నారా లోకేశ్ వ్యాసకర్త అవుతారం ఎత్తారు. తెలుగు మాట్లాడ్డానికే రాని ఆయన, ఏకంగా వ్యాసాలు రాసే స్థాయికి ఎదిగారు. అభినందిద్దాం. అయితే ఆయన పేరుతో అచ్చయిన కథనంలో పచ్చి అబద్ధాలు, ఆత్మస్తుతి, పరనింద తప్ప, మరేవీ లేవు. వైఎస్ జగన్‌కు నమ్మి ఓటేస్తే నష్టాలే మిగిలాయంటూ ఆయన తెగ బాధపడిపోయారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పాత్రలో ఉన్న తమ పార్టీ, ఏపీ రైతుల కడగండ్లకు ప్రధాన కారణమనే విషయాన్ని లోకేశ్ గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇప్పుడు తమకు కొరకరాని కొయ్యగా మారిన వైఎస్ జగన్‌కు అధికారం ఉందే, జరగరానిదేదో జరిగిపోతోందని లోకేశ్ కేకలేస్తున్నారు. టీడీపీ అనుకూల పత్రిక ఎడిట్ పేజీలో “నమ్మి ఓటేస్తే కష్ట నష్టాలే మిగిలాయి!” శీర్షికతో లోకేశ్ వ్యాసం ప్రచురితమైంది. ఈ వ్యాసంలో మొదటి పేరాగ్రప్ చదివితే…. లోకేశ్ తన తండ్రి చంద్రబాబును తిట్టినట్టుగా వుంది.
“దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు కనీసం వారి కుటుంబాలను పోషించలేకపోతున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి కంటే తక్కువకు పంటను అమ్ముకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతన్నలకు ఇంత దీనస్థితి ఎందుకొచ్చింది? దీనికి ఎవరు కారణం?”
ఈ ప్రశ్న లోకేశ్ ఎవరికి వేస్తున్నట్టు? 14 ఏళ్ల పాటు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన తన తండ్రి నారా చంద్రబాబునాయుడి పాలనా పాపం కాదా? తన మాటలు, రాతలకు చంద్రబాబు పాలనతో అసలు సంబంధమే లేదన్నట్టుగా లోకేశ్ తీరు వుంది. యువగళం పాదయాత్రలో రైతన్నల కన్నీళ్లు చూస్తుంటే మన రాష్ట్రంలో డబ్బు లేకపోవటం సమస్య కాదు, దాన్ని సరైన ప్రణాళికతో ఖర్చు చేయలేకపోవడం అని అర్థమవుతున్నట్టు ఆయన రాసుకొచ్చారు. గత ఐదేళ్ల పాలనలో తాను కూడా భాగస్వామిననే వాస్తవాన్ని లోకేశ్ విస్మరించారు.
సుమారు 62 శాతం రైతాంగం ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పే దమ్ము, ధైర్యం లోకేశ్‌కు ఉందా? కనీసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు మంచి చేయాలనే ప్రయత్నమైనా జరిగింది. ఆర్బీకేల్లో రైతులకు ఎరువులు, మందులు, విత్తనాలు అందిస్తున్నారు. ఆ కేంద్రానికి రైతులు వెళ్లి తమకు ఎంత కెపాసిటీ మేరకు కావాలో వివరాలు ఇస్తే, ఆ ప్రకారం ఆర్బీకే అధికారులు వాటిని తెప్పిస్తున్నారు. దీనివల్ల రైతులకు రవాణా చార్జీలు, శ్రమ తగ్గుతున్నాయి. ఈ పని చంద్రబాబు హయంలో చేయలేకపోయారు.
చంద్రబాబు పాలనంతా అద్భుతంగా సాగి వుంటే, వైఎస్ జగన్‌ను జనం ఎందుకు నమ్మి ఓట్లు వేస్తారో లోకేశ్ సమాధానం చెప్పాలి. ఈ వ్యాసంలో లోకేశ్ అతిపెద్ద అబద్ధం రాశారు.
“టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం రుణ విముక్తి పథకం అమలుచేశాం. దీని ద్వారా రూ.15,279 కోట్ల రుణాన్ని మాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను రద్దు చేసింది”
టీడీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణం…ఎన్నికల హామీలను అమలు చేయకపోవడమే. రైతుల రుణమాఫీతో పాటు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపించుకొచ్చే బాధ్యత తనదే అని చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి, మూడు విడతలతో సరిపెట్టారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.
ఆత్మ వంచనలో చంద్రబాబుకు లోకేశ్ మించిపోయారనేందుకు ఈ అవాస్తవాలే నిదర్శనం. ఒక్క రైతులకే కాదు… డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలోనూ, నిరుద్యోగ భృతి చెల్లించడంలోనూ చంద్రబాబు పచ్చి దగా చేశారు. కేవలం లోకేశ్‌కు మాత్రమే మంత్రి పదవి అనే ఉద్యోగం ఇచ్చారనే ఆగ్రహం నిరుద్యోగుల్లో ఉంది. చంద్రబాబు ఏ ఒక్క హామీని అయినా తన పాలనలో సక్రమంగా అమలు చేశారా?
ఒకవేళ చేసే వుంటే, మరి ఎందుకని మ్యానిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్ నుంచి తొలగించారో లోకేశ్ చెప్పగలరా? కావున జగన్‌ను నమ్మి ఓట్లు వేయడం కాదు, తన పాలన ప్రజల్లో అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని కలిగించిందనే వాస్తవాన్ని లోకేశ్ తెలుసుకోవాలి. ఇలాంటి అబద్ధాల రాతలు లోకేశ్‌కు సంతృప్తి ఇవ్వొచ్చు. అంతే తప్ప, జనం ఆదరణ పొందలేరు. పైగా తన తండ్రి పాలన వైఫల్యాలను లోకేశ్ అక్షరీకరించినట్టుగా వుంది.