‘భయో’ డేటా: అమి ‘నాగ్‌’

పేరు        : అక్కినేని నాగార్జున Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: తెలుగు అమితాబ్‌ (బుల్లి తెర వరకూ) ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ కి రీమేక్‌ లాంటి టీవీ షో ‘మీలో కోటీశ్వరుడెవరు?’…

పేరు        : అక్కినేని నాగార్జున

దరఖాస్తు చేయు ఉద్యోగం: తెలుగు అమితాబ్‌ (బుల్లి తెర వరకూ) ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ కి రీమేక్‌ లాంటి టీవీ షో ‘మీలో కోటీశ్వరుడెవరు?’ చేస్తున్నాను కదా! యాంకరింగ్‌ చేస్తున్నాను కదా` అని అమితాబ్‌ లాగా ‘యాంకర్‌’ గెడ్డం పెంచుకోలేదు లెండి.

ముద్దు పేర్లు   : ‘అక్కి’తాబ్‌ , అమి ‘నాగ్‌’.( ఈ షో చేయ చేయగా అందరూ నన్నిలా పిలుస్తారేమో అని అనుమానం గా వుంది కూడా)

‘విద్యార్హతలు   : బి.ఎ (లిట్‌). కంగారు పడకండి. లిట్‌ ` అంటే ‘లిటరేచర్‌’ కాదు, ‘లిటిగేషన్‌’ . లేకపోతే ఎన్‌`కన్వెన్షన్‌ హాలు ను నోటీసు ఇవ్వకుండా కూలగొట్టేద్దామనుకుంటారా? అందుకే కోర్టుకు వెళ్ళాను. అఫ్‌ కోర్స్‌. నాకు కోర్టుక వెళ్ళేటంత టైమ్‌ గవర్నమెంట్‌ ఇచ్చింది అనుకోండి. మిగిలిన వారికి తెలంగాణ సర్కారు ఇచ్చిందో లేదో తెలీదు.

హోదాలు        : తెలుగు నాట ‘కింగ్‌’ అని ఎవరిని పిలుస్తారు? జవాబులు: ఎ) కిరీటం వున్న వ్యక్తిని బి) సింహాసనం వున్న వ్యక్తిని  సి) రాజ్యం వున్న వ్యక్తిని డి) హైదరాబాద్‌లో భూమి వున్న వ్యక్తిని.  ‘డీ’ కరెక్టా? కంప్యూటర్‌ గారూ లాక్‌ చెయ్యండి. ఎస్‌ సరయిన జవాబు చెప్పారు. అయితే ఈ జవాబుల్తో సంబంధంలేకుండా కూడా నన్ను ‘కింగ్‌’ అని పిలుస్తారు. అది వేరే విషయం.

గుర్తింపు చిహ్నాలు    :ఒకటి: అందరూ సినిమాల్లోంచి రాజకీయాల్లోకి రావాలను కుంటారు. నేను  వ్యాపారంలోకి రావాలనుకుంటాను. వచ్చాను.
                            రెండు: నాన్న భక్తుడు కాడు, అయినా భక్తి చిత్రాల్లో వేశారు. నేను నాన్న భక్తుణ్ణి. కాబట్టి  ఆ వేషాలు కొనసాగించాను.

సిధ్ధాంతం   :  నాన్న గారిదీ నాదీ ఒక్కటే సిధ్ధాంతం: కుటుంబమే సమాజం (‘మనమే’ జనం)

వృత్తి        :  చెరువుల్ని పూడ్చటం, భూముల్ని ఆక్రమించటం నా వృత్తీ కాదు,  నా ‘కన్వెన్షనూ’ కాదు.

హాబీలు     :1. ఎయిడ్స్‌ నివారణ, లోక్‌ సత్తా కు ఊతం ఇలాంటి ప్రకటనల్లో ఉచితంగా నటించటం.
                2. అప్పుడప్పుడూ అమల హాబీలను ‘జంతువులను పెంచటం, రెడ్‌ క్రాస్‌ సేవ’ ఇలాంటివి కూడా నా హాబీలుగా స్వీకరిస్తాను.

అనుభవం    : అందరికీ అన్నీ నప్పవు.  నాన్న చేతికి ‘గ్లాసు’ (దేవదాసు), నా చేతికి ‘ సైకిల్‌ చైను’ 

మిత్రులు      : ఉండరు. ఉంటే భక్తులు వుంటారు. అభిమానులు వుంటారు. ( నాన్న గారి తర్వాత నేను కూడా దేవుడి పాత్రలు వేశాను కదా!)

శత్రువులు     : నాకు సినిమాల్లో విలన్లు వుంటారు కానీ, జీవితంలో వుండరు. వారిని అలా మార్చేసుకుంటాను.

మిత్రశత్రువులు: నా ప్రయివేటు జీవితంలోకి వచ్చే పబ్లిక్‌ వ్యక్తులు.

వేదాంతం        :‘కోటు’ వున్నవాడెల్లా కోటీశ్వరుడు కాడు. లేకుంటే ‘యాంకర్‌’ లంతా కోటీశ్వరులయి పోయేవారు.

జీవిత ధ్యేయం  : ‘కూటి’కి లేని వారిని ‘కోటీశ్వరుల్ని’ చెయ్యటం. కాకుంటే వారు లక్షల ఖర్చు పెట్టి జనరల్‌ నాలెడ్జ్‌ కోచింగ్‌ తీసుకోవాలి, వేలు ఖర్చు పెట్టి జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలు కొనుక్కోవాలి. అంతేనా ‘కంప్యూటర్‌ గారూ’?

-సర్‌