బాబును వీడని కరవు
గత కాలం పీడ కొనసాగుతున్న వైనం
బాబుంటే ఇంతే అంటున్న స్వామీజీలు
యాంటీ సెంటిమెంట్‌పై విపక్షాల సెటైర్లు
టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడుకు రాజకీయ దురంధరుడని పేరుంది. ప్రత్యర్ధులను సైతం నిస్సహాయులను చేస్తూ తాననుకున్నది చేసుకుపోయే తత్వం ఆయనది. ఎదుటివారి బలాన్ని, బలహీనతను సరిగ్గా అంచనా వేసి దెబ్బకొట్టడంలో ఆయనకు ఆయనే సాటి. బాబు వ్యూహం అంటే అది మహాభారతంలో పద్మవ్యూహాన్ని తలపించేదే. దానిని ఛేదించలేని రాజకీయ అభిమన్యులెందరో ఉన్నారు. అటువంటి బాబుకు కొరుకుడు పడని ఒకే ఒక విపక్షం వరుణుడు. బాబు జమానా అంటే వానదేవునికి ఎందుకంత వ్యతిరేకతో అర్ధం కాదు కానీ, ఆయన ఎపుడు వచ్చినా ముఖం చాటేస్తూంటాడు. ఇది సెంటిమెంట్‌గా మారిపోయింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తరువాత ఏప్రిల్ నుంచి ఎండలు మండిపోయాయి. అది చూసిన జనం ఎటువంటి సర్వేలతో నిమిత్తం లేకుండా బాబే సీమాంధ్రకు సీఎం అని తేల్చిచెప్పేశారు.
ఎండలు మండిపోయి వానలు కురవని రోజులు వస్తే అది ఖచ్చితంగా బాబు పాలనే అవుతుందన్న గట్టి నమ్మకమే జనాల చేత అలా పలికించింది. అప్పటికి వైసీపీ జోరు సాగుతోంది. జగన్ సీఎం అంటూ రోజుకొక సర్వే వస్తున్న సందర్బమది. అయినా బాబు అంటే గిట్టని వారు కూడా ఆయనే వచ్చేస్తున్నాడని చమటలు కార్చుకుంటూ అక్కసుగా చెప్పారంటే బాబు పాలన అంటే జనం ఇలా అర్ధం చేసుకున్నారనుకోవాలి. ఇదిలా ఉండగా, అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ ఫలితాలు రావడం, అక్కడ కేంద్రంలో భారీ మెజారిటీతో బీజేపీ గెలవడం, ఇక్కడ సీమాంధ్రలో బాబుకు సంపూర్ణ మెజారిటీ రావడం జరిగిపోయాయి. మే 16న ఫలితాలు వెలువడ్డాయి. అంతకు ముందూ, ఆ తరువాత కూడా ఒక్క చినుకంటే లేదు, పూర్తిగా వర్షాభావ పరిస్థితులు సీమాంధ్రను చుట్టుముట్టాయి.
జూన్ 8న బాబు సీమాంధ్ర సీఎంగా గుంటూరులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజున అయిదుగురు చనిపోయారు, కాకినాడలో అగ్ని ప్రమాదం, దాని తరువాత తెలుగు విద్యార్ధులు హిమచల్‌ప్రదేశ్ బియాస్ నదిలో పడి గల్లంతయిపోయారు. చూస్తూండగానే తూర్పుగోదావరి జిల్లా నగరంలో గ్యాస్ పైప్‌లైన్ లీక్ అయి పాతిక మంది వరకూ చనిపోయారు. చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిపోయి ఉత్తరాంధ్రకు చెందిన వలస కూలీలతో పాటు పదుల సంఖ్యలో శిధిలాల కింద చిక్కి మృత్యువాత పడ్డారు. ఇలా రోజుకొకటిగా దుర్వార్తలతోనే గత నెల రోజులుగా సాగుతోంది. ఇదంతా యాదృచ్చికంగానే సాగినా సెంటిమెంట్‌ను పట్టుకుని వేలాడుతున్న వారే కాదు, విపక్షాలు, చివరికి స్వామీజీలు కూడా బాబు పాలనలో వానలు పడవు, ఇలాంటివే జరుగుతాయని ప్రచారం మొదలుపెట్టేశారు. దీంతో, సెంటిమెంట్‌ను తెగ నమ్మె జనం కూడా నిజం కామోసు అనుకునే స్థితికి వచ్చేస్తున్నారు.
వరుణుడు పగ పట్టాడా…
బాబు తొమ్మిదేళ్ల పాలనలో మంచి పాలనాదక్షునిగా పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం ఆయన హయాంలోనే జరిగింది. సాఫ్ట్‌వేర్ రంగం బాగా వర్ధిల్లింది. అభివృద్ధి సాగింది. ఇవన్నీ నాణేనికి ఓ వైపు అయితే, బాబుకు అపకీర్తిని తెచ్చినది మాత్రం పూర్తిగా కరవు కాటకాలే. బాబు ఏలుబడిలో ఎన్నడూ వర్షాలు సకాలంలో కురియలేదు, సమృద్ధిగా కూడా పడలేదు. దీనివల్లనే బాబుకు రావాల్సినంత చెడ్డపేరు వచ్చింది. ఫలితంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, వ్యతిరేకత పెచ్చరిల్లడం, 2004 నాటికి బాబు కుర్చీ దిగిపోయే పరిస్థితులను తీసుకువచ్చాయి. ఇపుడు పదేళ్ల తరువాత బాబు తిరిగి అధికారంలోకి వచ్చారు. ఇపుడు కూడా అటువంటి స్థితే దాపురించింది. నైరుతి రుతు పవనాలు మందగించడం, జూన్ నాటికి కేరళ తీరం తాకినా ఆంధ్రపై కన్ను పడకపోవడం, నెల రోజుల వ్యవధిలో పట్టుమని నాలుగు చినుకులు కూడా కురియకపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు.
ఇపుడు జూలై నడుస్తోంది. మిగిలిన నెలన్నర రోజులలో వానలు పడకపోతే ఖరీఫ్ గతేం కానని రైతులు అపుడే గగ్గోలు పెడుతున్నారు. అలాగే, పట్టణాలలోనే కాదు, గ్రామాలలోనూ జూలై నెల వచ్చినా కూడా వేసవిని మించి ఎండలు కాస్తున్నాయి. ఎక్కడ చూసినా సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వానలు పడితేనే తప్ప వేడి తగ్గదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎలెనెవో ప్రభావం ఉందని, ఈ ఏడాది ఇంతేనని కూడా తేల్చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే వరుణుడు పగ పట్టినట్లే కనిపిస్తోంది. గత ఏడాది జూన్, జూలై నాటికి బాగా పడిన వర్షాలు ఈ ఏడాదే కురవకపోవడమేమిటన్న చర్చ కూడా సాగుతోంది. దీనికి ఎవరికి తోచిన భాష్యం చెబుతూంటే సాధువులు, స్వామీజీలు ఆధ్యాత్మిక పద్ధతులు, ధర్మాలను జోడించి వేరే అర్ధాలు తీస్తున్నారు.
బాబు ఉంటే ఇలాగే ఉంటుంది..
ఈ మాట అన్నది సాక్షాత్తూ విశాఖలోని పెందుర్తి శ్రీ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మహాస్వామి. జూన్ 30న ఆయన నగరంలోని గాజువాక పెదగంట్యాడలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. బాబు ఎపుడు వచ్చినా వెంట కరవు కూడా వస్తుందని స్వామిజీ సిద్ధాంతీకరించారు. తొమ్మిదేళ్ల పాలనను చూపిస్తూ ఆనాడూ కరవే సాగిందని, ఇపుడు కూడా అదే పునరావృత్తమవుతోందని పేర్కొన్నారు. పైగా, బాబు ప్రమాణం చేసిన ముహూర్తంపైన కూడా ఆయన విమర్శ చేశారు. రాత్రి పూట ప్రమాణ స్వీకారం చేయరాదని, అలా చేస్తే దుష్ఫలితాలు వస్తాయని, ఈ కారణంగానే బాబు ప్రమాణ స్వీకారం రోజున అయిదుగురు చనిపోయారని, ఆ తరువాత వరుసగా జరుగుతున్న విపత్తులు కూడా అందులో భాగంగానే చూడాలని పేర్కొన్నారు. దీనిపై పలువురు వేద పండితులు కూడా స్వామీజీ మాటలతో ఏకీభవించారు. రాత్రి పూట అంటే సూర్యుడు అస్తమించిన తరువాత పట్టాభిషేకాలు, ప్రమాణాలు చేయరాదని శాస్త్రం చెబుతోందని కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. దీంతో, స్వామీజీపై విశాఖ జిల్లా టీడీపీ నాయకులు మండిపడడం, మాటలతో దాడి చేయడం కూడా జరిగింది. దీనిపై ఉత్తరాంధ్ర సాధు పరిషత్ కూడా ప్రతి విమర్శలు చేసింది. స్వామీజీపై టీడీపీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండు చేసింది.
మొత్తం మీద స్వామీజీ చేసిన ఈ వ్యాఖ్యలు బాగానే దుమారం రేపాయని చెప్పకతప్పదు.
విపక్షాలు సైతం…
ఇక, విపక్షాలు కూడా కరవు సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని బాబుపై విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కూడా బాబు పాలనలో వర్షాలు పెద్దగా పడవని తేల్చేశారు. పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని సెటైర్లు వేశారు. అదే బాటలో మరో సీపీఐ నేత నారాయణ కూడా బాబు వస్తే వానలు పడవని విమర్శ చేశారు. వైసీపీ, కాంగ్రెస్ ఇలా ఇతర పార్టీలన్నీ కూడా వర్షాలు పడకపోవడాన్ని బాబుతో ముడిపెడుతూ దాడి చేస్తున్నాయి. అయితే, ఇవన్నీ ట్రాష్ అని టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నా వారిలోనూ సెంటిమెంట్ భయం ఉందన్నది బహిరంగ రహస్యం. బాబు వచ్చినపుడే ఇలా జరగడం ఏమిటన్న చర్చ ఇపుడు టీడీపీ శిబిరంలోనూ జోరుగా సాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే ప్రకృతి పరమైన అంశాలపై ఎవరికీ అదుపూ అజమాయిషీ ఉండదు, కానీ, వాటి ప్రభావం మాత్రం పాలకులు అనుభవిస్తూంటారు.
వర్షాలు బాగా పడిన సందర్బంలో వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన చలవ వల్లనే వరుణుడు కరుణించాడని నాడు ప్రశంసలు వచ్చాయి. వరుణుడు కాంగ్రెస్‌కు మిత్రుడని వైఎస్‌ఆర్ పలుమార్లు వ్యాఖ్యానించారు. మరి, ప్రతిపక్షాలకు వరుణడు మిత్రుడైతే టీడీపీకి శత్రువైనట్లేనా.. సరదాగా అన్నా ఈ మాటలు ఇపుడున్న పరిస్థితులను బట్టీ చూస్తే నిజమేననిపిస్తున్నాయి. వర్షాలు బాగా పడితేనే రాజుకు కూడా పేరు వస్తుంది. ఇది పురాణ కాలం నుంచి జరుగుతున్నదే. మారాజు పాలనలో మూడు కాలాలు వానలు నిండారా కురిసాయని చెబుతూంటారు. అంటే, రాజుకు, వానలకూ సంబంధం అన్నది ఇప్పటిది కాదన్నది నిజం. ఆ విడదీయలేని ముడి ఇపుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు చిక్కుముడిగా మారిపోయింది. వానలు సరిగ్గా కురియడం, పోవడం ఆయన చేతులలో లేకపోయినా విమర్శలు మాత్రం నేరుగా ఆయనేక తగులుతున్నాయి. స్వామీజీల నుంచి సాధారణ జనం వరకూ ఇపుడు ఆకాశం వైపు చూస్తూ వెటకారంగా అనుకున్నా, అక్కసుతో చెబుతున్నా వానలు పడడంలేదంటే దానికి కారణం బాబేనని. ఇందులో నిజం లేదన్నది అందరికీ తెలిసినా పాపం.. చంద్రబాబును మాత్రం జనం దృష్టిలో ఇలా నిందలపాలు చేస్తున్న వరుణుడు బాబుకు సిసలైన ప్రతిపక్షం అంటే కాదంటారా…
పివిఎస్‌ఎస్ ప్రసాద్, విశాఖపట్నం.