తో కలుపుకుని ముగ్గురు తెలుగు ఆటగాళ్ళు టీమిండియాలో చోటు దక్కించుకోవాలనీ, మరోమారు టీమిండియాకి వన్డే వరల్డ్‌కప్‌ దక్కాలనీ ఆశిద్దాం.