తెలుగు సినిమా.. వెళ్ళలేక ఉండలేక.!

సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చినట్టుగా తయారైంది తెలుగు సినిమా పరిస్థితి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనకు గురయ్యాక తెలుగు సినిమా భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ‘రాష్ట్రం విడిపోతే ఏమవుతుంది.. తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటాయి.. తెలుగు…

సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చినట్టుగా తయారైంది తెలుగు సినిమా పరిస్థితి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనకు గురయ్యాక తెలుగు సినిమా భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ‘రాష్ట్రం విడిపోతే ఏమవుతుంది.. తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటాయి.. తెలుగు సినిమా రెండు రాష్ట్రాల్లోనూ ఆడేస్తుంది..’ అనుకున్నవారికి ఇప్పుడు అసలు ‘బొమ్మ’ కనబడ్తోంది.. ఆ బొమ్మ పడేసరికి, దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోంది. అదే విభజన బొమ్మ.

తెలుగు సినిమాని విభజించాలనీ, తెలంగాణ సినిమా – తెలుగు సినిమా అనేవి వుండాలన్నది తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరి వాదన. తెలుగు సినిమాపై పెత్తనమంతా అతి కొద్దిమందిదేనంటూ చాలాకాలంగా విమర్శలు విన్పిస్తున్న విషయం విదితమే. ఆ వివాదంలోంచే కొందరు, వేరు కుంపటి కోసం చాన్నాళ్ళ క్రితమే ప్రయత్నించారు. వారికిప్పుడు ఉమ్మడి రాష్ట్రం విభజన కావడం కొత్త బలాన్నిచ్చింది.

ఆ నాలుగు కుటుంబాలు.. అనండీ, ఇంకేదన్నా అనండి.. తెలుగు సినిమాపై కొందరి పెత్తనం సాగుతోందన్నది నిర్వివాదాంశమంటారు తెలుగు సినిమా పరిశ్రమలోనే చాలామంది. అదే.. ఆ రచ్చే ఇప్పుడు తెలుగు సినిమా విభజనకు బలమైన కారణం కాబోతోంది. ఇక తప్పదు, తెలుగు సినిమా విడపోవాల్సిందేననే పరిస్థితులు దాపురించాయి. కానీ, విభజనకు చాలామంది ఒప్పుకోవడంలేదు సినీ పరిశ్రమలో. వారి ఒప్పుకోవడం, ఒప్పుకోవడంతో సంబంధం లేని పరిస్థితి ఇప్పుడుంది.

సాంకేతికంగా విడిపోయినాసరే తెలంగాణ సినిమా, తెలుగు సినిమా హైద్రాబాద్‌లోనే వుంటాయని కొందరు అభిప్రాయపడ్తున్నా, కొంతకాలం వరకూ ఏమోగానీ, ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా రెండూ ఒకే చోట మనుగడ సాధించలేవన్న అభిప్రాయాలు ప్రముఖంగా.. చాలా ఎక్కువగా విన్పిస్తున్నాయి. తెలుగు సినిమా విశాఖకు వస్తే తగిన సౌకర్యాలు కల్పిస్తాం.. అంటూ గతంలోనే కొందరు విశాఖ ప్రజా ప్రతినిథులు వ్యాఖ్యానించారు. అది గతం, ఇప్పుడైతే అలాంటి వ్యాఖ్యలు చేయడానికీ ఎవరూ సాహసించడంలేదు. ఇప్పుడు గనక ఎవరన్నా అలా అంటే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భరోసా ఇస్తే, తెలుగు సినిమాలో చాలా భాగం సాంకేతికంగా అక్కడికి తరలిపోవచ్చు.

కానీ, ఇక్కడ ఓ చిక్కు వుంది. చెన్నయ్‌ నుంచి హైద్రాబాద్‌కి తెలుగు సినిమా వచ్చాక, తెలుగు సినీ జనం హైద్రాబాద్‌లో ఆస్తుల్ని కూడబెట్టుకున్నారు. ‘సినిమా వ్యాపారమెక్కడుంది.. అంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో వచ్చింది తప్ప..’ అని సినీ వర్గాల్లో ఆఫ్‌ ది రికార్డ్‌ ఓ అభిప్రాయం బలంగా వుందంటే, పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవాల్సిందే. ఓ పక్క తెలంగాణ సర్కార్‌, భూముల్ని లాక్కోవడం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివాదాస్పద భూములన్నిటిపైనా తెలంగాణ సర్కార్‌ కన్నేసింది.

గడచిన పది, పదిహేనేళ్ళలో సాధారణ భూములు, ప్రభుత్వ భూములు కూడా వివాదాల్లో ఇరుక్కుపోయాయి. అలా వివిధ రంగాలవారు ఆయా వివాదాల్లో వున్న భూముల్ని ఎలాగైతే సొంతం చేసుకున్నారో సినీ జనం కూడా అంతే. అదే ఇప్పుడు సినీ జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే నాగార్జున ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్‌ వివాదంతో తలపట్టుక్కూర్చున్నారు. చాలామంది భవిష్యత్తులో ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

ఓ పక్క సినీ పరిశ్రమలో విభజన, తద్వారా తలెత్తబోయే సమస్యల్ని ఊహించుకోవడంతోపాటు, భూముల వ్యవహారంలో ఇబ్బందుల్ని అంచనా వేసి, ఇలాగైతే హైద్రాబాద్‌లో కష్టం.. అనే అభిప్రాయానికి చాలామంది వచ్చేస్తున్నారు. కానీ ‘ఇప్పటికిప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి ఏమీ చేయలేం కదా..’ అనే వాదన కూడా వారిలో ఎక్కువగానే విన్పిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, వుండలేక.. వెళ్ళలేక.. తెలుగు సినిమా పరిశ్రమ సతమతమవుతోంది. కొత్త రాష్ట్రంలో రాజధాని అంటూ ఖరారైతే.. కొంతమేర సినీ పరిశ్రమకు కూడా ఊరట కలగొచ్చేమో.!