సోషల్ మీడియాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టుకుంటున్నాయి. మహిళలను టార్గెట్ చేసే విషయంలో అన్ని పార్టీలు దొందు దొందే. ఎదుటి వాళ్లను ఏమైనా అంటాం, కానీ తమపై ఎవరూ ఏమీ పోస్టులు పెట్టకూడదు, విమర్శ చేయకూడదని పాలక ప్రతిపక్ష పార్టీల నేతలు కోరుకుంటున్నారు. ఇది సాధ్యం కాదు. అందుకే నిత్యం మహిళలపై అసభ్య పోస్టులపై రగడ జరుగుతోంది.
కొన్ని రోజులుగా తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత చెప్పులు కాళ్లకు కూడా చేతలకు వేసుకుని తిరుగుతున్నారు. అటు వైపు నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. అందుకే సమస్య మూలాల్లోకి వెళ్లి, దాని పరిష్కార మార్గాల్ని వెతుక్కోవాలి. అలా కాకుండా చెప్పులు, పరకలు, చాటలు తీసుకుంటే ప్రయోజనం ఏంటి? స్త్రీలను కించపరిచే వాళ్లెవరైనా సరే, కఠిన చర్యలు తీసుకోవాలని కోరితే అందరి మద్దతు లభిస్తోంది.
ఇక్కడ వంగలపూడి అనితకు మద్దతు లభించకపోవడానికి ప్రధాన కారణం ఆమె పక్షపాత ధోరణే. తమ నాయకులు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ సతీమణులను భువనమ్మ, బ్రాహ్మణమ్మ అని అనిత పిలుస్తుంటారు. సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి విషయానికి వస్తే ఆ గౌరవంలో కనీసం పది శాతం కూడా కనిపించదు! జగన్‌పై రాజకీయంగా, వ్యక్తిగతంగా అనితకు కోపం ఉండచ్చు. కానీ భారతి ఏం చేశారని ఆమెపై అనిత అవాకులు చెవాకులు పేలుతున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి.
విజయవాడ ధర్నా చౌక్‌లో తెలుగు మహిళ ఆధ్వర్యంలో మహిళల ఆత్మగౌరవ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళల కన్నా ఏపీలో మహిళల పరిస్థితి దారుణంగా వుందని ఆరోపించారు. ఇంత కంటే దారుణమైన ఆరోపణ ఏదైనా వుంటుందా? రాజకీయంగా తమ ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన ఏమైనా విమర్శించొచ్చని అనిత అనుకుంటున్నారు.
మహిళలపై పోస్టింగ్‌లు పెట్టిన వారికి ఇక చెప్పులతో బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు. ఇదే అనిత జనసేనాని పవన్‌కల్యాణ్‌ను వెనకేసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు అన్నట్టుగా పవన్ ఏకపత్నీవ్రతుడని, ఆయన్ను ఏదైనా అంటే వెనకేసుకొస్తున్నావా అనితా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. మహిళలపై పోస్టింగ్‌లు పెడితే చెప్పుతో కొడ్తానంటున్నావని, మరి వారి జీవితాలతో ఆడుకునే వాళ్లను దేంతో కొడ్తావని అనితను నిలదీయడం గమనార్హం.
పవన్ కల్యాణ్ ఏదైనా ప్రశ్నిస్తే ఆయన నాలుగు వివాహాలు చేసుకున్నారంటూ విమర్శిస్తారని అనిత అనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని అనిత సమర్థిస్తారా? తమకు నచ్చిన నాయకుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటే మీకు ఓకేనా అని అనితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మహిళలపై గౌరవం ఉన్నవాళ్లెవరైనా పవన్ వ్యక్తిగత జీవితాన్ని సమర్థించరని, మరి అనితకు ఎలా నచ్చుతుందో చెప్పాలని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.