యుపిఏ ప్రభుత్వ వైఫల్యాలు ఎన్ని వున్నా మన్మోహన్ సింగ్, కపిల్ సిబ్బల్, పురంధరేశ్వరి, పళ్లంరాజు గార్లు భారతీయ విద్యాసంస్థల ప్రమాణాలు పెంచడానికి ప్రణాళికలు రచించారని, కొన్ని అమలు చేశారని ఒప్పుకోక తప్పదు. మోదీ ప్రభుత్వం వాటిని మెరుగుపరుస్తుందేమోనని భావించవచ్చు కానీ అధికారంలోకి వస్తూనే ఆ పథకాలను తిరగతోడుతూంటే ఆశ్చర్యపడకుండా వుండలేం. మన దగ్గర డిగ్రీలు పొందుతున్నవారిలో చాలామందికి ఉద్యోగార్హత లేదనడం కఠోరవాస్తవం. ఇంజనీర్లలోనే 47% మందికి ఎంప్లాయబిలిటీ లేదని తేలింది. ఇక తక్కిన డిగ్రీల సంగతి చెప్పాలా? చదువు చెప్పే తరుణంలోనే నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలనే తపన కొందరు విద్యావేత్తలలో బయలుదేరింది. మన వద్ద 1986 నుండి 10 ప్లస్ 2 ప్లస్ 3 సిస్టమ్ వుంది. అంటే పోస్టు గ్రాజువేషన్కి వెళ్లాలంటే 15 ఏళ్ల చదువు సరిపోతుంది. అయితే ఆ పోస్టు గ్రాజువేషన్ విదేశాల్లో చేయాలంటే 16 ఏళ్ల చదువు కావాలి. ఉన్నతవిద్యకు విదేశాలకు వెళ్లేవాళ్లు యిబ్బంది పడకుండా కొత్తరకమైన కోర్సు తయారుచేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ దినేశ్ సింగ్ 2010లో కసరత్తు మొదలుపెట్టారు. విద్యార్థులతో కలిసి కూర్చుని వారి యిబ్బందులు తెలుసుకుని 2012 ఏప్రిల్‌లో 3000 మంది టీచర్లతో కలిసి కూర్చుని సిలబస్ తయారుచేయించి 2013 ఏప్రిల్‌లో యుజిసి అనుమతి కోరారు. యుజిసికి చైర్మన్‌గా వున్న వేద్ ప్రకాశ్, ఎచ్ఆర్డి మంత్రి పళ్లంరాజు యీ కోర్సును మెచ్చుకున్నారు. ఎందుకంటే ఆ మధ్య ఒక టాప్ ఇండియన్ బ్రాండ్ ఢిల్లీ యూనివర్శిటీలో కాంపస్ రిక్రూట్మెంట్కు వచ్చి 1200 అభ్యర్థులలో కేవలం ముగ్గుర్ని సెలక్టు చేసినప్పుడే తెలిసింది – మన విద్యార్థులలో అన్ని రకాల స్కిల్స్ పెంచవలసిన అవసరం వుందని!
ఇంటర్ తర్వాత వుండే యీ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో రెండేళ్ల తర్వాత మానేస్తే డిప్లోమా యిస్తారు, మూడేళ్ల తర్వాత మానేస్తే డిగ్రీ యిస్తారు, నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ యిస్తారు. విదేశాలకు వెళ్లి పై చదువులు చదువుదామనుకున్నవారు ఆనర్స్ చేయవచ్చు, ఉద్యోగాలతో సరిపెడతామనుకునేవారు డిగ్రీతోనో, డిప్లోమాతోనే ఆపేస్తారు. ఆ విధమైన ఫ్లెక్సిబిలిటీ కూడా దీనిలో యిచ్చారు. అయితే దీనికి ఢిల్లీ టీచర్స్ అసోసియేషన్ అభ్యంతర పెట్టింది. గ్లోబల్ స్టాండర్డ్స్ చేరుకునేందుకు ఉద్దేశించిన యీ కోర్సుకు మీ అభ్యంతరం ఎందుకు అని అడిగితే ''మీరు అమెరికా యూనివర్శిటీలలో ఖాళీలు నింపడానికే యీ కోర్సు పెట్టారు'' అని ఆరోపించారు. ఈ ఒక్క యూనివర్శిటీలో కోర్సు పెట్టడం చేత అమెరికా యూనివర్శిటీలు నిండిపోతాయా? అయినా కావాలనుకున్నవాడే అమెరికాకు వెళతాడు తప్ప, ఎవరూ బలవంతంగా పంపరు కదా! ''మీరు బేసిక్స్ మళ్లీ చెపుతున్నారు, అవి హైస్కూలులోనే చెప్పేస్తారు'' వంటి చిన్న చిన్న అభ్యంతరాలు చేర్చారు కానీ యుజిసి వాళ్లు వాటిని పట్టించుకోలేదు. కోర్సు ప్రారంభమయిపోయింది. అనేకమంది విద్యావేత్తలు దీన్ని మెచ్చుకున్నారు. ఇంతలో ప్రభుత్వం మారింది. ఢిల్లీ టీచర్సు అసోసియేషన్ వారి ఆలోచనతో ఏకీభవించే బిజెపి ప్రభుత్వం గద్దె నెక్కింది. వెంటనే స్మృతి ఇరానీని ఆశ్రయించారు. ఆవిడ వెంటనే ఢిల్లీ వైస్ ఛాన్సలర్‌కు జూన్ 1 న ఫోన్ చేసి ఆ అసోసియేషన్ వాళ్లు చెప్పినది వినండి అని హుకుం జారీ చేసింది. అంతేకాదు, యుజిసికి చెప్పింది. గతంలో బ్రహ్మాండమైన కోర్సు అని తనే ప్రశంసించిన కోర్సు ఆపేయమని జూన్ 24 న యుజిసి ఢిల్లీ యూనివర్శిటీని ఆదేశించింది. అంతే దానికి మంగళం పాడుతున్నారు.
స్మృతి ఇరానీకి ఆ పదవి అప్పగించినపుడే విమర్శలు వచ్చాయి. అబ్బే, ఆమె మేధావి, డిగ్రీలు లేకపోతే యేం? అని కొందరు వెనకేసుకుని వచ్చారు. ఏదైనా స్కీమును రద్దు చేసేముందు అది అమలు జరుగుతున్న విధానం, ఫలితాలపై సమీక్ష జరిపి, ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. కానీ స్మృతికి యివేమీ పట్టవు. ఎందుకంటే యీ సమీక్షలూ అవీ ఎకడమీషియన్స్ చేసే పని. ఆవిడ కేవలం పొలిటీషియన్!
-ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)