ఎమ్బీయస్‌ : కార్పోరేట్లు విజృంభిస్తున్నాయి

ఏదైనా పరిశ్రమ సవ్యంగా సాగాలంటే యాజమాన్యం, వర్కర్ల యూనియన్‌ సమతూకంగా వుండాలి. ఇద్దరూ పరిశ్రమ బాగుపడడానికి దోహదపడాలి. యూనియన్‌ పేట్రేగిపోతే సరిగ్గా పని చేయకుండా, బాధ్యతలు విస్మరిస్తూ, అలవికాని జీతాలు యిమ్మంటూ మాటిమాటికీ సమ్మెలు…

ఏదైనా పరిశ్రమ సవ్యంగా సాగాలంటే యాజమాన్యం, వర్కర్ల యూనియన్‌ సమతూకంగా వుండాలి. ఇద్దరూ పరిశ్రమ బాగుపడడానికి దోహదపడాలి. యూనియన్‌ పేట్రేగిపోతే సరిగ్గా పని చేయకుండా, బాధ్యతలు విస్మరిస్తూ, అలవికాని జీతాలు యిమ్మంటూ మాటిమాటికీ సమ్మెలు చేసి నష్టాలు చేకూర్చి, ఫ్యాక్టరీ మూతపడేట్లు చేస్తుంది. యాజమాన్యం చేతికే సర్వాధికారాలు వుంటే, యిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ, కార్మికశక్తిని దోపిడీ చేస్తూ, పర్యావరణాన్ని కలుషితం చేస్తూ, పన్నులు ఎగ్గొడుతూ, కార్మికుల ప్రాణాలకు, ఆరోగ్యానికి భద్రత కల్పించకుండా పర్యవేక్షించే అధికారులను లంచాలతో జోకొడుతూ, ఫ్యాక్టరీలో వచ్చిన ఆదాయాన్ని యింటికి తరలిస్తూ పుస్తకాల్లో మాత్రం నష్టాలు చూపుతూ, బ్యాంకు లోనులు ఎగ్గొడుతూ, యిదేమిటని కార్మికులు అడిగితే వుద్యోగాలు పీకేస్తూ, లాకౌటు ప్రకటిస్తామని బెదిరిస్తూ పరిశ్రమకు, దేశ ఆర్థికాభివృద్ధికి నష్టం కలిగిస్తారు. అందుకే ఎవరూ హద్దు మీరకుండా ఒకరి నొకరు చెక్‌ చేసుకుంటూ వుంటేనే మంచిది. 

అయితే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో యూనియన్‌లు పెత్తనం చలాయిస్తున్నాయి, మరి కొన్ని ప్రాంతాల్లో యాజమాన్యాలు ఆధిక్యత చూపుతున్నాయి. ప్రభుత్వం కొన్ని చట్టాల ద్వారా యిద్దర్నీ అదుపు చేస్తూ వుంటుంది. ఇప్పుడు బిజెపి అధికారంలోకి వచ్చింది కాబట్టి దానికి మద్దతు యిచ్చి గెలిపించిన కార్పోరేట్‌ రంగాలు, వ్యాపార వాణిజ్య రంగాలు, ఆ చట్టాల్ని తమకు అనుకూలంగా మార్చాలని ఒత్తిడి తెస్తున్నాయి. బిజెపి అధికారంలో వున్న రాజస్థాన్‌ ప్రభుత్వం అప్పుడే ఆ చట్టాలకు సవరణలు ప్రతిపాదించింది. కాబినెట్‌లో ఆ సవరణలు ఆమోదించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. ఆ తర్వాత దానికి దేశాధ్యకక్షుడు ఆమోదముద్ర వేయాలి. తాము చేసిన సవరణలే కేంద్రం కూడా చేయాలని రాజస్థాన్‌ ప్రభుత్వం చెప్తోంది. అందరూ ఆ తానులో గుడ్డలే కాబట్టి చేసినా ఆశ్చర్యం లేదు. 

ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌, 1947, కాంట్రాక్ట్‌ లేబర్‌ (రెగ్యులేషన్‌ అండ్‌ ఎబాలిషన్‌) యాక్ట్‌, 1970, ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌, 1948 అనే మూడు చట్టాలు కార్మికప్రయోజనాలను కొంతవరకు పరిరక్షిస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించాలంటే, పెట్టుబడులు ఆకర్షించాలంటే యీ చట్టాలు అడ్డంకి మారాయంటూ రాజస్థాన్‌ ప్రభుత్వం వీటిని మార్చబోతోంది. ఇప్పటివరకు 20 మంది ఉద్యోగుల కంటె ఎక్కువమంది వున్న సంస్థలకు మాత్రమే కాంట్రాక్ట్‌ లేబర్‌ చట్టం వర్తిస్తుంది. అంతకంటె తక్కువ మంది స్టాఫ్‌ వున్న కంపెనీలు తమ యిష్టానుసారం చేయవచ్చు. ఇప్పుడు ఆ 20 ను 50 చేయబోతున్నారు. అసలు వర్కర్లందరినీ రికార్డుల్లో చూపించడమే అరుదు. అలాటిది 49 మంది వున్నారని చూపించినా యీ చట్టానికి భయపడనక్కరలేదు. ఆ మేరకు కార్మికులకు రక్షణ పోతుంది. 

ఫ్యాక్టరీ యజమాని తన ఆవరణలో ఏదైనా పని చేయడానికి ఎవరికైనా కాంట్రాక్టు యిస్తే, ఆ కాంట్రాక్టరు తన దగ్గర పనిచేసే వాళ్లకు జీతాలు సరిగ్గా యివ్వకపోయినా, పని చేసే చోట భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వలన కార్మికులు గాయపడినా, ఆ కాంట్రాక్టరుతో పాటు ఫ్యాక్టరీ యజమాని కూడా బాధ్యుడే. మర్కంటైల్‌ లా ప్రకారం ఏజంటు చేసే పనులకు ప్రిన్సిపల్‌ కూడా బాధ్యుడే. అయితే యిప్పుడు ప్రభుత్వం చేస్తున్న సవరణల ప్రకారం ఫ్యాక్టరీ యజమాని యికపై బాధ్యుడు కాడు. ఇప్పుడు గెయిల్‌ పైపు లీకు విషయమే తీసుకుంటే వాళ్లు 'దీని నిర్వహణ బాధ్యత కాంట్రాక్టరుకు అప్పగించాం, వాళ్లు సరిగ్గా చేయకపోతే మేమెలా బాధ్యులం?' అని వాదించవచ్చు. ఫలానావాళ్లకు కాంట్రాక్టు యిమ్మనమని ప్రజలు వచ్చి కోరలేదు కదా, తక్కువ రేటుకి వచ్చాడు కదాని నాణ్యత, నీతి నిజాయితీ లేనివాడికి అప్పగించి చేతులు దులుపుకుంటే ఎలా?

ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ ప్రకారం విద్యుత్‌ వుపయోగిస్తున్న యూనిట్లలో 10 (విద్యుత్‌ ఉపయోగించని యూనిట్లలో 40) మంది కంటె ఎక్కువ మంది పనిచేస్తూ వుంటే ఆ చట్టం ప్రకారం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ యాజమాన్యం తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని 20కు పెంచుదామనుకుంటున్నారు. కార్మికులను మూకుమ్మడిగా అంటే 100 మందిని తీసేద్దామనుకుంటే యాజమాన్యం ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. వాళ్లు సంగతులు పరిశీలించి, గత్యంతరం లేక తీసేస్తున్నారా లేక కక్షసాధింపుగా తీసేస్తున్నారా అని నిర్ధారిస్తారు. ఇప్పుడు యీ లిమిట్‌ను 300 కు పెంచుతోంది ప్రభుత్వం. యాజమాన్యం యిష్టారాజ్యంగా నడపకుండా చూడడానికి, కార్మిక సంక్షేమానికి యూనియన్‌ ఏర్పాటు అతి ముఖ్యం. ప్రస్తుతం వర్కర్లలో 15% మంది సంఘటితమై యూనియన్‌గా ఏర్పడితే దానికి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు దాన్ని 30% కి పెంచింది ప్రభుత్వం.

గతంలో యుపిఏ ప్రభుత్వం కూడా తమకు మద్దతిచ్చే కార్పోరేట్ల ఒత్తిడికి లొంగి యిలాటి సవరణలే చేయబోయింది. కానీ కాంగ్రెస్‌వారు ట్రేడ్‌ యూనియన్‌ (ఐఎన్‌టియుసి)తో సహా అన్ని యూనియన్లు అభ్యంతరం తెలపడంతో ఆగిపోయింది. కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ లేదు కాబట్టి వారు జంకారు. ఇప్పుడు బిజెపికి పూర్తి మెజారిటీ వుంది. పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం అనే పేర ఏం చేసినా చెల్లుతుంది. అప్పటికంటె యిప్పుడు కార్పోరేట్ల జబర్దస్తీ మరింత పెరిగింది. అందుకే రాజస్థాన్‌ కాబినెట్‌ సవరణలకు ఆమోదం తెలిపిన మర్నాడే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఫ్యాక్టరీ చట్టానికి చేయబోతున్న సవరణలపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ సర్క్యులర్‌ పంపింది. 61 సెక్షన్లకు 54 సవరణలు సూచించింది. అవీ యింత ఘోరంగానూ వున్నాయి. వ్యాపారవర్గాలకు మేలు చేసే క్రమంలో కార్మికులకు నష్టం చేకూర్చడం దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2014)

[email protected]