మాజీ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ‘త్రిశంకు స్వర్గం’లో ఉన్నారా? ఏం చేయాలో తోచక అయోమయంగా ఉన్నారా? అసలు కాంగ్రెసు పార్టీలో తనకు భవిష్యత్తు లేదనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానం మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్తల ద్వారా వస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెసు ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి చిరంజీవి స్తబ్దుగా ఉన్న మాట వాస్తవమే. ముఖ్యంగా సీమాంధ్రలో కాంగ్రెసు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటూ గెలవకపోవడం చిరంజీవి వంటి ఛర్మిష్మా ఉన్న హీరోకు ఘోర అవమానం. కారణం? సీమాంధ్రలో కాంగ్రెసు ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఆయనే వ్యవహరించారు కాబట్టి. దీంతో సహజంగానే ఆయన నిరాశాపూరితంగా ఉన్నారు. నిజానికి ప్రజల్లో కాంగ్రెసు పట్ల ఉన్న వ్యతిరేకత ముందు ఎంత ఛరిష్మా అయినా పనిచేయదు. ఎంత హీరో అయినా ఆయనా సాధారణమైన మనిషే కాబట్టి ఓటమి వస్తే డిప్రెషన్‌కు లోను కావడంలో ఆశ్చర్యంలేదు.
కొంతకాలం కిందట పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో జరిగిన సీమాంధ్ర ఎన్నికల సమీక్షకు వెళ్లిరావడం తప్ప ఆయన పెద్దగా రాజకీయాలను పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఇటు చంద్రబాబు పరిపాలనపైగాని, అటు కేసీఆర్ పరిపాలనపైగాని ఆయన ఇంతవరకు స్పందించలేదు. మధ్యలో ఒకటి అరా ప్రకటనలు చేస్తే చేసుండొచ్చు. కాని ప్రజా సమస్యల పట్ల సీరియస్‌గా మాట్లాడిన దాఖలాలు లేవు. మరి జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన నాయకుడు ప్రజా సమస్యలపై స్పందించకుండా ఉంటాడా? హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసుకు కేటాయించిన ఇందిరా భవన్‌కు కూడా చిరు వెళ్లడంలేదని సమాచారం. ప్రస్తుతం షికారు చేస్తున్న పుకారు ప్రకారం చిరు త్వరలోనే కాంగ్రెసు పార్టీకి గుడ్‌బై చెబుతారు. ఎందుకంటే కాంగ్రెసులో తనకు రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన భావిస్తున్నారు కాబట్టి.
మరి తన రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉందని చిరు భావిస్తున్నారు? అంటే….‘తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరుగదరా సుమతీ’ అన్నట్లుగా అధికారం ఎక్కడైతే ఉందో ఆ దిశగానే రాజకీయ నాయకులు ప్రయాణిస్తారు. చిరంజీవి కూడా ఇందుకు అతీతుడు కాదు. అధికారంలో ఉన్న పార్టీ ఏది? ఆంధ్రలో కాదు…కేంద్రంలో. భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈయన కూడా ఆ దిశగానే ప్రయాణిస్తారని ఓ సమాచారం. చిరంజీవి దీన్ని ఖండిస్తూ ఏమీ ప్రకటన చేయకుండా ఉంటే ‘నిప్పు లేనిదే పొగ రాదు’ అని అనుకోవల్సివస్తుంది. 2018 వరకు చిరుకు రాజ్యసభ సభ్యత్వముంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెసు జీరో కాబట్టి అక్కడి నుంచి చిరు మరోసారి రాజ్యసభ్యకు వెళ్లే అవకాశం లేదు. కాంగ్రెసుకు బలమున్న మరో రాష్ట్రం నుంచి ఆయన్ని నామినేట్ చేస్తారనుకోవడం భ్రమ. ఒకవేళ కాంగ్రెసులోనే ఉన్నట్లయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఆ సమయానికి అధినేత్రితో ఆయనకు ఉండే సంబంధాలను బట్టి టిక్కెట్టు ఇవ్వడమో, ఇవ్వకపోవడమో జరుగుతుంది. ప్రస్తుతం సోనియాతో చిరుకు ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో తెలియదు. ఆయన కాంగ్రెసు నుంచి బయటకు రావాలనుకుంటున్నారని వస్తున్న పుకార్లను చూస్తుంటే ఆ పార్టీలో ఆదరణ తగ్గిందేమోననిపిస్తోంది.
కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడు చూపించినంత ఆదరణ ఇప్పుడు చూపించరనేది మాత్రం వాస్తవం. ‘ఏరు దాటాకా తెప్ప తగలేయడం’ రాజకీయాల్లో మామూలే. ఒకవేళ ఆయన కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరినా అది ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుందో తెలియదు. కాంగ్రెసు నుంచి బీజేపీలో చేరి సీమాంధ్రలో ఆ పార్టీ ప్రచారం కమిటీ సారథిగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం పార్టీలో ఆమె కార్యకలాపాలు ఏమిటో తెలియడంలేదు. ఒక్క చిరంజీవే కాదు, కాంగ్రెసులోని సినిమా తారలంతా స్తబ్దుగానే ఉన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన విజయశాంతి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూసిన జయసుధ గమ్మున ఉన్నారు. వారు ఏమాలోచిస్తున్నారో తెలియదు. పార్టీలు మారిన వారు కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే మారారు. తీరా ఓడిపోయేసరికి ఏం మాట్లాడకుండా ఉన్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు చిరంజీవి అనుకున్నదొకటి. బాగా మునిగాక జరిగింది మరొకటి. ఆయన వ్యూహమేమిటో త్వరలోనే తెలుస్తుండవచ్చు.