''మిస్సమ్మ'' సినిమాలో యీ ఘట్టం గుర్తుకు వస్తే నవ్వొస్తుంది. కానీ దాన్ని నిజజీవితంలో కెసియార్ అమలు చేస్తూ వుంటే ఏడుపొస్తోంది. ఆ సినిమాలో సావిత్రి రేలంగిని అడ్డుగా నిలబడమంటే అతను గొడుగు పట్టుకుని ఒకరి చూపు మరొకరిపై పడకుండా కాపు కాస్తాడు. ఇప్పుడు కెసియార్ సెక్రటేరియట్‌లో ముళ్ల కంచె కట్టేశారు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కూడా ముళ్లకంచె వున్నట్టు లేదు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదన వినిపించడానికి బెర్లిన్ గోడ శకలాన్ని తీసుకుని వస్తే 'ఎక్కడో బెర్లిన్..' అంటూ వెక్కిరించారు. ఇప్పుడు యీ ముళ్లకంచె వైరు చూపించి, సమైక్యంగా లేకపోతే ఎంతటి అనర్థం జరుగుతోందో చూపించవచ్చు. విడిపోయాక నిత్యం ఘర్షణే. ప్రతీదీ పంచాయితీ చేయడం, ఢిల్లీకి వెళ్లి పితూరీలు చేయడం, వాళ్లు హెడ్మాస్టర్లలా 'ఏమిటీ అల్లరి పిల్లల వెధవగోల' అన్నట్టు మనకు ప్రైవేటు చెప్పడం..! తెలుగువాళ్ల బతుకు హీనమై పోయింది.
ఒప్పందాలు కాలరాస్తూ వుంటే ఎలా?
రచ్చ చేసినా కాస్త తగ్గడం కూడా నేర్చుకోవాలి. విద్యుత్ సంక్షోభం నివారించడానికి చంద్రబాబు పిపిఏల రద్దు కోసం ప్రయత్నించారు. 'విభజన ఒప్పందంలో వున్న అంగీకరించిన అంశాలపై వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయకండి' అని ఢిల్లీ పెద్దలు బాబుకి చెప్పి వుంటారు. తిరిగి వచ్చాక బాబు దాని గురించి మాట్లాడడం మానేశారు. దానికి బదులుగా గ్రామవిద్యుదీకరణ హామీ పొంది వచ్చారు. కెసియార్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఆయనకూ వాళ్లు యిదే సలహా యిచ్చివుంటారు. కానీ ఆయన వినటం లేదు. పోలవరం ఆర్డినెన్సుపై రగడ కొనసాగిస్తున్నారు. అగ్రిమెంటు తిరగతోడడం అంటూ మొదలెడితే అది ఎక్కడకు వెళ్లి ఆగుతుందో తెలియదు. ఎల్ అండ్ టితో చేసుకున్న అగ్రిమెంటు ఏకపక్షంగా ఎలా మార్చగలరు? అది ప్రభుత్వం విశ్వసనీయతకు సంబంధించిన అంశం. కొత్త పార్టీ ప్రభుత్వం మారినప్పుడల్లా పాత ఒప్పందాలు తోసిరాజంటూ వుంటే ఏ కంపెనీ ఏ ప్రభుత్వంతో వ్యాపారం చేయదు. ప్రభుత్వం శాశ్వతం. వ్యక్తులు తాత్కాలికం.
అక్రమ కట్టడాల కూల్చివేత కెసియార్ పెద్దయెత్తున ప్రారంభించారు. దీన్ని చిత్తశుద్ధితో కొనసాగిస్తే యిది ఎంతో మంచికి దారితీస్తుంది. మన రాష్ట్రాలలో ప్రభుత్వం అన్నా, రూల్సన్నా నిర్లక్ష్యం పెరిగిపోయింది. 'ఏం చేసినా ఏమీ కాదు, మహా అయితే ఐదు, పదేళ్ల తర్వాత జరిమానా వేస్తారు, కట్టిపడేద్దాం' అనే ధోరణే జనాల్లో వుంది. నియమాలను పాలించేవాణ్ని వెర్రివాడిగా చూస్తున్నారు. ఈ విధంగా నియమనిబంధనల పట్ల భయం, భక్తి కలిగించడం ఎంతో అవసరం. నిర్మాణాలపై సుప్రీం కోర్టు యిచ్చిన స్టేను బేఖాతరు చేసి కట్టేస్తున్న యిళ్లను కూల్చేశారు, ఆక్షేపణ లేదు. కానీ పూర్వప్రభుత్వం నుండి అనుమతులు తెచ్చుకుని, స్టాంపు డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకుని, విద్యుత్ సౌకర్యం, నీటి కనక్షన్ తెచ్చుకున్న యిళ్లపై దాడిని ఎలా సమర్థించుకోగలరు? ఇది అక్రమం అంటే ఆ అక్రమాన్ని సక్రమం చేసిన ప్రభుత్వాధికారులను కూడా దండించాలి. వారికీ జరిమానాలు వేయాలి. జైళ్లకు పంపాలి. కార్పోరేషన్ నుండి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్టు తెచ్చుకోకుండానే కరంటు కనక్షన్ తీసుకున్నారు కాబట్టి మూడింతల రేటు అంటున్నారు. ఆ సర్టిఫికెట్టు లేకుండా విద్యుత్ బోర్డు కనక్షన్ ఎలా యిచ్చిందో అది తేల్చాలి. వాళ్లేమీ కరంటు దొంగతనంగా పట్టుకుపోలేదే!
పాతబస్తీలోనూ కూలుస్తారా?
'ఇవన్నీ పాతప్రభుత్వపు నేరాలు, మాకు సంబంధం లేదు' అని యిప్పటి ప్రభుత్వం అనలేదు. పాతప్రభుత్వాలు కట్టి యిచ్చిన ఐఐటిలు, ఓఆర్‌ఆర్‌లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులూ చూపించి 'మాది విశ్వనగరం, రండి యిక్కడ పెట్టుబడులు పెట్టి మా ఆదాయం పెంచండి' అని అడుగుతున్నారు కదా! ఇవన్నీ కట్టి యివ్వడంతోబాటు పాతప్రభుత్వపు పాతకాలు కూడా వెంటనంటి వస్తాయి. అలా కుదరదంటే యివాళ మీరు రెగ్యులరైజ్ చేసి డబ్బు వసూలు చేసిన కట్టడాలకు రేపు మీ తర్వాత వచ్చే ప్రభుత్వం తోసిరాజంటుంది. కూల్చేస్తానని బెదిరిస్తుంది. ప్రస్తుతం కూల్చివేత గురుకుల్ ట్రస్టు భూములతో, ఎన్‌కన్వెన్షన్‌తో ప్రారంభమైంది. అక్కణ్నుంచి హఠాత్తుగా మియాపూర్‌కి వెళ్లింది. ఇలా సెలక్టివ్‌గా వెళ్లడంలో ఏదైనా స్కీము వుందేమో తెలియదు. ఆరోపణలు అనేకమందిపై వున్నాయి. పద్మాలయా స్టూడియో, రాఘవేంద్రరావు సినిమా కాంప్లెక్స్, అన్నపూర్ణ స్టూడియో, కంట్రీ క్లబ్… యిలా పెద్ద వాళ్లందరిపై యిలాటి అభియోగాలున్నాయి. వాళ్లందరిపై కూడా వెళ్లినప్పుడే కెసియార్ చిత్తశుద్ధి మనకు అర్థమవుతుంది. అన్నిటినీ మించి పాతబస్తీలో రోడ్లకు రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని కళ్లకు కనబడుతూనే వుంటుంది. వారిపై కూడా చర్య తీసుకున్నపుడే తెరాసకు ఖ్యాతి దక్కుతుంది. నియమాలు అందరికీ ఒకేలా వర్తింపచేయకుండా ఒక వర్గం వారు ఎక్కువగా వున్న ప్రాంతాలపైనే తడాఖా చూపిస్తూ పోతే ప్రజల్ని చీల్చినట్లే అవుతుంది.
ఆ సంకేతం బలపడితే ఆ వర్గం వారందరూ సంఘటితమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయ నారంభిస్తారు. ప్రచారం సాగిస్తారు. ఈ కూల్చివేతల పర్యవసానం రియల్ ఎస్టేటు రంగంపై పడింది. వీళ్లపై కొరడా ఝళిపించిన తెరాస ప్రభుత్వం రాత్రికి రాత్రి బస్తాకు రూ.100 పెంచేసిన సిమెంటు కంపెనీలను ఎందుకు అదుపు చేయలేకపోయిందో తెలియదు. సిమెంటు ధర యిలా పెరిగిపోయింది. ఇసుక పరరాష్ట్రం నుండి రావాలి, అక్కడి ప్రభుత్వం ఇసుక సిండికేటుపై నిఘా వేస్తున్నారంటున్న వార్తల వలన యిసుక ధర పెరిగింది. స్టీలు ధర పెరిగింది. నిర్మాణవ్యయం యిలా పెరుగుతూంటే కొనేవాళ్లు వెనకడుగు వేస్తున్నారు. ఈ కరంటు కోతలు చూస్తూంటే హైదరాబాదు భవితవ్యం ఎలా వుంటుందో తెలియటం లేదు. బిల్డర్లు చూపించే అనుమతులు నిజమైనవో కావో తెలియవు. ఈ ప్రభుత్వం యిచ్చిన ఎగ్జంప్షన్, తర్వాతి ప్రభుత్వం ఔనంటుందో కాదంటుందో తెలియదు. నిజాం కాలం నుండి రికార్డులు తవ్వి తీస్తామని డిప్యూటీ సిఎం అంటున్నారు. ఇలాటి పరిస్థితుల్లో ఏ స్థలం టైటిల్ నికార్సో ఏది బోగస్సో తెలియదు. ఇక యిళ్లు, ఎపార్టుమెంట్లు కొనడానికి ఎవరు ముందుకు వస్తారు? అందుకే రియల్ ఎస్టేటు రంగం వాళ్లు బెంబేలెత్తుతున్నారు. ఆ రంగంలో పనిచేసే కార్మికులు వేరే ఉపాధులు, వేరే చోట ఉపాధులు వెతుక్కోవలసిన అవసరం కనబడుతోంది.
సెక్రటేరియట్‌లోనే కాదు, సమాజంలోనూ కంచెలు
సెక్రటేరియట్‌లో వేసిన కంచె ఆంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఏర్పాటు చేసినది. కానీ కెసియార్ మరో రకమైన కంచెను తన తెలంగాణ ప్రజల మధ్యనే వేయడానికి చూస్తున్నారు. స్థానికులు, స్థానికేతరులు అనే చీలిక తెస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైన దగ్గర్నుంచి యీ ప్రశ్న నేను పదేపదే వేస్తూ వచ్చాను – ఎవరు తెలంగాణ? ఎవరు కాదు? అని. ఆశ్చర్యకరంగా ఏ పాత్రికేయుడూ యీ ప్రశ్న ఆ నాయకులను వేయలేదు. వాళ్లు కాస్సేపు తెలంగాణలో వున్నవాళ్లందరూ తెలంగాణవారే, మా సోదరులే అంటూ వచ్చారు. మరి కాస్సేపు 'ఆంధ్రోళ్ల పిల్లలు తెలంగాణ వాళ్లెట్లవుతారు? ఇక్కడే పుట్టినా, యిక్కడే చదివినా, యిక్కడే పెళ్లాడి, యిక్కడే ఉద్యోగం చేసి, యిక్కడే చచ్చినా.. ఆంద్రోళ్ల పిల్లలు ఆంద్రోళ్లే అవుతారు తప్ప మా వాళ్లు కారు' అని కూడా వాదించారు. ప్రత్యేకరాష్ట్రం యిస్తామని సోనియా ప్రకటించిన దగ్గర్నుంచి కెసియార్ 'కడుపులో పెట్టుకుంటా' అనడం సాగించారు. ఇప్పుడు కడుపులో కాదు కదా, కాళ్ల దగ్గర కూడా స్థానం యివ్వం అంటున్నారు. ఇప్పటిదాకా విద్యావకాశాల్లో స్థానికులు అంటే ఏడేళ్ల కాలంలో బ్రేక్స్‌తో నాలుగేళ్లు చదివినా, లేక నాలుగేళ్లు వరుసగా చదివినా స్థానికులు అవుతున్నారు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ రూలు మార్చేస్తానంటోంది. దాని ప్రకారం తెలంగాణలో పుట్టి, చదువుకున్న అనేకమంది స్థానికులు కాకుండా పోతారు. నాలుగేళ్ల రూలు కారణంగా వీళ్లు ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్థానికేతరులు అవుతారు. విభజన ఒప్పందంలో విద్యావకాశాల్లో పదేళ్లపాటు యథాతథస్థితి కొనసాగుతుంది అని ఒప్పుకున్నపుడు మధ్యలో యిలా రూల్సు మారిస్తే ఎలా? ఇదీ ఒప్పంద ఉల్లంఘనే! స్థానికత నిర్వచన మార్చదలిస్తే యీ లింకు తెగిపోయిన తర్వాత మార్చాలి. ఈ స్థానికత రూలును మొదట ఫీజు రియంబర్స్ చేయవలసిన విద్యార్థులకు అప్లయి చేసి చూడాలనుకుంటున్నారు. ఆ తర్వాత దాన్ని రాష్ట్ర సర్వీసు కమిషన్ ద్వారా యిచ్చే ఉద్యోగాలకు కూడా అమలు చేద్దామనుకుంటున్నారు. ఒకచోట అమలయిన తర్వాత ఎల్లెడలా యికపై అదే అమలు చేయాలని డిమాండ్ వస్తుంది. ప్రభుత్వం తరఫున నిర్వహించే పథకాలు కూడా స్థానికులకే అమలు చేస్తాం అంటూ పేదలకు యిళ్లస్థలాలు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, జర్నలిస్టులకు యిళ్లు, కళాకారులకు స్కాలర్‌షిప్పులు.. యిలా అన్ని రంగాలలో యిదే అమలు చేయాలని కోరడం తథ్యం. అలా అయితే కాంపిటీషన్ తగ్గిపోతుంది కదా. ప్రయివేటు వుద్యోగాలలో కూడా యిదే ప్రాతిపదికపై స్థానికులకు ఉద్యోగాలు యివ్వాలి అన్నపుడు పారిశ్రామికవేత్తలకు గొంతులో పచ్చివెలక్కాయ పడుతుంది.
'1956కి ముందు నివాసం వున్నవారే స్థానికులు'
ఇంతకీ స్థానికతకు రూలేమిటి? ఇప్పటిదాకా తేల్చలేదు. వచ్చిన ప్రతిపాదన న్యాయసమ్మతం అవునా కాదా అన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. తర్వాత కోర్టు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్కీము ఎనౌన్సు చేసేస్తే రాజకీయప్రయోజనం సిద్ధిస్తుంది అనే ఆలోచనతో దాన్ని పేపర్లకు లీక్ చేయడం కూడా జరిగింది. ఆ లీకు ప్రకారం 1956కు ముందు తెలంగాణలో స్థిరపడినవారు, వారి సంతానం మాత్రమే స్థానికులు. తక్కినవారందరూ స్థానికేతరులే. ఇది వినడానికే వింతగా వుంది. శివసేనకు కూడా యిలాటి ఆలోచన రాలేదు. ఝార్‌ఖండ్‌లో యిలాటి రూలు పెట్టారని 1942 ముందు నివాసం వున్నవారినే స్థానికు లన్నారని యీ 1956 ప్రతిపాదన తెచ్చిన అధికారులు వాదించారని పేపర్లలో వచ్చింది. 1956 కైతే ఒక అర్థం కనబడుతోంది. 1942కి ఏముందో నాకు తెలియదు. క్విట్ ఇండియాకు లింకు పెట్టారా? ఇంటర్నెట్‌లోకి వెళ్లి పరీక్షార్థుల విషయంలో యీ అంకెలే కనబడలేదు. 'భారతపౌరుడై వుండాలి, ఝార్‌ఖండ్‌లో శాశ్వతంగా కాని, తాత్కాలికంగా కానీ నివాసముంటూ వుండాలి' అనే వుంది. మరి యీ 1942 ఎక్కణ్నుంచో వచ్చిందో తెలియటం లేదు. పాఠకుల్లో ఝార్‌ఖండ్ నివాసి ఎవరైనా వుంటే వారు చెపితే తెలుసుకుందాం. ఇప్పుడీ 1956 రూలు న్యాయసమ్మతం అవునో కాదో కోర్టువారు ఎలాగూ చెప్తారు. ఈ లోపున దీన్ని అమలు చేయడంలోని సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుందాం.
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు ఆంధ్ర జనాభా 205.08 లక్షలు కాగా, తెలంగాణ జనాభా 107.61 లక్షలు. ఉమ్మడి రాష్ట్రపు జనాభా 1956 నుండి 2011 నాటికి 271% పెరిగింది. ఆ లెక్కన తెలంగాణ జనాభా 2011 నాటికి 291 లక్షలవుతుంది. తెరాస ప్రభుత్వపు నిర్వచనం ప్రకారం వీళ్లు మాత్రమే తెలంగాణవాళ్లు. తక్కినవాళ్లందరూ తెలంగాణేతరులే. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ జనాభా 351.94 లక్షలు. అంటే అప్పటికే సుమారు 62 లక్షలమంది తెలంగాణేతరులు వున్నారన్నమాట. మూడేళ్లలో యింకా పెరిగివుంటారు. ఎలా చూసినా మొత్తం జనాభాలో వీరిది 17.61%. ఇంతమంది తెరాస దృష్టిలో తమ పౌరులు కారు. వారి వద్ద నుండి రాష్ట్రస్థాయి పన్నులు తీసుకోవచ్చు, వారిని చూపించి, వారి ఆదాయంలో కేంద్రం నుండి వాటా అడగవచ్చు. కానీ వారు రాష్ట్రప్రభుత్వం నుండి ఏ సహాయమూ ఆశించరాదు. ఇలా స్థానికులకు, వీరికి మధ్య కెసియార్ కంచె కట్టేశారు. దాదాపు 18% జనాభాను పరాయివాళ్లగా చేశారు. ఇలా వేర్పడినవారిలో శత్రుత్వం, అసూయ రగిలించడం అది సులభమైన పని. ఎందుకంటే వీళ్లు ఏ రాష్ట్రానికీ చెందని త్రిశంకులు. తమకు ఎక్కడా లోకల్ కోటా దక్కలేదన్న నిస్పృహతో వుంటారు వీళ్లు.
నివాసం తేల్చడం ఎలా?
ఇంతకీ సదరు అభ్యర్థి కుటుంబం 1956 నాటికే తెలంగాణలో నివాసం వుండాడని ఎలా తేలుస్తారు? ఆ వ్యక్తికి దాదాపు 60 ఏళ్లు వుంటాయి. అతను బడికి వెళ్లి వుంటే స్కూలు సర్టిఫికెట్టు చూపించి అప్పటి తన అస్తిత్వాన్ని నిరూపించుకోగలడు. అయితే ఆ రోజుల్లో స్కూలుకి వెళ్లిన వారెంతమంది? గణాంకాల ప్రకారం తెలంగాణలో ఆనాడు విద్యావంతులు 10.02 లక్షల మంది. అంటే జనాభాలో 10% కంటె తక్కువ. 90% మంది స్కూలుకే వెళ్లనపుడు యిక సర్టిఫికెట్లు ఎలా చూపగలరు? పైగా ఆ 10%లో కూడా వీధిబడుల్లో చదివినవారే అధికశాతం. తన ప్రజలు చదువుకుంటే తిరగబడతారని నిజాం ప్రభువుకి భయం. అందుకే స్కూళ్లు పెట్టలేదు. వీధి బడులు రికార్డులు మేన్‌టేన్ చేయలేవు కాబట్టి యీ విద్యావంతుల్లో చాలామంది టిసిలు చూపించలేరు. తీసుకున్నా ఎవరూ దాచుకోరు. ఎవరైనా ఎచ్‌ఎస్‌సి వరకు చేరి వుంటే ఆ సర్టిఫికెట్టు దాచుకునే ఆవకాశం వుంది. అలా చూస్తే జనాభాలో 3-4% తప్ప యీ రుజువు చూపించలేరు. ఇక వేరే ఆధారం ఏం చూపించగలరు? ఏమైనా ఆస్తులుంటే వారి పేర రికార్డు అయి వుంటాయి కాబట్టి, దస్తావేజుల్లో వారి విలాసం రాస్తారు కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు. ఆనాటి తెలంగాణలో పేదలు చాలా ఎక్కువ. ధనికులు మరీ ధనికులుగా వుండేవారు. పేదలు మరీ పేదలుగా వుండేవారు. సొంత ఆస్తులున్నవాళ్లు 20% ఐనా వుంటారో వుండరో వూహకందడం లేదు. ఉన్నవాళ్లు మాత్రం స్థానికులుగా నిరూపించుకోవడం సులభం. ఎందుకంటే డిగ్రీ సర్టిఫికెట్టు పారేసుకోవచ్చు కానీ ఆస్తి దస్తావేజు పారేసుకోరు. ఎటొచ్చీ అవి ఉర్దూలో వుంటాయి. అనువాదం చేయించుకోవాలి.
ఉర్దూ అనువాదకులకు గిరాకీ పెరుగుతుంది.
ఇంకో ఆధారం – రేషన్ కార్డులు. అప్పట్లో రేషన్ వుండేదా? ఏమో! ఉన్నా నగరాల్లో వుండేదేమో, పల్లెల్లో వుందనుకోను. ఆ కార్డులు యిప్పటిదాకా ఎవరు దాచిపెడతారు? ఇక మిగిలినది – ఓటర్ల లిస్టు! తెలంగాణలో 1952లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1957లో జరిగాయి. ఏ లిస్టు తీసుకోవాలి? 1952ది తీసుకుంటే తర్వాత నాలుగేళ్లలో వచ్చినవాళ్లు నష్టపోతారు. 1957ది తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వచ్చినవాళ్లు కలిసిపోతారు. అసలు ఆ లిస్టులు వున్నాయా అని చూడాలి. లిస్టులో పేరున్నంత మాత్రాన అది ఫలానా వ్యక్తిది అని నిరూపించడం ఎలా? అప్పట్లో ఫోటోలు లేవు. ఇళ్ల నెంబర్ల బట్టి చూదామంటే ఆ నెంబరింగే మారిపోయింది. ఎన్నో ఏరియాల పేర్లే మారిపోయాయి. ఒకే పేరున్నవాళ్లు అనేకమంది వుండవచ్చు. ఆ లిస్టులో వున్న పేరు నాదే అని ఎవరైనా క్లెయిమ్ చేస్తే కాదు అని ప్రభుత్వం అనగలదా? అది నీదే అని రుజువు చేసుకో అని ప్రభుత్వం అంటే చూపించుకోవడం ఎలా? ఓటరు గుర్తింపు కార్డులు యిచ్చేవారు కాదు కదా!
ఇది మరో ముల్కీ రూలులా మారవచ్చు
అప్పటి నివాసం రుజువు చేసుకున్న కేసుల్లో కూడా ఆడ లేక మగ వ్యక్తి సంతానానికి స్థానికత వర్తిస్తుంది అంటున్నారు. అంటే ఎవరైనా 1956లో చుట్టపుచూపుగా ఓ నెల్లాళ్లపాటు తెలంగాణలో వుండి వెళ్లిపోయినవాడు కూడా లోకలే. 1957 నుండి 57 ఏళ్ల పాటు వున్నా స్థానికుడు కానేరడు. అలా వుండి వెళ్లిపోయిన వారి కూతురు ఆంధ్రలో ఎవరినో పెళ్లి చేసుకుని అక్కడకు తరలిపోయినా, ఆమె సంతానం స్థానికుల కిందే లెక్క. వాళ్లు యించక్కా యిక్కడకు వచ్చి ఫీజు రియంబర్స్‌మెంటులు, ఉద్యోగాలు పొందవచ్చు. తరాలుగా యిక్కడున్నా రుజువు చూపించలేకపోతే వారికి దక్కేది సున్నా.
అమలు చేయబోతే యీ రూలులో వున్న క్లిష్టత బోధపడుతుంది. నా అనుమానం ఏమిటంటే – యిలాటి రూలు పెట్టి చివరకు లోకల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ 'వీరి కుటుంబం నాకు తెలుసు, వీళ్లు తెలంగాణవాళ్లే' అని సర్టిఫికెట్టు యిస్తే చాలు అనే రిలాక్సేషన్ యిస్తారు. దాంతో మొత్తం ఉద్దేశం అటకెక్కుతుంది. రాజకీయంగా ఆ ప్రజాప్రతినిథులకు ప్రాబల్యం పెరుగుతుంది. వారికి నచ్చనివారికి, ఉపయోగపడనివారికి సర్టిఫికెట్టు యివ్వమని బెట్టు చేయవచ్చు కూడా. గతంలో ముల్కీ నిబంధన పెట్టారు. 15 ఏళ్ల నివాసం వున్నవారికే ఉద్యోగాలు అన్నారు. తెలంగాణావాసుల ప్రయోజనాలు కాపాడడానికి పెట్టిన ఆ రూలును తెలంగాణ ఉద్యోగులే, ప్రజాప్రతినిథులే తూట్లు పొడిచారు. లంచాలు పుచ్చుకుని దొంగ ముల్కీ సర్టిఫికెట్లు యిచ్చేవారు. ఇది బహిరంగరహస్యం. మళ్లీ యిప్పుడు అలా జరగదన్న గ్యారంటీ లేదు. అమలు సాధ్యం కాని నియమాలు పెట్టి తెరాస సాధించేదాని కంటె పోగొట్టుకునేదే ఎక్కువ. జనాభాలో 18% మంది ప్రజలను దూరం చేసుకుంటోంది. వారంతా ఓటుబ్యాంకుగా ఏర్పడి గంపగుత్తగా వేరే పార్టీకి ఓటేస్తే వచ్చే ఎన్నికలలో తెరాసకు కష్టం. జాతీయస్థాయిలో యిటువంటి ప్రాంతీయవాదాలను హర్షించరు. ఎందుకంటే తక్కిన రాష్ట్రాల ప్రభుత్వాలపై కూడా 'భూమిపుత్రులకే ఉద్యోగాలు' వంటి ఒత్తిళ్ల్లు వస్తాయి. పదేళ్ల నివాసం, నాలుగేళ్ల చదువు వంటి రూల్సయితే ఫర్వాలేదులే అని వూరుకుంటారు. ఇలా 60 ఏళ్ల నివాసం రూలు పెడితే వాళ్లు ప్రోత్సహించరు. ప్రభుత్వం యిమేజి, పార్టీ యిమేజి దెబ్బ తింటుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)