ఇటీవలి కాలంలో విపరీతంగా ఆశలు రేకెత్తించి దబ్బున కిందపడిన పార్టీ ఆప్! ఎవరూ వూహించని విధంగా ఢిల్లీ ఎసెంబ్లీ ఎన్నికలలో 28 సీట్లు తెచ్చుకుని ప్రభుత్వం ఏర్పరచిన ఆప్ దేశంలో కొత్త విప్లవాన్ని తెచ్చిందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. అర్జంటుగా అనేక రాష్ట్రాలలో ఆప్ శాఖలు వెలిశాయి. ఆప్ టిక్కెట్ పై పోటీ చేయడానికి మేధావులు ముందుకొచ్చారు. ఇక మనకు ఎదురులేదనుకున్నారు ఆప్ నాయకులు. దేశమంతా పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. 434 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు నిలబడ్డారు. షీలా దీక్షిత్ ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడతానని ప్రకటించి తన క్యాడర్‌లో స్థయిర్యాన్ని పెంచి, షీలాను ఓడించిన అరవింద్ అత్మవిశ్వాసంతో అదే రకమైన ఛాలెంజ్ మోదీకి విసిరాడు. వారణాశిలో నిలబడ్డాడు. నెలల తరబడి ప్రచారం చేశాడు. అదే విధంగా రాహుల్ గాంధీ నియోజకవర్గంలో కుమార్ విశ్వాస్ నిలబడ్డాడు. అరవింద్ కేజ్రీవాల్ సలహాదారు యోగేంద్ర యాదవ్ హరియాణాకు యిన్‌చార్జిగా వ్యవహరిస్తూ, హరియాణాలో నిలబడ్డాడు కూడా. యుపిఏ పాలనలోని అవినీతితో విసిగిన ప్రజానీకం దానికి వ్యతిరేకంగా పోరాటం సలిపిన ఆప్‌ని ఆదరిస్తారని దాని అభిమానులు అంచనాలు వేశారు. అవినీతి వ్యతిరేకత తప్ప ఆప్‌కు వేరే సిద్ధాంతం ఏదీ లేదని విమర్శకులు అంటున్నా, అదొక్కటే చాలని వారనుకున్నారు.
చివరకు జరిగిందేమిటి? 434 స్థానాల్లో నిలబడితే 414 (అంటే 96%) స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకున్నారు. కేవలం నలుగురు నెగ్గారు. అదీ పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే! 24.4% ఓట్లతో 4 సీట్లు గెలిచింది. అక్కడ పార్టీ నిర్మాణమే లేదు. అయినా యీ గెలుపు సంభవించింది. వేరే చోట్ల పార్టీలోని ప్రముఖ నాయకులందరూ ఓడిపోయారు. పార్టీకి ప్రజాదరణ తగ్గసాగింది. 2013 అక్టోబరులో దేశవ్యాప్తంగా 3,50,000 మంది వాలంటీర్లు వుంటే యీరోజు 50,000 మంది వున్నారు. ఢిల్లీలో వున్న 15,000 మంది వాలంటీర్లలో సగం మంది పార్టీ విడిచి వెళ్లిపోయారు. పార్టీకి నిధులు కావాలని అడిగితే ఏప్రిల్ నెలలో ఒక రోజు రూ. 30 లక్షలు వచ్చిన సందర్భం వుంది. ఈ రోజు అది వేలల్లోకి పడిపోయింది. అవినీతి జరిగితే మాకు ఒక్క ఫోన్‌కాల్ కొట్టండి చాలు అంటూ ఆప్ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు రోజూ వేలాది ఈమెయిల్స్, ఫోన్లు వచ్చేవి. ఇప్పుడు ఆ ఫోన్ మోగడం మానేసింది. ఘజియాబాద్‌లో వున్న రెండంతస్తుల భవనంలోని ఆప్ ఆఫీసు ఒకప్పుడు జనంతో కిక్కిరిసిపోయేది. యిప్పుడు వాలంటీర్లు లేక బావురుమంటోంది. కన్నాట్ ప్లేస్‌లోని ఆఫీసులోనే గుప్పెడుమంది కనబడుతున్నారు. అరవింద్ చుట్టూ ఒక ముఠా చేరి అతన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ కొందరు నాయకులు వైదొలగుతున్నారు. పార్టీపై అభిమానంతో చేరిన గోపీనాథ్ వంటివారు విడిచి వెళ్లిపోయారు. దేశమంతా పోటీ చేయాలన్న పాడు సలహా యిచ్చినందుకు యోగేంద్ర యాదవ్‌పై మనీశ్ శిశోడియా బహిరంగంగా విమర్శించాడు. ఆప్ అంటే అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ అంటే ఆప్. తన వైఫల్యాలపై ఆత్మవిమర్శ చేసుకోవడానికి అరవింద్ విపాసనా ధ్యానంలో కొన్ని రోజులు గడిపి, జూన్ 8 న పార్టీ మూడు రోజుల ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేశాడు. అదంతా బూటకం అన్నారు పార్టీ వర్కర్లు కొందరు.
ఎందుకిలా జరిగింది? అని లోతుగా ఆలోచిస్తే – ఢిల్లీలో జరిగినదే దేశమంతా జరుగుతుందని భావించడమే ఆప్ చేసిన పెద్ద పొరబాటు అని తేల్తుంది. ఢిల్లీ మహానగరం. కేంద్రంలో జరిగిన అవినీతి గురించి అక్కడి ప్రజలకు ప్రత్యక్షానుభవం వుంది. ఆప్ చేసిన కృషి గురించి కూడా వారికి అవగాహన వుంది. విద్యాధికులు అధిక సంఖ్యలో వున్న దేశంలోని యితర నగరాలలో కూడా ఆప్ సానుభూతిపరులున్నారు. తక్కిన నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో ఆప్ గురించి ఎంతమందికి తెలుసు? వాళ్లు పార్టీ నిర్మాణమే చేపట్టలేదు. తమ గురించి ప్రచారం చేసుకోలేదు. ఇంటర్నెట్‌లో జరుగుతున్న ప్రచారం చూసి, యావన్మంది ప్రజలు మన వెంట వున్నారనుకోవడం చాలా తప్పు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో వాళ్లు సాధించిన విజయం తాత్కాలికమైనది. కాంగ్రెసు అవినీతికి వ్యతిరేకంగా బిజెపికి కూడా ఓటేసి వుండవచ్చు. కానీ ఆప్ కూడా రంగంలో వుంది కాబట్టి, దానికీ ఓట్లేశారు. చివరగా చూస్తే బిజెపి కంటె ఎక్కువ సీట్లు గెలుచుకుంది. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి మోదీ ప్రధాని కాబోతున్నాడన్న అంశం బలంగా వుంది. ఆప్ తరఫున అటువంటి అభ్యర్థి ఎవరూ లేరు. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాల్లో ఆప్ ఒక్కటీ గెలవలేకపోయినా దాని ఓటింగు శాతం 29 నుండి 33 కు పెరిగింది. అరవింద్ బృందం ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగి వుంటే పరిస్థితి యింతకంటె మెరుగ్గా వుండేది. ఢిల్లీని పాలించకపోయినా కనీసం పార్లమెంటు ఎన్నికల సమయంలో అరవింద్, యితర ఆప్ నాయకులు ఢిల్లీలో వుండి ప్రచారం చేసినా రెండో, మూడో గెలిచేవారు. ఏనుగు కుంభస్థలం కొట్టాలంటూ వాళ్లు వారణాశికి, అమేఠీకి చెదిరిపోవడంతో ద్వితీయశ్రేణి నాయకులు మాత్రమే ఢిల్లీలో పోరాడవలసి వచ్చింది. అందుకే యీ ఓటమి.
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు ఆప్‌కు రాలేదు. కాంగ్రెసు మద్దతుతో ఏర్పరిస్తే పరువు పోతుందన్న భయం. చివరకు ప్రజాభిప్రాయ సేకరణ అంటూ హంగామా చేసి కాంగ్రెసు మద్దతుతో ఏర్పరచారు. జలమండలి, విద్యుత్ చార్జీల తగ్గింపు వంటి మంచి పనులు చేసినా, తొలిరోజు నుండి పబ్లిసిటీ కోసం పాకులాడారు. అర్ధరాత్రి మంత్రిగారి దాడులు, పోలీసులతో వివాదం, అధికారులతో పేచీ, ప్రజా దర్బార్, మంత్రులే ధర్నాలు చేయడం – వీళ్లు రాజులా? అరాచకవాదులా? అన్న సందేహం కలిగేట్లా చేశారు. చివరకు అవినీతి విషయంలో కాంగ్రెసు, బిజెపి ఒక తానులో గుడ్డలే అని నిరూపించి వారిపై పార్లమెంటు ఎన్నికల్లో పైచేయి సాధించే లక్ష్యంతో మద్దతు లేకపోయినా జనలోక్‌పాల్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి తమ 49 రోజుల ప్రభుత్వాన్ని తామే కూల్చేసుకున్నారు. అడ్డమైనదానికీ ప్రజాభిప్రాయం కోరే ఆప్, యింతటి ముఖ్యమైన విషయంలో ఎందుకు అడగలేదు? రాజకీయక్రీడ ఆడుదామనుకుంది కాబట్టి! ఈ అతితెలివితేటలను జనం హర్షించలేదు. ఆప్ ప్రభుత్వం పడిపోగానే ఢిల్లీ అధికారగణం వాళ్ల నిర్ణయాలన్నీ తిరగతోడారు. పూర్వవిధానాలే అమలు చేస్తున్నారు. మధ్యలో ప్రజలు నష్టపోయారు. అందుకే పార్లమెంటు ఎన్నికలలో మధ్యతరగతి ప్రజలు ఆప్‌కు ఓటేయలేదు.
గత ఏడాది అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి 3 లక్షలమంది వాలంటీర్లు ఢిల్లీలో యిల్లిల్లూ తిరిగారు. ఎంతోమంది తమ ఉద్యోగాలు వదులుకుని ఆప్‌లో చేరారు. ఏవి తల్లీ నిరుడు ముసిరిన హిమసమూహములు? అన్నట్లు ఈ సారి ఎవరూ లేరు. అభ్యర్థులే గడప దిగలేదట. ''మోదీ మొహం చూసి బిజెపికి ఎలాగూ ఓట్లేస్తారు. మనం కష్టపడినా ప్రయోజనం లేదు.'' అనుకుని వూరుకున్నారు. అధికారం దక్కడంతో ఆప్‌లో చీలికలు వచ్చేశాయి. అరవింద్‌కు, సాధారణ కార్యకర్తలకు మధ్య గోడలు లేచాయి. ఆప్ తనను తాను ఎక్కువగా వూహించుకోసాగింది. లోకసభ ఎన్నికల్లో పోటీ చేయాలి, రూ. 200 కోట్లు కావాలి అని అభిమానులను అడిగితే రూ. 35 కోట్లు వచ్చాయి. అతి చేస్తే గతి చెడుతుందని పెద్దలు వూరికే అనలేదు. దేశమంతా పోటీ చేయాలనుకోవడంతో అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి కూడా టిక్కెట్లు యిచ్చారు. 2009 ఎన్నికల్లో లోకసత్తా యిలాటి పొరబాట్లే చేసింది. ఎన్నికలలో ఓడిపోయాక కూడా అరవింద్ పాతవిధానాలను మార్చుకోలేదు. నితిన్ గడ్కరీ పరువునష్టం దావా కేసులో రూ.10 వేల బాండ్ యివ్వవయ్యా బాబూ బెయిల్ యిస్తానని జడ్జి బతిమాలినా అరవింద్ మొండికేసి, తీహార్ జైలుకి వెళ్లి కూర్చున్నాడు. తనపై సింపతీ కలుగుతుందనుకున్నాడు కానీ తీహార్ జైలు గేటు ఎదుట మే 27 న హాజరైన పార్టీ వర్కర్ల సంఖ్య చూశాక గుండెలు జారి, నోరు మూసుకుని బాండ్ యిచ్చి, బెయిల్ తీసుకుని యింటికి వెళ్లి కూర్చున్నాడు. సరిగ్గా చెప్పాలంటే నమలగలిగిన దాని కంటె ఎక్కువ కొరికి ఆప్ నష్టపోయింది. తాహతుకు మించిన ఎగరబోయి చతికిలపడింది. నెట్‌లో హంగామా చూసి తమ బలాన్ని అతిగా వూహించుకునే ఆర్భాటపు, అర్భకపు పార్టీలందరికీ ఆప్ విలాపం గుణపాఠం కావాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్