ఇద్దరూ చంద్రులే! : ఒక చోటే వెన్నెల

కాలం కలిసిరాకపోతే, పాము తాడై కరుస్తుందని సామెత. అదే కలిసివస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడని మరో సామెత. ఇప్పుడు సీమాంధ్ర, తెలంగాణలను ఏలుతున్న ఇద్దరు చంద్రులను చూస్తే, ఈ రెండు సామెతలు నిజం…

కాలం కలిసిరాకపోతే, పాము తాడై కరుస్తుందని సామెత. అదే కలిసివస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడని మరో సామెత. ఇప్పుడు సీమాంధ్ర, తెలంగాణలను ఏలుతున్న ఇద్దరు చంద్రులను చూస్తే, ఈ రెండు సామెతలు నిజం అనిపిస్తాయి. నిజానికి ఇద్దరికీ కాలం కలిసి వచ్చినట్లే. గెలుపు గుర్రం ఎక్కడి అధికార సింహాసనం చేరుకునే వరకు. అక్కడి నుంచి రాతలు వేరయ్యాయి. ఒకరి జోరైన వ్యవహారమైంది. మరొకరిది సమస్యలతో పోరు చందమైంది.

బాబుకు సమస్యల పోరు

చంద్రబాబుకు కాలం కలిసివచ్చింది. అధికారం నడిచివచ్చి వరించింది. అక్కడితో డామిట్‌ కథ అడ్డం తిరిగింది. బెల్లు బ్రేకుల్లేవు నారాయణా.. అన్న చందంగా,. రాజధాని లేదు..డబ్బుల్లేవు..కరెంటు లేదు..నీళ్లు లేవు..వర్షాలు లేవు..కరుణించే కేంద్రం విదిలించే అవకాశం కనిపించడం లేదు. ఏరు దాటడం కోసం నావ మల్లన్నకు అడ్డమైన వరాలు ఇచ్చినట్లు, అడిగిన వారికి, అడగని వారికి, ఒక ఓటు వున్న వర్గం నుంచి లక్ష ఓట్లు వున్న వర్గం వరకు అందరికీ అయాచిత వరాలు సవాలక్ష విసిరేసుకుంటూ, ప్రచారంలో దూసుకుపోయారు చంద్రబాబు. వరాల విత్తనాలు మొలకెత్తి, ఓట్ల పంట పండిరచాయి. బాగానేవుంది. కానీ విత్తనాల బాకీలు తీర్చాల్సి వుంది కదా. తీరా చేసి అధికారంలోకి వచ్చి, ఖజనాలోకి తొంగిచూస్తే, ఖాళీ అయిపోయిన డబ్బాలు మినహా మరేమీ కనిపించడం లేదు. పైగా, గత జన్మపాపంలా లోటు వెంటాడుతోంది. 

ఇలాంటి సమయంలో ఇచ్చిన హామీ ఇచ్చినట్లు నెరవేర్చాలంటే కనీసం అర్జెంట్‌గా లక్ష కోట్లు కావాలి. పైగా నెల నెలా మరిన్ని కోట్లు వెదజల్లాలి. కింకర్తవ్యం. అందుకే ఎనభై వేల కోట్ల ఖర్చును పక్కకు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఓ కమిటీ వేసేసారు. కాస్త ఊపిరి సలిపింది. ఆపై ఆపద గట్టెక్కించమని కనపడ్డ ప్రతి రాయికీ మొక్కుకున్నట్లు, లోకల్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ నుంచి, ఆర్బీఐ చైర్మన్‌ దాకా అందరికీ తలా విన్నపం పడేసారు. విదిలించదు..కదలదు అని తెలిసి కూడా కేంద్రానికి కూడా పనిలో పనిగా ఓ అర్జీ పెట్టేసారు. మాఫీ మాట సరే, కనీసం రీ షెడ్యూలు చేసి, మాట దక్కించండి మహా ప్రభో అంటున్నా బ్యాంకర్లు ససేమిరా అంటున్నాయి. ఇంకా మాట్లాడితే ఒకరిద్దరు బ్యాంకర్లు అసలు ఆలోచన, పాలోచన వుండే ఇలాంటి హామీ ఇచ్చారా అనే రేంజ్‌లో మాట్లాడుతున్నారు. మొత్తానికి రుణమాఫీ వాయిదా..

సరే ఈ మాఫీ బాధలు అలా వుంచితే, అడక్కుండానే ప్రమాణ స్వీకారం రోజు ఉద్యోగులకు రెండేళ్ల పదవి పెంపు వరం పడేసారు. దాని వెనుక వున్న అంతరార్థం వేరు. సమీప భవిష్యత్‌లో భారీగా పదవీ విరమణలు వుండడం, వారికి భారీగా చెల్లిపులు చేయాల్సిరావడం వంటి సమస్యలు వున్నాయి. అందుకే ఆ డబ్బు ఇబ్బందులను రెండేళ్లు వాయిదా వేసేందుకు వీలుగా, ఉద్యోగులను ఆకట్టుకునేందుకు వీలుగా రెండేళ్ల పదవీకాలం పెంచేసారు. అంటే మరో సమస్య వాయిదా. కానీ ఇక్కడ మరో తిరకాసుకు తెరతీసారు. ఈ రెండేళ్ల పెంపు వ్యవహారం ఒకళ్లకి వర్తిస్తుంది..మరొకరికి వర్తించదు అనే చందంతో జీవో ఇచ్చారు. దీంతో ముందు ఆనందించిన ఉద్యోగులు దిగాలు పడ్డారు. మరోపక్క అమలు చేయాల్సిన పిఆర్సీ దస్త్రం ప్రభుత్వం దగ్గర సిద్ధంగా వుంది. దాని గురించి మాట మాత్రం మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రికి సన్మానం చేసి, తమ ప్రభుభక్తి నిరూపించుకునే తాపత్రయంలో వున్న పరుచూరి అశోక్‌ బాబు వాంటి నాయకులు దాని గురించి ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. ఆ విధంగా ఉద్యోగుల సమస్యలు వాయిదా.

సరే కరెంటు పంపకాలు మనకు అనుకూలంగా వుంటాయి..ఆ బాధలు వుండవు అనుకుంటే, కథ అక్కడ అడ్డం తిరిగింది. ఇప్పడు పెద్ద నగరాల్లో సైతం రోజుకు ఆరు గంటల కోత తప్పడం లేదు. దీంతో బాబు వచ్చాక ఈ బాధలు అని జనం ఎక్కడ అనుకుంటారో అని ఓ శ్వేతపత్రం తయారుచేసి వదిలారు. ఈ పాపం నాది కాదు. గతకాలపు ప్రభుత్వాలది. అందువల్ల మీరు అనుభవిస్తున్న ఈ సమస్యలకు కారణం నేను కాదు అని చెప్పేసారు. అంతే కానీ, గతకాలపు ప్రభుత్వాలు అలా అఘోరించబట్టే నన్ను ఎన్నుకున్నారు. నేను వచ్చి ఇదిగో ఇలా 24 గంటలు కరెంట్‌ ఇచ్చాను అనడం లేదు. అదృష్టం బాగుండి, కేంద్రం 24గంటలు కరెంట్‌ సరఫరా పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రను ఎన్నుకుంది. అంటే అది అమలు అయితే 24గంటల విద్యుత్‌ వుంటుంది. ఆ విధంగా కేంద్రం చలువతో బాబు రెండు వేళ్లు గాల్లో ఆడిస్తూ మురిసిపోవచ్చు.  శ్వేతపత్రం, ఈ ప్రాజెక్టు వగైరా వార్తలు వింటూ, సమస్యను భరిస్తున్నారు జనాలు. ఆ విధంగా కరెంటు సమస్య వాయిదా.

ఇక కరెంటు లేకుండా పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి. అదీ కాక, రాజధాని ఎక్కడో తేలకుండా సంస్థలు ఎక్కడ అని రెడీ అవుతాయి. రాజధాని అన్నదో బ్రహ్మ పదార్థం. దాన్ని విజయవాడ, గుంటూరు ప్రాంతానికి తీసుకురావాలని ఇద్దరు నాయుళ్ల …సారీ..నాయకుల ప్రయత్నం. కానీ మోడీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. కమిటీ తిరగడం, అభిప్రాయ సేకరణ అయిపోయింది. నివేదిక ఎప్పుడు వస్తుందో..కేంద్రం ఏం నిర్ణయిస్తుందో, ఎప్పుడు నిర్ణయిస్తుందో తెలియదు. నిజానికి ఇందులో కేంద్రాన్ని తప్పు పట్టలేం. పదేళ్లు ఉమ్మడి రాజధాని అన్నారు. రాజధాని నిర్మాణానికి అయిదేళ్ల కాలం పడుతుందని అనుకున్నా, ఇప్పటికిప్పుడు చెప్పాల్సిన తొందర లేదు. పైగా ఇప్పటికిప్పుడు చెబితే, అందుకు నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే. దానికీ పెద్దగా ఖజనా గలగల లాడుతన్న దాఖలాలు లేవు. అందుకే నిర్ణయం వాయిదా..

వృద్దాప్య, వికలాంగ, మహిళ, పురోహితుల పింఛన్లు..పెంపు..వగైరా..అన్నింటినీ అక్టోబర్‌కు ఒక్క సంతకంతో తోసేసారు. ఆ విధంగా ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నారు. వాయిదా..వాయిదా..వాయిదా..

మద్యపానానికి సంబంధించి బెల్టు దుకాణాలు రద్దు అన్నారు. తమిళనాడు తరహా ఎక్సయిజ్‌ విధానం అన్నారు. కానీ మళ్లీ అదీ వాయిదా. ఎప్పటిలాగే పాత తరహా లాటరీ విదానానికే తెర తీసారు. మగ, ఆడ తేడా లేకుండా దుకాణాల కోసం ఎగబడుతున్నారు. మరి ఇంత ఫీజులు కట్టిన వారు, చడీ చప్పుడు లేకుండా బెల్టు దుకాణాలు తెరవరని గ్యారంటీలేదు. ఎలాగూ మద్యం అమ్మాలి, ఖజానా నిండాలి కాబట్టి, ఎక్సయిజ్‌ వారికి టార్గెట్లు మళ్లీ మామూలే. 

ఇక పరిశ్రమలు వస్తాయన్న వైనం. కరెంట్‌ లేదు. రాజధాని ఎక్కడో తెలియదు. విశాఖ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, ఇలా అన్ని చొట్లా భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎక్కడిక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. మరి పరిశ్రమలకు ఎవరు స్థలాలు ఇస్తారు? పైగా కరెంటు సమస్య వుండనే వుంది. ఎవరు తెగించి వస్తారు? అందుకే ఆ ఊసే లేదు..ఆ ధ్యాసే లేదు.

మరి ఇప్పుడు బాబేం చేస్తున్నారు..మంత్రులేం చేస్తున్నారు? చేయడానికి ఏమైనా వుంటేగా. శ్వేతపత్రాలు విడుదల చేసి, ఈ పాపం అంతా గత ప్రభుత్వానిది అని చెప్పే పనిలో పడ్డారు బాబు. మహాను భావా..ఆ సంగతి మాకు తెలుసు. అందుకే నిన్ను ఎన్నుకున్నాం. నీవేం చేస్తావో చెప్పు అని జనాలు అడిగే పరిస్థితి ఎలాగూ లేదు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా మంత్రులు నిత్యం అక్కడే గుడుగుడుగుంచం తిరుగుతున్నారు. తెలుగుదేశం మేనిఫెస్టో బట్టీ పట్టేసారు. అదే పదే పదేవల్లె వేస్తున్నారు. అదిగో 24గంటల విద్యుత్‌, ఇదిగో రుణాల మాఫీ, అల్లదిగో ఎయిమ్స్‌..ఇల్లదిగొ నౌకాశ్రయం..ఇలా రకరకాల హామీలు..ఎన్నికల తరువాత కూడా. చిత్రంగా ఈ తరహా హడావుడి కూడా లేదు రాయలసీమలో. అనంతపురం దగ్గర బాలయ్య బాబు, పరిటాల సునీత ఐటి జపం చేస్తున్నారు. అది కూడా ఎప్పుడొస్తుందో తెలియదు. మరి మిగిలిన రాయలసీమకు ఆ హామీల చప్పుడు కూడా వినిపించడం లేదు.

ఇదీ బాబు వైనం. సమస్యలతో ఆయన సాగిస్తున్న పోరు చిత్రం,. పాపం. అధికారం వడ్డించిన విస్తరి అయింది కానీ, పాలన మాత్రం నెత్తిన పాలు పోసిన చందం కాలేదు. ముళ్ల కిరీటమే అయింది. మోడీ ప్రభుత్వం కనికరించి, ఈ బడ్జెట్‌లో ఏదైనా విదిలిస్తే, అది తమ ఘనతే అని చెప్పుకుని కాస్త సేద తీరవచ్చు. లేదంటే, ఈ సమస్యల గోదారి ఈదడం ఇలా సాగుతుంది.

చంద్రశేఖరుడి జోరు

అదృష్టం వుంటే సంకలో తేనెపట్టు అనే నాటు సామెతవుంది. కెసిఆర్‌ వ్యవహారం అచ్చం అలాంటిదే. అమోఘమైన రాజధాని వుంది. ఏ దారీ కానక అఘోరిస్తున్న ప్రతిపక్షం వుంది. అందలం ఎక్కించిన ప్రజలు అండగా వున్నారు. ఇక అడ్డేముంది. చకచకా చెలరేగిపోవడం ఆయన వంతయింది. అందుకే వెనుక వచ్చిన కొమ్ములే వాడి అన్నంతగా చంద్రబాబును తోసి రాజని ముందుకు సాగిపోతున్నారు. చిత్రమేమిటంటే, ప్రపంచానికి పాఠాలు చెప్పాను, నాకు మించిన అనుభవం ఎవరికి వుంది అని పదే పదే చంద్రబాబు అంటుంటే, అనుభవం కాదు, ఆచరణ ముఖ్యం అన్నట్లు కెసిఆర్‌ చకచకా ముందుకు సాగిపోతున్నారు. పోనీ కెసిఆర్‌ మాత్రమేనా అనుకుంటే, ఆయన కొడకు కేటిఆర్‌ కూడా చకచక సమావేశాలు నిర్విహిస్తూ కేవలం వారసత్వం మాత్రమే కాదు, పాలన కూడా వచ్చు అని నిరూపించుకుంటున్నారు. హరీష్‌ రావు, నాయని వంటి వారు సరేసరి. 

కేసిఆర్‌కు అన్నింటా కలిసి వచ్చిన అంశం ఒకటి వుంది. అది తెలుగుదేశం వీక్‌నెస్‌. కుమ్ములాటలు తప్ప మరో వ్యవహారం చేతగాని కాంగ్రెస్‌ వాదులు ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఇక తెలుగుదేశం వాదులు గట్టిగా మాట్లాడడానికి లేకుండా పోయింది. రుణమాఫీ హామీ ఏమయింది అని అడుగుదామంటే, మన బాబు కూడా ఇంకా అమలు చేయలేదు కదా అని గుర్తుకు వస్తుంది. పోనీ కరెంటు కష్టాలు ప్రస్తావిద్దామంటే, ఆంధ్రలో పరిస్థితి అంతకన్నా అగమ్యంగా, అఘోరిస్తున్న వైనం కళ్లెదుట కనిపిస్తుంది. పోనీ ఇళ్ల స్థలాలు,ఇళ్లు, ఉద్యోగాలు వంటివి గుర్తుచేద్దామా అంటే బాబు గారు అంతకన్నా హామీలు అచ్చేసి వదిలి, అస్సలు పట్టించుకోని వైనం కనిపిస్తుంది. దీంతో తాము ఇక్కడ గొంతెత్తితే, అక్కడ వైకాపా అదే రాగం అందుకుంటుంది అని కక్కలేక, మింగలేక ఊరుకుంటున్నారు. దీంతో కేసిఆర్‌ ఆడిరది ఆట, పాడిరది పాటగా వుంది.

పైగా కెసిఆర్‌ గురిచూసి దెబ్బలు కొడుతున్నారు. సీమాంధ్రులు ఎక్కువగా వుండే అయ్యప్ప సొసైటీపై పడ్డారు. తెలుగుదేశం తేలు కుట్టిన వ్యవహారంలా నొప్పి భరించింది. అక్రమాలు సహించమని చెప్పలేదుగా. గురుకుల్‌ ట్రస్ట్‌, ఎన్‌ కన్వెన్షన్‌ వంటి వ్యవహారాలు కేసిఆర్‌ ప్రతిష్టను తెలంగాణ వాదుల్లో పెంచాయి. 

ఇక కేసిఆర్‌ ఇంకో అదృష్టమేమిటంటే, ఏడ్చేదానికి మొగుడొస్తే, తనకు వస్తాడనే ఆశ. కేంద్రం ఆంధ్రకు ఏమి ఇస్తే అది తెలంగాణకు ఇవ్వకమానదు. పైగా తెలంగాణలో భాజపాకు కాస్త నాయకులు వున్నారు. వారు అడిగి మరీ తేగలరు. అందువల్ల అసలు ఆ దిశగా కెసిఆర్‌ ఆలోచించడం మానేసారు. ఇక్కడ వ్యవహారాలు, సమావేశాలు, పరిశ్రమలు ఎలా తేవాలి అన్నవాటిపై దృష్టి సారించారు. కానీ బాబుకు ఇప్పుడు ఖజానా ఖాళీ. హామీలు మాత్రం కోటానుకోట్లు. అందుకే బాబు కేంద్రం వంక దీనంగా చూస్తున్నారు. కేంద్రం ఓ రోడ్డు ప్రాజెక్టు ఇచ్చినా, ఎయిమ్స్‌ అన్నా, స్మార్ట్‌ సిటీ ఇచ్చినా అది తన గెలుపు ఖాతాలో వేసుకునేందుకు బాబు సిద్దంగా వున్నారు. ఇప్పటికే 24గంటల విద్యుత్‌ తన ఘనత అని చెప్పుకోవడానికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసారు. కేంద్రం అది పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఆంధ్రకు అందిస్తోంది. అందుకే అది వచ్చేసరికే 24 గంటల కరెంట్‌..అంటూ ఊదర కొడుతున్నారు. అది రాగానే తన ఘనతే అనడానికి వీలుగా. 

ఇప్పుడు బాబు ఆశ అంతా కేంద్ర బడ్జెట్‌ పైనే. అందులో ఆంధ్రకు ఏ వరాలు వున్నా అవి తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన సిద్ధంగా వున్నారు. ఈ లోగా కెసిఆర్‌ తన రెగ్యులర్‌ వ్యవహారాలు, సభలు సమావేశాలు చకచకా నిర్వహించేస్తున్నారు. పైగా ఆయన వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు బాబు మాదిరిగానే. 2019లో తెలంగాణలో మాదే అధికారం అని బాబు అన్నదాన్ని సీరియస్‌ గానే తీసుకున్నారు కెసిఆర్‌. అందుకే తెలంగాణ వారి మనసులు గెలుచుకోవడమే పనిగా పెట్టుకున్నారు..అది సీమాంధ్రులను ఇబ్బంది పెట్టి అయినా. అందుకే ఈ భూదందాలు వెలికి తీయడం, ఎపి ఎన్జీవోల భూములు వెనక్కు తీసుకోవడం, సీమాంధ్రులు పిల్లలకు ఫీజులు కట్టననడం. ఇవన్నీ సీమాంధులకు కోపం తెప్పిస్తాయి. వాళ్ల ఓట్లు ఎలాగూ తనకు రావు అని కెసిఆర్‌కు తెలుసు. కనీసం తెలంగాణ ఓట్లు తనకు పదిలం అవుతాయి తన చర్యలతో అని ఆయన ఐడియా. 

మేనిఫెస్టో మేనియా

చంద్రబాబుకు కెసిఆర్‌కు వున్న కీలక తేడా మేనిఫెస్టో మేనియా. బాబు అండ్‌ కో మేనిఫెస్టోని మరిచిపోలేదు. ఉదయాన్నే బడిలో పిల్లలు ప్రార్థనో,. మరోటో వల్లె వేసినట్లు, నిత్యం ఎక్కడో అక్కడ మేనిఫెస్టో వినిపిస్తూ వుంటుంది. అంతకు మించి మరేమీ జరగడదు. కెసిఆర్‌ అండ్‌ కో మేనిఫెస్టోను మరిచిపోయారు. గుర్తుచేసే దమ్ము కాంగ్రెస్‌కు, అవకాశం తెలుగుదేశానికి లేవు. అందుకే మిగిలిన పనులపై కెసిఆర్‌ అండ్‌ కో దృష్టి పెట్టి చకచకా ముందుకు పోతున్నారు.

ఒక్కోసారి అంతే గెలుస్తుందనుకున్న కుందేలు కుదేలవుతుంది..పాకుతుంది అనుకున్న తాబేలు పరుగెడుతుంది. టైమ్‌ బాబూ..టైమ్‌.

-చాణక్య

[email protected]