దినదినం బలపడుతున్న మావోయిస్టులను అణచడానికి ప్రస్తుతం వున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు (సిఆర్పిఎఫ్) సరిపోదని, వారిలో మెరికల్లాటి 10 వేల మందిని ఏరి, మావోయిస్టులు నివసించే అడవుల్లోకి పంపి వాళ్ల స్థావరాల్లోనే వారిని మట్టుపెట్టేట్లా ఒక దళాన్ని ఏర్పరచాలని వచ్చిన సూచనను 2008 సెప్టెంబరు 12 న కేంద్ర హోం శాఖ ఆమోదించింది. ఆ దళానికి కోబ్రా (కమాండో బెటాలియన్స్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) అని పేరు పెట్టారు. మావోయిస్టులు సాధారణంగా అడవుల్లో వుంటారు. మామూలు పోలీసులకు అడవులు, వాటిలో దారులు, అక్కడి జీవనవిధానం కొత్త. అందుకే గుంపులుగుంపులుగా వెళుతూ వుంటారు. వారి రాక ముందుగానే తెలిసిపోవడం చేత మావోయిస్టులు వారిని ల్యాండ్ మైన్లాటిది పెట్టి చంపేస్తూ వుంటారు. ఈ సమస్యను అధిగమించాలంటే అడవులను కక్షుణ్ణంగా అర్థం చేసుకున్నవారిని, మావోయిస్టుల దృష్టి ఆకర్షించకుండా చిన్న చిన్న కమాండో దళాలుగా పంపి వారితో పోరాడాలని ఐడియా. అడవులలో పాముల భయం వుంటుంది కాబట్టి ఆ భయం వీరిలో పోగొట్టడానికి పాముల్ని పట్టడం, తినడం కూడా నేర్పాలని ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రే హౌండ్స్ అధిపతిగా మావోయిస్టులను అదుపు చేసిన కె. దుర్గాప్రసాద్గారి ఆధ్వర్యంలోనే కోబ్రా ఏర్పడాలని హోం మంత్రి చిదంబరం నిర్ణయించారు.
ఇంతవరకు బాగానే వుంది కానీ అయిదున్నర ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే ఫలితాలు నిరాశాజనకంగా వున్నాయి. మావోయిస్టులు దేశంలోని అనేక రాష్ట్రాల గుండా రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నారు. దేశవిస్తీర్ణంలో నాలుగో భాగం వున్న ఆ ప్రాంతంపై పట్టు సాధించడమే వారి లక్ష్యం. ఆ కారిడార్‌ను తమ నియంత్రణలో వుంచుకుంటే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వారు సులభంగా మనుష్యులను, ఆయుధాలను తరలించవచ్చు. 2008 నుండి మావోయిస్టులు యిప్పటిదాకా 1204 మంది సెక్యూరిటీ ఆఫీసర్లను హతమార్చారు. 1169 మంది పోలీసు ఇన్ఫార్మర్లను కూడా. కోబ్రాకు సంబంధించిన 27 మంది కమెండోలు వారి చేతిలో చనిపోయారు. కోబ్రాలకు మావోయిస్టుల సమాచారం అందటం లేదు. వారు స్వాధీనం చేసుకున్న ఆయుధాల సంఖ్య, అరెస్టు చేస్తున్న మావోయిస్టుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బలంగా వున్నారు. ఝార్ఖండ్‌లో యిప్పటిదాకా జరగనంత హింస జరుగుతోంది. గత రెండేళ్లలో 863 నక్సల్ దాడులు జరిగాయి. 254 మంది సాధారణ ప్రజలు, 59 మంది సెక్యూరిటీ పర్శనల్ మరణించగా ఎదురుకాల్పుల్లో కేవలం 19 మంది నక్సల్స్ మరణించారు. ఎందుకీ వైఫల్యం అని తరచి చూస్తే కొన్ని వాస్తవాలు కళ్లకు కడతాయి.
కోబ్రాకు అధిపతిగా నియమించిన దుర్గాప్రసాద్ కోబ్రా హెడ్ ఆఫీసును ఆంధ్రప్రదేశ్‌లో పెడదామన్నారు. ఎందుకంటే ఇలాటి ప్రయోగాలు సఫలం కావాలంటే స్థానిక పోలీసుల సహకారం ఎంతో అవసరం. వారు రహస్యసమాచారం సేకరించి యిస్తేనే యీ దళాలు ముందుకు సాగగలవు. ఆంధ్రప్రదేశ్ చుట్టూ వున్న ప్రాంతాలలోనే మావోయిస్టులు చురుగ్గా వున్నారు. మావోయిస్టు నాయకుల్లో చాలామంది తెలుగువాళ్లే. రహస్య సమాచారం తెప్పించుకోవడం, దానిపై ఒక నిర్ణయం త్వరగా తీసుకుని దాన్ని వేగంగా అడవిలోని దళాలకు చేరవేయడం అత్యంత ముఖ్యమైన పనులు. నిర్ణయాలు తీసుకోవలసినవారు ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే పనులు ఆలస్యమవుతాయి. అవసరమైతే మనిషిని పంపించి సమాచారం దళాలకు అందించాలంటే రెండు, మూడు రోజులు పడుతుంది. అదే కార్యక్షేత్రం మధ్యలో వుంటే ఐదారు గంటలు సరిపోతుంది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా చేసి చూపించింది. ఇలా ఎన్ని కారణాలు చెప్పినా వినకుండా హెడ్ ఆఫీసును ఢిల్లీలో పెట్టారు. కోబ్రా ఆపరేషన్స్ చూడవలసిన అధికారికి ఇన్స్పెక్టర్ జనరల్ హోదా యిచ్చారు. రాష్ట్రాలలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నది – సిఆర్పిఎఫ్ ఐజీలు. వీళ్లు కోబ్రా అజమాయిషీలోకి రారు కాబట్టి, దాని ఐజీని పట్టించుకోరు. పైగా శాంతిభద్రతలు రాష్ట్రప్రభుత్వపు పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర పోలీసులు కేంద్ర పోలీసులతో సమాచారం పంచుకోవాలని లేదు, కలిసి పనిచేయాలని లేదు, నిర్ణయాలు పాటించాలని లేదు, ఎదుటివాళ్లకు ఘనత వస్తుందన్న అనుమానంతో వ్యవహరిస్తూ వుంటారు. ఈ కారణాల వలన కోబ్రా ఐజీ సూచనలు యివ్వగలడు తప్ప వాటిని అమలు చేయాలని శాసించలేడు. అంటే అతను ఒట్టి ఎడ్మినిస్ట్రేటర్గానే మిగులుతున్నాడు.
అడవుల్లో వున్నవాళ్లకు ముఖ్యంగా కావలసినది కమ్యూనికేషన్ సౌకర్యం. ఎవరు ఎక్కడున్నారో తెలుసుకుంటూ వుండాలి. అందువలన హోం శాఖ టెలి కమ్యూనికేషన్స్ శాఖను ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశాలలో జూన్ 2014 కల్లా 2199 సెల్ టవర్లను కట్టమని కోరింది. ఇప్పటిదాకా వాళ్లు కట్టినది 363 టవర్లు మాత్రమే. ఇంటెలిజెన్సు సమాచారం లేనిదే ఎవరూ ఏమీ చేయలేరు. కోబ్రాలో వెయ్యేసి మందితో బెటాలియన్లను తయారుచేసి వారిలో 35 మందిని ఇంటెలిజెన్సు విభాగంలో వుపయోగించుకోమన్నారు. నక్సల్స్ తమలో తాము మాట్లాడుకునేది చాటుగా వినడానికి యింటర్సెప్టర్స్ కావాలని కోబ్రా అడిగింది. కానీ హోం శాఖ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. మీకేమైనా సమాచారం కావాలంటే సెంట్రల్ యింటెలిజెన్సు వాళ్లు యిస్తారులే అంది. రాత్రిపూట అడవుల్లో తిరగాలంటే ఇన్ఫ్రా రెడ్ మోనోక్యులార్స్ కావాలి. వాటికోసం కోబ్రా వాళ్లు అడిగినా యిప్పటిదాకా యివ్వలేదు. ఇలాటి సౌకర్యాలు లేకపోవడం చేత కోబ్రా తన లక్ష్యాలను చేరలేకపోయింది. వీళ్లు ఎక్కడా తమ ప్రభావాన్ని చూపలేకపోయారు.
అది సాకుగా చూపించి కోబ్రాపై ఖర్చు తగ్గించేసింది హోం శాఖ. కోబ్రాలకు ఆక్సిలరీ ట్రైనింగ్ యివ్వడానికి స్కూళ్లు పెట్టాలని సిఆర్పిఆఫ్ డైరక్టర్ జనరల్ కె విజయకుమార్ సూచించారు. సరేనని 16 తెరిచారు. కాలం గడిచే కొద్దీ వాటి సంఖ్యను పెంచకపోగా మూసేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం 8 మంది మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక కోబ్రా దళాలను యితరత్రా కూడా వాడుకోవడం మొదలుపెట్టారు. 2008లో వెయ్యేసి మందితో రెండు కోబ్రా బెటాలియన్లను ఏర్పరచారు. 2009లో 4, 2010 మరో 4 చేర్చారు. వీళ్లను ఒకే చోట కేంద్రీకరించి ఆ రాష్ట్రాన్ని మావోయిస్టు-విముక్తం చేయకుండా 7 రాష్ట్రాలకు వీళ్లని పంచారు. ఝారఖండ్లో, ఛత్తీస్‌గఢ్‌లో యిప్పటివరకు సిఆర్పిఎఫ్ వెళ్లని ప్రాంతాల్లోకి వీళ్లు చొచ్చుకుపోయి మావోయిస్టులను ప్రతిఘటించి, భారతప్రభుత్వ అధికారాన్ని చాటారు. వాళ్లని అక్కడే వుంచకుండా ఢిల్లీ అధినేతలు వాళ్లని వేరేచోటకి తరలించారు. అంతే, మావోయిస్టులు వచ్చి మళ్లీ తమ జండా పాకారు. కోబ్రా విలువ తెలియని వారి అధినేతలు యీ మధ్య ఆసామ్లో గొడవలైతే అక్కడికీ పంపారు. రోడ్లను పెట్రోలింగ్ చేయమన్నారు.
ఇక కోబ్రా తాచుపాములా ఎలా వుండగలుగుతుంది? అందుకే వానపాముగా మారుతోంది
ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)