టీడీపీ అధినేత చంద్రబాబుకు చివరికి ఏ ఒక్క కులాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిగిల్చేలా లేరు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ సామాజిక వర్గాలకు ఇటు రాజకీయ పదవుల్లోనూ, అటు సంక్షేమ పథకాల్లోనూ అగ్రస్థానం వేసి, వారి ఆదరాభిమానాలను చూరగొన్నారు.
జగన్‌కు బలమైన ఓటు బ్యాంకుగా వారు తయారయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 50% పైబడి ఓటు షేర్‌తో 151 అసెంబ్లీ, 23 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుపొందింది.
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను , జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 90% నెరవేర్చి, మాట ఇస్తే మడమ తిప్పడనే సందేశాన్ని జనంలోకి తన పాలనతో తీసుకెళ్లారు.
మాట కోసం జగన్ ఎందాకైనా నిలబడతాడనే బలమైన ముద్ర వేయగలిగారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 80 శాతం విజయం సాధించడం వెనుక సంక్షేమ పథకాల ప్రభావాన్ని చెప్పకనే చెప్పినట్టైంది.
ఈ నేపథ్యంలో అగ్రవర్ణాల్లో పేద కుటుంబాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు ఈబీసీ నేస్తం పథకం అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించి చంద్రబాబును మరోసారి దెబ్బకొట్టినట్టైంది. వీరికి ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లపాటు అందించనుంది.
దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందుతారని అంచనా. ఇందుకు ఏడాదికి రూ.670 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.2,011 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో అగ్రవర్ణాల్లో కూడా చంద్రబాబుకు ఎలాంటి అవకాశం లేకుండా జగన్ వ్యూహం పన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా అన్ని కులాల వాళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తూ వాళ్లందరి అభిమానాన్ని చూరగొంటూ, రాబోవు ఎన్నికలకు ఇప్పటి నుంచే మరింత బలమైన పునాదులను జగన్ వేసుకుంటున్నారు. సంక్షేమ పథకాల పునాదులపై అంచెలంచెలుగా బలపడుతున్న జగన్‌ను ఢీకొట్టడం బాబుకు సాధ్యమవుతుందా? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.