ఆంధ్రలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత దారుణంగా తయారైంది అంటే నిస్సిగ్గుగా వార్తలు వండి వారుస్తోంది. దేశంలో ఎక్కడ ఏం జరిగినా మోడీకి ముడిపెట్టరు. పక్కనున్న తెలంగాణలో ఏం జరిగినా కేసీఆర్ కు ముడిపెట్టరు. అంతెందుకు హైదరాబాద్ శివార్లలో రోడ్లు ఎంత అధ్వాన్నంగా వున్నా ప్రభుత్వాన్ని నిలదీయరు. కనీసం ఓ వార్త కూడా వండి వార్చరు. కానీ ఆంధ్రలో ఏం జరిగినా, ఎక్కడ చీమ చిటుక్కుమన్నా జగన్ దే బాధ్యత. గమ్మత్తేమిటంటే ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినపుడు అధికారులను టార్గెట్ చేస్తూ వార్తలు రాసేవారు. లేదంటే మొత్తం వార్తకే ముసుకు వేసేవారు.
ఈ రోజు అద్భుతమైన వార్తను వండారు. ఆంధ్రలో వందలు, వేల కోట్లు ఆదాయం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల మీద వస్తోంది. కానీ ఏ ఒక్క రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా కనీస సదుపాయాలు లేవు. కూర్చోడానికి బెంచీలు లేవు. బాత్ రూమ్ లు లేవు అంటూ. నిజమే. ఇది నిజంగా నిజమే. కానీ ఇదంతా జగన్ నిర్వాకమే. అస్సలు పట్టించుకోవడం లేదు అంటూ రాసుకొచ్చారు.
ఇప్పుడు రాష్ట్రంలో వున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏవీ కొత్తగా ఈ నాలుగేళ్లలో పుట్టుకురాలేదు. దాదాపు పాతికేళ్లుగా ఎక్కడ వున్నాయో అక్కడే వున్నాయి. ఏ ఒక్కటో రెండో తప్ప 90శాతం మారలేదు.
ఎన్టీఆర్ పాలన చూసాయి. కాంగ్రెస్ జమానా చూసాయి. చంద్రబాబు ఆడ్మినిస్ట్రేషన్ ను గమనించాయి. ఇప్పుడు జగన్ దగ్గరకు వచ్చాయి.
రిజిస్ట్రేషన్ల మీద వందలు, వేల కోట్ల ఆదాయం నాడూ వుంది నేడూ వుంది.
మరి సదుపాయాలు లేవు అని ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అది కూడా జగన్ కారణంగానే అని ఇప్పుడు తెలిసిందే. ఎన్టీఆర్ కాదు, వైఎస్సార్ కాదు, చంద్రబాబు కానే కాదు. కేవలం జగన్ మాత్రమే ఈ పరిస్థితి కి కారణం
ఎంత దారుణం.
ఓ లీడర్ ను గద్దె దించడానికి, ఆ మనిషి క్యారెక్టర్ ను తగ్గించేయడానికి, ఆ నాయకుడి పాలన అధ్వాన్నమని చెప్పడానికి ఇంత అడ్డకోలుగా వార్తలు వండి వార్చడం అన్నది ఎంత నీచం.
మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇదే తీరుగా వార్తలు వండి వారుస్తారా? ఎక్కడో ఎవరో స్కూటర్ మీద నుంచి పడినా చంద్రబాబుకు ముడి పెట్టగలరా?
చాలా దారుణమైన మీడియాస్వామ్యం నడుస్తోంది ఆంధ్రలో. కాంగ్రెస్ హయాంలో, జగన్ పాలనలోనే ఇలాంటి వ్యవహారం. తెలుగుదేశం పాలనలో అస్సలు వుండదు. జనం అన్నీ గమనించాల్సిన అవసరం వుంది.