ఏడాది కిందట స్థానిక ఎన్నికల నామినేషన్లప్పుడు జనసేన పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ అంటూ ఒకటుంది అనే ఉనికే చాలా చోట్ల లేదు. ఏడాది తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చాలా జిల్లాల్లో జనసేన-బీజేపీ మద్దతుదార్లు అంటూ ఎవరూ నామినేషన్లు కూడా వేయలేదు! జిల్లాలకు జిల్లాల్లోనే అలాంటి పరిస్థితి. ప్రత్యేకించి ఏడెనిమిది జిల్లాల్లో అయితే.. చాలా చోట్ల ఇద్దరు అభ్యర్థులే ముఖాముఖి తలపడ్డారు.
పోలింగ్ జరిగిన పంచాయతీల్లో..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మద్దతుదార్ల మధ్య మాత్రమే పోటీ. జనసేన సొంతంగా కానీ, బీజేపీ సొంతంగా కానీ, ఈ రెండు పార్టీలూ జాయింటుగా కానీ.. అభ్యర్థులను బలపరిచేంత సీన్ లేకపోయింది!
తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి! పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఈ పార్టీలు అభ్యర్థులను పెట్టుకోలేకపోయాయి. పంచాయతీ ఎన్నికలకు ఏమీ ఏడాది కిందటే నామినేషన్ల గడువు అయిపోలేదు. ఇటీవలే నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా పర్యవేక్షించారు పంచాయతీ ఎన్నికల గురించి. బలవంతపు ఏకగ్రీవాల సమస్యే లేదన్నారు.
ఏకగ్రీవం సంగతెలా ఉన్నా.. జనసేన-బీజేపీలు అభ్యర్థిని కూడా పెట్టుకోలేకపోయాయి. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. మున్సిపోల్స్ – ఎంపీటీసీ- జడ్పీటీసీ గతంలో ఏకగ్రీవాలను రద్దు చేయాలని, ఈ ఎన్నికలకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ డిమాండ్ చేయగా.. ఆ డిమాండ్ తో కోర్టుకు కూడా ఎక్కింది జనసేన పార్టీ.
తాము గతంలో నామినేషన్లు వేయలేకపోయినట్టుగా.. అప్పుడు వీలుకాలేదన్నట్టుగా.. కాబట్టి దాన్ని రద్దు చేసేసి, ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలనేది జనసేన డిమాండ్ గా కనిపిస్తోంది. అయితే.. ఎన్నికల ప్రక్రియ అప్పట్లోనే చాలా పూర్తయ్యింది. కాబట్టి.. కోర్టు పాత ప్రక్రియను ఎంత వరకూ రద్దు చేస్తుంది? అనేది ప్రశ్నార్థకమే,. ఒకవేళ కోర్టు గనుక ఆ పని చేయకపోతే.. స్థానిక ఎన్నికల్లో ఫెయిల్యూర్ కు జనసేనకు నిఖార్సైన సాకు దొరికినట్టే!
తమకు నామినేషన్లు వేసే అవకాశం కూడా ఇవ్వలేదని, ప్రభుత్వం కుట్ర చేసిందని.. అందుకే జనసేన స్థానిక ఎన్నికల ఊసులో ఉండటం లేదని.. మరోసారి నామినేషన్లను వేసే అవకాశమే ఇచ్చి ఉంటే.. స్థానిక ఎన్నికల్లో గెలిచి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయేవాడని.. జనసేన మద్దతుదార్లు వాదించడానికి మంచి అవకాశమే లభించేట్టుగా ఉంది!